ప్రజల ప్రాణాల తరువాతే అన్నీ!

ABN , First Publish Date - 2020-04-01T06:01:46+05:30 IST

ప్రపంచం అంతా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. కరోనా ప్రతాపానికి సంపన్న దేశాలైన అమెరికా, చైనా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం విలవిలలాడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది...

ప్రజల ప్రాణాల తరువాతే అన్నీ!

లాక్‌డౌన్ వల్ల దేశానికి రోజుకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందన్న మాట వాస్తవమే. పేదలకు ఇది శరాఘాతమే. అందుకే జరిగే నష్టాన్ని తట్టుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలకు వైద్యపరమైన సహాయాలతో పాటు నిత్యావసర వస్తువుల సరఫరాను పెంచింది. మూడు నెలలకు  సరిపడా బియ్యం, గోధుమలు, చక్కెర విడుదల చేసింది. రైతులు పండించిన పంటను ఇంటికి తేవడానికి, ఇంటికొచ్చిన పంటను మార్కెట్లో అమ్మడానికి తగిన ఏర్పాట్లు, గిట్టుబాటు ధరలు కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది.


ప్రపంచం అంతా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. కరోనా ప్రతాపానికి సంపన్న దేశాలైన అమెరికా, చైనా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం విలవిలలాడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. కనిపించని శత్రువుపై ప్రపంచం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో ప్రతి ఒక్క పౌరుడూ సైనికుడే. అందరి సహకారంతో జరగాల్సిన పోరాటమిది. కొద్దిరోజుల పాటు ఎక్కడివారక్కడే వుండి, గృహనిర్బంధాన్ని పాటిస్తే కరోనా విస్తరణను అడ్డుకోవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది.

అందుకే ప్రధానమంత్రి మోదీ ముందుచూపుతో భారతదేశంలో మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించారు. లాక్‌డౌన్‌వల్ల అత్యవసర సర్వీసులు, నిత్యావసరాలు మినహా మిగతా అన్నీ మూతపడ్డాయి. దేశంలోని రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేసి రక్షణ చర్యలు చేపట్టాయి. కేంద్రప్రభుత్వం జాతీయస్థాయిలో కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్రాలతో, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ కరోనా నియంత్రణ చర్యలు చేపడుతోంది. అయితే ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా చిత్తశుద్ధితో కరోనాపై జరుగుతున్న పోరులో లాక్‌డౌన్‌కు సహకరించి ఇంటికే పరిమితమవ్వాలి. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులుండవచ్చు. దేశానికి వేల కోట్ల రూపాయలు నష్టం రావచ్చు. కానీ ఆర్థిక నష్టం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం. అందుకే ప్రధాన మంత్రి మోదీ కూడా ప్రజలను ఇబ్బందిపెడుతున్నందుకు మన్నించమని వేడుకుంటూ, ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ఇంతకుమించి మార్గం లేదని చెబుతున్నారు.

ఎంతో ముందు చూపుతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన దేశంలో కరోనా వేగంగా విస్తరించకుండా అడ్డుకునే అవకాశం ఏర్పడింది. కరోనా వ్యాప్తిని నిలువరించాలంటే దాని సాంక్రమిక వృత్తాన్ని తెగ్గొట్టాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్ వల్ల వ్యాధి ప్రబలకుండా అరికట్టవచ్చు. ఈ లాక్‌డౌన్ సమయంలో కేసులను వెనువెంటనే గుర్తించి చికిత్స చేసే అవకాశం వుంటుంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లాంటి దేశాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ‘కరోనాతో ఇరాన్‌కు ముప్పేమీ లేదు, క్వారంటైన్ చేయడం రాతియుగపు లక్షణమని’ వ్యాఖ్యానించిన ఇరాన్ మంత్రి ఇరాజ్ ఆ తరువాత రోజే కరోనా బారిన పడ్డారు. ఆయన ఇరాన్‌లో కరోనా వ్యతిరేక పోరాట విభాగానికి అధిపతి కూడా. ఇక అమెరికాలో రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతూ అక్కడి ప్రజలను, ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఐరోపా దేశాల్లో ఇప్పటికి 20 వేల మందికి పైగా కరోనాతో మరణించారు. యూరప్, అమెరికాతో పోల్చినప్పుడు మనకు వైద్య సదుపాయాలు తక్కువే. మన జనాభా మాత్రం అమెరికా జనాభా కంటే మూడు రెట్లు ఎక్కువ. జనసాంద్రత కూడా ఎక్కువే. రోడ్లు, ప్రజారవాణా, కార్యాలయాలు జనంతో కిక్కిరిసి వుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే పరిస్థితి మనచేతుల్లో వుండదు. అందుకే కేంద్రప్రభుత్వం సత్వరం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మన దేశంలో కరోనా కేసుల పెరుగుదలను మిగతా దేశాలతో పోలిస్తే గణనీయంగా తగ్గించగలిగాము. 

