సచివాలయ పరీక్షలకు 74 శాతం హాజరు

ABN , First Publish Date - 2020-09-21T09:46:04+05:30 IST

సచివాలయ పరీక్షలకు 74 శాతం హాజరు

సచివాలయ పరీక్షలకు 74 శాతం హాజరు

విజయవాడ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రారంభ మయ్యా యి. అభ్యర్థులు కొవిడ్‌ భయాన్ని వీడి, తగిన జాగ్రత్తలతో పరీక్షలు రాశారు. మొత్తం 74 శాతం పరీక్షకు హాజరయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. 


ఆదివారం ఉదయం కేటగిరీ-1 పరీక్షలకు 54,984 మందికి గానూ 40,954 మంది (74.5 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం గ్రేడ్‌-6 కేటగిరీ పోస్టులకు 20,165 మందికి గానూ 14,802 మంది (73.4శాతం) హాజరయ్యారు. 48 మంది విభిన్న ప్రతిభావంతులు పరీక్షలకు హాజరయ్యారు. కేటగిరీ-1 పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 258 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో గదికి 15 మందిని మాత్రమే అనుమతించారు. అభ్యర్థులు, పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే సూపర్‌వైజింగ్‌ సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలతో హాజరయ్యారు.


పరీక్షకు కొవిడ్‌ బాధితులు 

ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ఐసోలేషన్‌ గదులను కూడా ఏర్పాటు చేశారు. కొవిడ్‌ బారిన పడిన అభ్యర్థులతో పాటు, లక్షణాలు ఉన్న వారిని కూడా ఐసోలేషన్‌ గదుల్లో పరీక్షలు రాయించటానికి వీలుగా ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం ఆరుగురు కొవిడ్‌ బాధితులు, ముగ్గురు అనుమానితులు, మధ్యాహ్నం నలుగురు అనుమానితులు ఐసోలేషన్‌ గదుల్లో పరీక్షలు రాశారు. బాధితుల కోసం మందులు, పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచారు. బాధితులు పీపీఈ కిట్‌ ధరించి పరీక్ష రాశారు. ఆ గదుల్లో ఇన్విజిలేటర్‌ కూడా పీపీఈ కిట్‌ ధరించి విధులు నిర్వహించారు. 


జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ 

కొవిడ్‌ కాలంలో నిర్వహిస్తున్న పరీక్షలు కావటంతో కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరీక్షా కేంద్రాలను ఐదు క్లస్టర్లుగా విభజించి, జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్‌ సహా ఈ అధికారులందరూ ఆదివారం ఆయా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

Updated Date - 2020-09-21T09:46:04+05:30 IST