ఎవరికో..?

ABN , First Publish Date - 2021-09-29T05:34:49+05:30 IST

‘మంత్రి రేసులో ఉన్నాం కదా! ఎక్కడ అవకాశమొస్తుందోనని అందరి కళ్లు మామీదే.

ఎవరికో..?

  1.  అమాత్య పదవి కోసం అందరి ఆరాటం
  2.  బుగ్గన, గుమ్మనూరుకు పొంచి ఉన్న గండం
  3.  తొలిసారి ఎమ్మెల్యేలలో చిగురిస్తున్న ఆశలు
  4.  సీనియర్లలో పెరుగుతున్న పోటీ
  5.  ఆరుసార్లు ఎమ్మెల్యేకి మళ్లీ రిక్తహస్తం?


‘మంత్రి రేసులో ఉన్నాం కదా! ఎక్కడ అవకాశమొస్తుందోనని అందరి కళ్లు మామీదే. అందుకే బురద చల్లే యత్నం చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా సీఎంకు నా గురించి బాగా తెలుసు’ 

- తొలిసారి గెలిచిన ఓ ఎమ్మెల్యే వినిపిస్తున్న రాగం ఇది. 


‘ఆ పార్టీలో ప్రధాన పదవి వదులుకుని వచ్చా. నాకు కాకుండా ఎవరికిస్తారిక్కడ? నాకు హామీ కూడా ఇచ్చేశారు. ప్రకటన ఒక్కటే ఆలస్యం’ 

- నంద్యాల లోక్‌సభ పరిధిలోని ఓ సీనియర్‌ నేత ధీమా ఇది. 


కర్నూలు, ఆంధ్రజ్యోతి:

జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఫీవర్‌ పట్టుకుంది. మంత్రి వర్గం మార్పుపై రోజుకో ఊహాగానం వెలువడుతున్న నేపథ్యంలో సీనియర్ల నుంచి జూనియర్ల దాకా అందరూ ధీమాగా ఉన్నారు. ప్రస్తుత మంత్రులి ద్దరిపైనా వేటు పడుతుందన్న తాజా వార్తలతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తొలిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు 50ు అవకాశం కల్పించగా.. ఈసారి కూడా అదేతీరు కనిపిస్తోంది. 


 కొత్త ఎమ్మెల్యేలు..

వైసీపీ తొలి మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే గుమ్మనూరు జయరాంకు మంత్రి అయ్యారు. ఈసారి కూడా అదే పాలసీ ప్రకారం ఎంపిక జరగవచ్చనే  అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో తొలిసారి గెలిచిన ఎస్సీ, మైనారిటీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో తొలిసారిగా ఎన్నికైన వారు ఉండగా.. ఇందులో ఓ నియోజకవర్గంలో ఇప్పటికే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రాధాన్యం కోల్పోతున్నానంటూ పలు సార్లు రోడ్డెక్కిన ఆయన కొందరు బడా నాయకుల పెత్తనాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. మంత్రుల సమక్షంలో బాహాబాహీకి దిగిన ఘటనలూ ఉన్నాయి. అలాగే కర్నూలు నియోజకవర్గం నుంచి హఫీజ్‌ఖాన పేరు కూడా వినిపిస్తోంది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ పంచాయతీ, జడ్పీ ఎన్నికల్లో సంక్షోభం ఎదుర్కొన్నారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో కోడుమూరులో టీడీపీ హవా ప్రస్ఫుటంగా కనిపించడం ఆయనకు మైనస్‌గా చెబు తున్నారు. విభేదాలు, ఆరోపణలు, బెదిరింపులు తదితర వాటిపై అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. 


ఆ ఇద్దరికీ పదవీ గండం

వైసీపీ అధికారంలోకి రాగానే జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాంకు మంత్రి పదవులిచ్చింది. ఇందుకు కృతజ్ఞతగా జగనపై వీలైనపుడల్లా గుమ్మనూరు పొగడ్తల వర్షం కురిపించారు. ఎస్సీలకు జగన ఒక జీసస్‌ అని, ముస్లింలకు అల్లా అని, బోయలకు వాల్మీకి అని గుమ్మనూరు నెత్తికెత్తికున్నారు. అయితే నియోజకవర్గంలో ఆయనపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. బంధువుల పేకాట వ్యవహారం, భూముల కబ్జా ఆరోపణలు, బెంజి కారు ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టాయి. దీంతో ఆయనపై వేటు పడవచ్చన్న చర్చ సాగుతోంది. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా పదవీ గండం తప్పదనే తెలుస్తోంది. 


 సీనియర్‌ ఎమ్మెల్యేలు..

నంద్యాల లోక్‌సభ పరిధిలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కర్నూలు లోక్‌సభ పరిధిలో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. అయితే ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికి పదవులు దక్కే అవకాశం లేదని స్పష్టమవుతోంది. శిల్పా మాత్రం తనకే పదవి అంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గుమ్మనూరు పదవి నుంచి వైదొలగితే తనకే మంత్రి పదవి దక్కుతుందని సాయిప్రసాద్‌రెడ్డి ఆశిస్తూ వచ్చారు. ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడిని అధినాయకత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతోందనే భావన పార్టీ వర్గాల్లో బలపడుతోంది. నామినేటెడ్‌ పోస్టుల్లో భాగంగా ఇటీవల టీటీడీ బోర్డు మెంబర్‌గా కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆయనకు కేటాయించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను మంత్రి వర్గ విస్తరణలో అవకాశం లేకుండా చేస్తున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైఎస్‌తో సత్సంబంధాలు ఉన్న ఆయనకు నియోజకవర్గంలో పేరున్నప్పటికీ ముక్కు సూటిగా మాట్లాడడమే ఆయనకు మైనస్‌గా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై ఓ యువ నాయకుడు కన్నేశారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకే సీటు కేటాయించాలని ఇప్పటి నుంచే అధినాయకత్వం వద్ద ప్రతిపాదనలు కూడా పెట్టారని తెలుస్తోంది. 

Updated Date - 2021-09-29T05:34:49+05:30 IST