లాక్‌డౌన్ వల్ల దేశానికి రోజుకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందన్న మాట వాస్తవమే. పనికి వెళ్ళితే తప్ప నాలుగువేళ్లు నోట్లోకి పోని నిరుపేదలకు ఇది శరాఘాతమే. అందుకే జరిగే నష్టాన్ని తట్టుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలకు వైద్యపరమైన సహాయాలతో పాటు నిత్యావసర వస్తువుల సరఫరాను పెంచింది. మూడు నెలలకు సరిపడా బియ్యం, గోధుమలు, చక్కెర విడుదల చేసింది. రైతులు పండించిన పంట ను ఇంటికి తేవడానికి, ఇంటికొచ్చిన పంటను మార్కెట్‌లో అమ్మడానికి తగిన ఏర్పాట్లు, గిట్టుబాటు ధరలు కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉపాధి కోసం దేశం లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కూలీలకు అండగా వుండి, ఆహారం, ఆశ్రయం కల్పించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ఆక్వా, పౌల్ట్రీ రంగాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం వుంది. లాక్‌డౌన్ వల్ల పేదలు పస్తులుండరాదన్న మానవీయ దృక్పథంతో కేంద్రం పలు చర్యలు తీసుకుంది. సామాన్యులకు ఆర్థిక భద్రత, పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు మోదీ కృత నిశ్చయంతో వున్నారు. లాక్‌డౌన్ ప్రకటించిన 36 గంటల్లోనే వారి కోసం ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో కేంద్రం ఒక లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజి ప్రకటించింది. ఈ ప్యాకేజి కింద దేశంలో 80 కోట్ల మంది పేదలకు ౩ నెలల పాటు ఉచితంగా నెలకు 5 కిలోల చొప్పున గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పు ధాన్యాలు ఇప్పుడిస్తున్న రేషన్‌కు అదనంగా ఇస్తారు. జన్‌ధన్ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ.500 చొప్పున ఖాతాలో జమ చేస్తారు. ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202కు పెంచింది. పిఎం కిసాన్ యోజన లబ్ధిదారులైన రైతులకు ఖరీఫ్ సాయం కింద ఏప్రిల్ లోనే రూ.2 వేలు ఇవ్వనున్నారు. డ్వాక్రా మహిళల రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు సరఫరా చేయనుంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రెండు విడతల్లో వెయ్యి రూపాయలు ఇవ్వనుంది. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్య శాఖ, పారామెడికల్ ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా ఇస్తోంది. వందమంది లోపు ఉద్యోగులుండే సంస్థల్లో పనిచేసే వారి పిఎఫ్ కేంద్రమే చెల్లించనుంది. రైతులకు, వ్యవసాయ కూలీలకు కేంద్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.  

ఒకవైపు వ్యాధి ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటూనే మరో వైపు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది, మధ్యతరగతి, వ్యాపారవర్గాలకు ఊరటనిచ్చే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు నిర్ణయాలు ప్రకటించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రుణ వాయిదాల చెల్లింపులపై భయాందోళనలకు ఆర్బీఐ చెక్ పెట్టింది. బ్యాంకులిచ్చిన అన్ని రకాల రుణాల కిస్తీలను, క్రెడిట్ కార్డు బిల్లులను మూడు నెలల పాటు వాయిదా వేసింది. వర్కింగ్ క్యాపిటల్ పై వడ్డీలకు మూడు నెలలపాటు మారటోరియం విధించింది. కొత్తగా ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది. రెపో రేటును 4.4 శాతానికి, రివర్స్ రెపో రేటును 4 శాతానికి తగ్గించడం, బ్యాంకుల నగదు నిల్వ నిష్పత్తిని గణనీయంగా తగ్గించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలోకి నగదు లభ్యత పెరగనుంది. జిడిపిలో 2 శాతానికి సమానమైన రూ.3.74 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి రానుంది. దీని వల్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు మేలు జరగనుంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.  

మనం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా ఇవ్వాళ్టివరకు మిగతా ప్రపంచం కంటే మనం ఎంతో మెరుగైన స్థితిలో ఈ వైరస్‌ను అదుపులో పెట్టాము. పలుదేశాల్లో వేలాది కేసులు, మరణాలు సంభవించాయి. భారతదేశంలో మాత్రం ఇప్పటివరకు 1200 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ వ్యాధిని దేశం నుంచి తరిమికొట్టే వరకు ప్రజలు, పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం విశ్రమించకూడదు. మరికొన్ని రోజులు ఇబ్బందులను తట్టుకుంటే స్వల్ప నష్టంతో మనం బయటపడే అవకాశం వుంది. లాక్‌డౌన్‌లోనూ విరామం లేకుండా పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది శ్రమ, త్యాగం వెలకట్టలేనిది. అన్ని వర్గాలూ సామాజిక బాధ్యతతో ప్రభుత్వానికి సహకరించి మరి కొద్ది రోజులు ఇలాగే ఇళ్లకి పరిమితమైతే కరోనాపై జరుగుతున్న యుద్ధంలో దేశం విజయం సాధిస్తుంది.


వై.ఎస్‌. చౌదరి

(రాజ్యసభ సభ్యులు)



Updated Date - 2020-04-01T06:01:46+05:30 IST