అమ్మఒడి ఏదీ?

ABN , First Publish Date - 2022-04-15T06:10:23+05:30 IST

అమ్మఒడి చాలా ఆశలు రేపింది. పిల్లల చదువుల ఖర్చుతో సతమతమవుతున్న తల్లిదండ్రులు అమ్మఒడి వస్తుందిగదా అని పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపించారు.

అమ్మఒడి ఏదీ?

విద్యా సంవత్సరం ముగుస్తున్నా అందని డబ్బు

ప్రైవేటు పాఠశాలల్లో చదివే వారికి ఇబ్బంది

ఫీజుల భారంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన


అమ్మఒడి చాలా ఆశలు రేపింది. పిల్లల చదువుల ఖర్చుతో సతమతమవుతున్న తల్లిదండ్రులు అమ్మఒడి వస్తుందిగదా అని పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపించారు. ప్రభుత్వం రెండేళ్లు సక్రమంగా ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో ఈ పథకం ఉందా.. ఎత్తిపోయిందా? అనే సందేహాలు తల్లిదండ్రుల్లో కలుగుతున్నాయి. 


నంద్యాల-ఆంధ్రజ్యోతి: అమ్మఒడి పథకం గురించి వైసీపీ ప్రభుత్వం చాలా గొప్పలు పోయింది. పిల్లలందరినీ చదివించే బాధ్యత తనదేనని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున కోట్ల రూపాయల డబ్బును లక్షలాది మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం జూన్‌లో మళ్లీ అమ్మఒడి డబ్బులు వేస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో చెప్పారు. అయినా ఈ పథకం అమలుపై పలు సందేహాలు ఉన్నాయి. 2019-20, 2020-2కిగాను అమ్మఒడి సొమ్ములను ఆ సంవత్సరం జనవరి నెలలో తల్లిదండ్రుల ఖాతాలో జమ చేశారు. కానీ 2021-22 సంవత్సరం అమ్మఒడి డబ్బులను మాత్రం జూన్‌లో ఇస్తామంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. కాబట్టి పూర్తి ఫీజులు చెల్లిస్తే తప్ప ప్రైవేటు పాఠశాలలు తమ పిల్లలను పరీక్షలకు హాజరు కానివ్వరేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆ తర్వాత ఇచ్చినా ఏం ప్రయోజనం అంటున్నారు. 


అనర్హుల పేరిట..


జిల్లాలో లక్షల మంది విద్యార్థులు అమ్మఒడి ద్వారా లబ్ధిపొందారని అధికారులు చెబుతున్నారు. కానీ అసలు లెక్కలు చూస్తే ఇందులోని డొల్లతనం బైటపడుతుంది. ఈ పథకాన్ని ప్రారంభించడానికి ముందు.. ఒక ఇంట్లో నుంచి బడికి వెళ్లే పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి వర్తిస్తుందని మాట మార్చింది. పోనీ అదైనా సక్రమంగా ఇచ్చారా? అంటే అదీ లేదు. మొదటి ఏడు రూ.15 వేలు ఇచ్చిన ప్రభుత్వం రెండో ఏట ఒక వెయ్యి తెగ్గోసి రూ.14 వేలు మాత్రమే ఇచ్చింది. ఇక కరెంటు బిల్లు, కారు, భూమి ఉన్నవారికి పథకం వర్తించదని లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి లేకుండా చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1 నుంచి ఇంటర్‌ చదివే 7,81,348 మంది విద్యార్థుల వివరాలు సేకరించగా, 6,64,822 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించింది. వీరిలో 3,81,680 మందికి అమ్మఒడిని అందించింది. ఇక 2020-21 సంవత్సరానికి గాను 8,14,351 మంది విద్యార్థులను సర్వే చేసి, 6,84,197 మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 4,12,884 మంది మాత్రమే అమ్మఒడి డబ్బులు అందుకున్నారు. ఈ లెక్కల ప్రకారం మొదటి విడతలో 2,83,142 మంది, రెండో విడతలో 2,71,213 మంది అర్హత ఉండి కూడా అమ్మఒడి వల్ల లబ్ధి పొందలేకపోయారు. రెండు విడతల్లో కలిపి దాదాపు 5.42 లక్షల మందికి పైగా పథకానికి దూరమయ్యారు. మరోవైపు అమ్మఒడిని ఘనంగా అందించామని చెబుతూనే వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల జేబులకు చిల్లు పెట్టింది. ప్రతి లబ్ధిదారుడి నుంచి పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణ కోసమని రెండో విడతలో వెయ్యి రూపాయలు కోత విధించింది. 


నిరాశేనా?


అమ్మఒడి పథకం కోసం ఆశపడి కొందరు పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. రెండేళ్లపాటు జనవరి 26న సొమ్ము జమవడంతో పిల్లల ఫీజులు సక్రమంగానే చెల్లించారు. ఈ సంవత్సరం జూన్‌లో ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ చివరి నాటికి, 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు మే రెండో వారం నాటికి విద్యా సంవత్సరం ముగుస్తుం ది. ఆలోగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించాలి. లేకపోతే కనీసం హాల్‌ టికెట్లు కూడా ఇవ్వరని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు.


