ఇంద్రకీలాద్రిపై మహారుద్ర యాగం

ABN , First Publish Date - 2020-09-21T09:46:30+05:30 IST

ఇంద్రకీలాద్రిపై మహారుద్ర యాగం

ఇంద్రకీలాద్రిపై మహారుద్ర యాగం

విజయవాడ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై శత చండీ సహిత మహారుద్ర యాగం ఆదివారం ప్రారంభమైంది. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత తలపెట్టిన ఈ యాగంలో 55 మందికిపైగా ఆలయ వేదపండితులు, రుత్వికులు, పరిచారకులు పాల్గొంటున్నారు.


శివాలయానికి ఉత్తర భాగాన ఉన్న యాగశాలలో స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం ఆరు గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ దీప ప్రజ్వలన కలశ స్థాపన, వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ మండపారాధనలు, బ్రహ్మ కలశస్థాపన, పంచగవ్య ప్రార్థన తదితర కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేశ్‌బాబు దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌ దంపతులు యాగాన్ని ప్రారంభించారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. యాగం ఐదు రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాగుతుందని, ఈ నెల 24న పూర్ణాహుతితో పరిసమాప్త మవుతుందని స్థానాచార్య శివప్రసాద్‌శర్మ తెలిపారు. కరోనా నివారణ కావాలని, ప్రజలకు శాంతి కలగాలని దుర్గామల్లేశ్వరస్వామి వార్లను కోరుతూ ఈ శత చండీ సహిత మహారుద్ర యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు త్వరలోనే శివాలయాన్ని కూడా పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నందున, ఆ పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తికావాలని యాగం నిర్వహిస్తున్నామని వివరించారు. అయితే దీనికి పరిమితంగానైనా భక్తులను అనుమతించకపోవడం, ఇంత పెద్ద కార్యక్రమానికి హడావిడిగా ఏర్పాట్లు చేయడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురించిన కథనంపై దుర్గగుడి ఏఈవో ఎన్‌.రమేష్‌బాబు స్పందించారు. శివాలయం అభివృద్ధి పనుల కారణంగా ఆరు నెలల నుంచి దర్శనాలను నిలిపివేశామని, శివాలయం పనులు పూర్తయినందున దర్శనాలను పునరుద్ధరించడం కోసం, లోక కల్యాణార్థం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామే తప్ప.. వేరే ఉద్దేశం లేదని ఆయన వివరణ ఇచ్చారు. 

Updated Date - 2020-09-21T09:46:30+05:30 IST