చేనేతకు చేయూతఏదీ..?

ABN , First Publish Date - 2022-05-11T05:49:51+05:30 IST

నాలుగేళ్లుగా చేనేత ముడి సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి.

చేనేతకు చేయూతఏదీ..?
మగ్గం నేస్తున్న చేనేత కార్మికురాలు

నాలుగేళ్లుగా చేనేత ముడి సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. గత  ఆరునెలల్లో ముడిసరుకుల ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ ప్రభావం చేనేత కార్మికులపై తీవ్రంగా ఉంది. నెలకు దాదాపు 15 చీరలు నేసే కార్మికులు ధరలు  ఇలా పెరగడంతో  కేవలం ఎనిమిది చీరలకు మించి నేయలేకపోతున్నారు. ముడి సరుకులు కొనలేక కొందరు మాస్టర్స్‌ వీవర్స్‌  మగ్గాలను నిలిపి వేస్తున్నారు. దీంతో ఆదాయం భారీగా పడిపోయి, ఉపాధి దొరకని స్థితికి  చేనేత కార్మికులు చేరుకుంటున్నారు. చేనేత మీద ఆధారపడి జీవించడం కష్టమైపోయింది. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే  కార్మికులకు చేనేత భారమైపోతుంది. ముడిసరుకుల ధరలు తగ్గించి  ఉపాధి అవకాశాలు కల్పించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. 


ఎమ్మిగనూరు, మే 10: ఎమ్మిగనూరు పట్టణంతోపాటు చుట్టుముట్టు గ్రామాలైన గుడికల్‌, నందవరం, నాగలదిన్నె, పెద్దమరివీడు, కోడుమూరు ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో దాదాపు నాలుగు వేలకు పైగా మగ్గాలు ఉన్నాయి. ఇక వంద నుంచి 200 మగ్గాలు నడిపే మాస్టర్‌ వీవర్స్‌ ఆరుగురు, 50 మగ్గాలలోపు నడిపేవారు 25మందికి పైగా ఉన్నారు. వీరు చేనేత కార్మికులకు నిత్యం ముడిసరుకు ఇచ్చి వివిధ రకాల చీరలు నేయిస్తుంటారు. ఒక చీర నేస్తే కూలీ కింద రూ.2200 ఇస్తారు. ప్రస్తుతం ముడిసరుకుల ధరలు రెట్టింపు కావటంతో దాదాపు 20శాతం మగ్గాలు అంటే దాదాపు 600 నుంచి 800మగ్గాలు నిలిచిపోయి ఉంటాయని సమాచారం. దీంతో చేనేత కార్మికులు ఇతర పనులకు వెళ్లి జీవనోపాధి వెతుక్కోవాల్సి వచ్చింది. 


దిగుమతి లేకపోవటమే.. 


పట్టు, జరీచీరల తయారీలో ప్రధానంగా వాడే పట్టు, జరీ ఇతర దేశాల నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. కొంత కాలం నుంచి కేంద్రం పట్టు, జరీ దిగుమతిని నిలిపివేసింది. దీంతో ముడిసరుకుల ధరలు అమాంతంగా పెరిగి పోయి రెంటింపు ధరలు పలుకుతున్నాయి. అయితే అదే స్థాయిలో చీరల ధరలు మాత్రం పెరగటం లేదు. దీంతో మాస్టర్‌ వీవర్స్‌కు, సొంతంగా మగ్గాలు నేసే చేనేత కార్మికులకు నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాన్ని భరించలేక మగ్గాలను నిలిపివేస్తున్నారు. 


మగ్గాలను మూసేసుకోవాల్సిందే


ఆరు నెలల కాలంలో జరీ చీరలకు అవసరమైన ముడిసరుకుల ధరలు రెట్టింపు అయ్యాయి. దీంతో వేల రూపాయలు పెట్టుబడిపెట్టి నేయించిన చీరలు నష్టానికి అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక చీర తయారు చేసేందుకు మాకు రూ. 6500 పడుతుంది. అలాంటి చీరను మార్కెట్‌లో దుకాణదారుడు రూ. 6300లకు అడుగుతున్నాడు. ఇలా నష్టానికి ఎలా అమ్ముకోవాలి.. ధరలు ఇలాగే పెరిగితే మగ్గాలను మూసుకోక తప్పదు. 


- గడిగె ఈరన్న, ఎమ్మిగనూరు 

 

 చేనేత కార్మికులను ఆదుకోవాలి


ముడిసరుకుల ధరలు రెట్టింపు కావటంతో మాస్టర్‌ వీవర్స్‌ చీరలు నేయించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నధరలతో చీరెలు తయారు చేస్తే నష్టం వచ్చేఅవకాశం ఉంది. మగ్గాలు ఆగిపోతే చేనేతకార్మికులు ఉపాధి కోల్పోవలసి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేనేతముడిసరుకుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకొని చేనేత కార్మికులను ఆదుకోవాలి. 

 

- శంకరన్న, చేనేత జన సమాఖ్య నాయకులు, ఎమ్మిగనూరు 

Read more