వచ్చేదెవరికో..!


జూన్‌లో మళ్లీ కొత్త విద్యా సంవత్సరం మొదల య్యాక అమ్మఒడి అప్పుడు ఇస్తానని ప్రభుత్వం చెబు తోంది. విద్యా సంవత్సరం పూర్తి చేసిన వారికి ఇస్తా రా? లేక కొత్త విద్యార్థులకు ఇస్తారా? అనే సందేహాలు ఇప్పటి నుంచే చాలామంది తల్లిదండ్రులను తొలుస్తోం ది. ఒకవేళ అలా చేస్తే 10వ తరగతి పూర్తి చేసిన వారు వేరే కళాశాలలో చేరుతారు కదా! మరి వారి పరిస్థితి ఏమిటనేది తెలియదు. ఇక ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి మరో రకంగా ఉంది. వీరికి తొలి సంవత్సరం అమ్మఒడి కింద నగదు జమ చేశారు. గత ఏడాది సక్రమంగా జమ కాలేదు. ఈ సంవత్సరం జూనియర్‌ కళాశాలలకు ఎలాంటి సూచనలు రాలేదు. విద్యార్థులకు హాజరు నమోదు చేయాలని కూడా ఆదేశాలు లేవు. దీంతో ఇంటర్‌ విద్యార్థులకు ఈ సారి లబ్ధి చేకూరడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


పనిచేసేవెన్నో..?


పాఠశాలల్లో యాప్‌ విధానం తీసుకువచ్చాక ప్రభుత్వ ఉపాధ్యా యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గతంలో ఉపాధ్యా యులు డీఈవో కార్యాలయం ముందు ధర్నాకు కూడా దిగారు. నెట్‌వర్క్‌ సరిగా పనిచేయకపోవడం, అప్‌లోడ్‌ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు వస్తుండడంతో సమయమంతా యాప్‌లకే సరిపోతోంది. ఇక పాఠశాలకు వచ్చీ రాగానే పిల్లలకు హాజరు తీసుకునేలా చూస్తే ఒక పిరియడ్‌ వృథా అవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి తోడు చాలా పాఠశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు సరిగా పని చేయడం లేదని, వాటిని బాగు చేసేవారికి ప్రభుత్వం సరిగా డబ్బులు చెల్లించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు జేబులో డబ్బులు ఖర్చు చేసి బయోమెట్రిక్‌ యంత్రాలను బాగుచేయించుకుంటున్నారని సమాచారం. ఇక నెట్‌వర్క్‌ సరిగా పనిచేయని చోట్ల ఉపాధ్యాయల బాధలు వర్ణనాతీతం. ప్రతి పదిహేను, నెల రోజులకోసారి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పిల్లల హాజరు రిపోర్టులను పంపిస్తుంటామని, పథకానికి ప్రామాణికం హాజరు శాతమే అయితే ఈ రిపోర్టునే తీసుకోవచ్చని, దానికోసం ప్రత్యకంగా బయోమెట్రిక్‌ హాజరు అవసరం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. 


హాజరుకు లింకు..


పాఠశాల హాజరు 75 శాతం ఉంటేనే విద్యార్థులు పథకానికి అర్హులని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ నెల 8 నుంచే పాఠశాలల్లో బయోమెట్రిక్‌ అమలు చేయాలని సూచించింది. అది కూడా ఉదయం తొమ్మిది నుంచి పది గంటలలోపు హాజరు వేయించాలని చెప్తోంది. గత సంవత్సరం కొవిడ్‌ కారణంగా 75 శాతం హాజరుకు మినహాయింపునిచ్చినా, ఈ సంవత్సరం హాజరు శాతం తప్పనిసరి అంటూ ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రకారం వచ్చే ఏప్రిల్‌ 30 వరకు 130 పనిదినాల్లో 75 శాతం హాజరు అంటే 98 రోజులపాటు హాజరు పడాల్సిందే! దీనిపై అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. సాంకేతిక సమస్యతో బయోమెట్రిక్‌లో హాజరు పడకపోతే విద్యార్థులు వచ్చినా రానట్టే! ఒకవేళ ఏదైనా పాఠశాలలో బయోమెట్రిక్‌ యంత్రం వారం రోజులపాటు పని చేయకపోతే హాజరు పడదు కాబట్టి ఆ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తగ్గే ప్రమాదం ఉంది. ఇక పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు వచ్చే విద్యార్థులు సాధారణంగా కొంత ఆలస్యంగానే వస్తారు. అటువంటి విద్యార్థులకు నిర్ణీత సమయంలోనే హాజరు వేయడానికి కుదరదు. ఇలాంటి రకరకాల కారణాలతో చాలామంది విద్యార్థులు పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులైన తల్లిదండ్రులు ఈ విధానంపై ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-04-15T06:10:23+05:30 IST