వ్యవసాయశాఖలో ఆసక్తికర చర్చ.. ఏవో వర్సెస్‌ ఏఈవో

ABN , First Publish Date - 2020-08-02T16:52:42+05:30 IST

వ్యవసాయశాఖలో వ్యవసాయాధికారి (ఏవో), వ్యవసాయ శాఖ విస్తరణాధికారి..

వ్యవసాయశాఖలో ఆసక్తికర చర్చ.. ఏవో వర్సెస్‌ ఏఈవో

ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం

ఏఈవోకి మూడు నెలలుగా జీతం నిలుపుదల

కమిషనర్‌తోపాటు కలెక్టరుకు ఫిర్యాదు

ఇన్‌చార్జి పోస్టుతో గాడితప్పిన పాలన


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖలో వ్యవసాయాధికారి (ఏవో), వ్యవసాయ శాఖ విస్తరణాధికారి (ఏఈవో)ల మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. వారిద్దరికి సయోధ్య కుదర్చడంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు విఫలమయ్యారు. దీంతో ఏఈవోకి మూడు నెలలుగా జీతం నిలుపుదల చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఆయన వ్యవసాయశాఖ కమిషనర్‌తోపాటు కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏక్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం జిల్లా వ్యవసాయశాఖలో ఇదే చర్చనీయాంశమైంది.  ఇదంతా  ఆత్మకూరు సబ్‌ డివిజన్‌లో ఓ మండలంలో జరుగుతున్న తంతు.


సయోధ్యకు ససేమిరా..

మూడు నెలలు గడస్తున్నా అటు అధికారులు కాని, ఇటు వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు కాని వారి మధ్య సయోధ్య కుదర్చలేకపోయారు. తన మాట వినడం లేదని, తనకు గౌరవం ఇవ్వడం లేదని ఏవో... తన విధులకు అడ్డుచెబుతున్నారని, తనను వేరే మండలానికి బదిలీ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఏఈఓ..  ఇద్దరూ తెగేవరకు లాగుతున్నారు. దీనిపై ఇప్పటికే దాదాపు రెండు మూడు పర్యాయాలు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారు. అయినా ఫలితం శూన్యం.


వేతనం నిలుపుదల

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగికి జీతం నిలుపుదల చేయాలంటే ఓ పెద్ద కారణం ఉండాలి. అయితే ఏఈవోకి  మూడు నెలలుగా జీతం నిలుపుదల చేసినట్లు తెలిసింది. కేవలం ఏవో మాట వినలేదనే కారణంతోనే జీతం రాకుండా అడ్డుకుంటున్నారని సమాచారం. అయితే ఏవో, ఏఈవో మధ్య నెలకొన్న వివాదం ఆశాఖలో సర్వసాధారమని  సహోద్యోగుల వాదన. అయితే  ఇందుకే జీతం నిలుపుదల చేయడం సరికాదని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు.


కమిషనర్‌కు ఫిర్యాదు

ఈ వివాదం వ్యవసాయశాఖ కమిషనర్‌ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. స్థానిక రైతులు కొంత మంది ఫిర్యాదులు చేశారని అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా ఫిర్యాదులు చేశారని వ్యవసాయశాఖలో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు అందించే జింకు, జిప్సం అమ్ముకున్నారని, స్థానిక పురుగు మందుల దుకాణాల్లో ఎలాంటి అనుమతి లేని పెస్టిసైడ్స్‌ అమ్మిస్తున్నారనే పలు విషయాలపై కమిషనర్‌తోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఏ క్షణంలో ఏంజరుగుతుందోనన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.


గాడి తప్పిన పాలన

జిల్లాలో వ్యవసాయశాఖకు జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌గా రెగ్యులర్‌ అధికారి లేరు. దాదాపు ఏడాది కాలంగా ఇన్‌చార్జి పాలనే దిక్కు. దీంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల పనితీరు సక్రమంగా లేదనేది వాస్తవం. మండల వ్యవసాయాధికారుల పాత్ర ఎంతో కీలకమైంది. అయితే వారిపై పర్యవేక్షణ కొరవడిందనేదానికి కారణం ఇన్‌చార్జి పాలన కావడమేనని కొందరి వాదన. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మనకెందుకులే అనుకునే పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయశాఖలో పాలన గాడితప్పిందని  పలువురు బాహాటంగానే అంటున్నారు.


Updated Date - 2020-08-02T16:52:42+05:30 IST