గిరిజనులకు ఏదీ దారి?

ABN , First Publish Date - 2020-07-12T08:11:27+05:30 IST

అడవుల్లో అవకాశాలకు దూరంగా, ఆపదలకు దగ్గరగా జీవించేవారు కొందరు! మైదానాల్లో సమాజానికి సుదూరంలో, సమస్యలకు మరీ చేరువలో ఉండేవారు కొందరు!

గిరిజనులకు ఏదీ దారి?

  • సంక్షోభంలో 35 తెగల సంక్షేమం
  • ప్రత్యేక అభివృద్ధి పథకాలన్నీ రద్దు
  • అందరితోపాటు వారికీ నవరత్నాలే
  • పెళ్లికానుకకు వైఎస్‌ పేరు
  • తాజా బడ్జెట్‌లో కేటాయింపులు సున్నా
  • వాటా ఆపడంతో నిధులివ్వని కేంద్రం
  • గిరిజన విదేశీ, ఉన్నతవిద్యకు స్వస్తి
  • అందరికీ చెందే అమ్మఒడిలోనే అన్నీ
  • గిరిజన గురుకులాల్లో రెన్యువల్‌ కాక
  • 1650 మంది టీచర్లకు వేతనాల్లేవు
  • నిలిచిపోయిన ఎస్టీ గృహ నిర్మాణాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అడవుల్లో అవకాశాలకు దూరంగా, ఆపదలకు దగ్గరగా జీవించేవారు కొందరు! మైదానాల్లో సమాజానికి సుదూరంలో, సమస్యలకు మరీ చేరువలో ఉండేవారు కొందరు! అందరూ గిరిజనులే! రాష్ట్ర జనాభాలో వీరు 5.53 శాతం. దాదాపు 35 రకాల తెగలు రాష్ట్రంలో మనుగడ సాగిస్తున్నాయి. ఈ తెగల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నెన్ని పథకాలో! కార్పొరేట్‌ చదువులు, ఉన్నత విద్యకోసం పెట్టిన విదేశీ విద్య, స్వయం ఉపాధి పథకాలు, యువతకు కల్యాణ పథకాలు.. ఇలా ప్రత్యేకంగా పథకాలను రూపొందించి గత ప్రభుత్వాలు అమలు చేశాయి. కొత్త ప్రభుత్వం రావడంతోనే అవన్నీ నిలిచిపోయాయి. వైసీపీ మానసపుత్రిక నవరత్నాలే ఏ జాతికైనా దిక్కు అన్న భావనతో.. ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దీంతో అందరికీ సాధారణంగా అందే ‘నవరత్నాలే’.. గిరిజనులకూ దిక్కు అవుతున్నాయి. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే ఎన్‌ఎ్‌సటీఎ్‌ఫడీసీ (జాతీయ గిరిజన తెగల ఫైనాన్స్‌, అభివృద్ధిసంస్థ) నిధులకు బ్రేకులు పడ్డాయి. చిన్న చిన్న పనులు చేసే గిరిజన కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. గిరిజన సహకార కార్పొరేషన్‌కు అత్తెసరు నిధులు విదిలించారు.


పెళ్లికి పైసా ఇవ్వలేదు..

గిరిపుత్ర కల్యాణ పథకంలో కొత్తగా పెళ్లయిన ఎస్టీ వధువులకు గతంలో రూ.50 వేలు ప్రోత్సాహకంగా అందేది. దీంతో పాటు కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతకు కూడా ఆర్థిక సాయం అందించేవారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని మ రింత విస్తృతం చేసింది. చంద్రన్న పెళ్లి కానుక పేరు తో 10 రకాల పెళ్లికానుకలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని వైఎ్‌సఆర్‌ పెళ్లికానుకగా మార్చింది. ప్రోత్సాహక నగదును రూ. లక్షకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. 2019-20లో పెళ్లికానుక కోసం బడ్జెట్‌ కూడా కేటాయించారు. అయితే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులే చూపించలేదు.


చదువుకు ఎగనామం

పదోతరగతి లోపు గిరిజన విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకం’ తెచ్చాయి.  బాగా శిక్షణ అందించే కార్పొరేట్‌ స్కూళ్లను గుర్తించి..ఏటా మెరికల్లాంటి గిరిజన పిల్లలకు వాటిలో మెరుగైన విద్యను అందించేవారు. అందుకోసం అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేది. అదే విధంగా పదోతరగతిలో ఉత్తీర్హత సాధించి కళాశాల విద్య చదవాలనుకునే మెరిట్‌ విద్యార్థులను పలు  కార్పొరేట్‌ కళాశాలల్లో చదివించేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేది. చదువుతో పాటు వారి వసతి ఖర్చులను తానే భరించేది. సివిల్స్‌, ఏపీపీఎస్సీ, డీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు అవసరమయ్యే ఖర్చు ‘ఎన్టీఆర్‌ విద్యోన్నతి’ కింద గిరిజన నిరుద్యోగులకు అందే ది. విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదవాలనుకునే గిరిజన విద్యార్థులకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి.. నిజానికి ఒక వరమే! ఈ పథకం ద్వారా 18 దేశాల్లో 16 రకాల కోర్సులు చదివేందుకు గిరిజన విద్యార్థులకు ఏటా రూ.15 లక్షల ఆర్థిక సాయం లభించేది. ఈ పథకాలన్నీ ఇప్పుడు రద్దయ్యాయి. వాటి స్థానంలో జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన పథకాలను తెచ్చారు. ‘అమ్మఒడి’ ఉండగా ఈ పథకాలన్నీ ఎందుకని గిరిజనులకు నేరుగా లబ్ధిని అం దించే అన్నీ పథకాలను రద్దు చేశారు. అయితే, ఇవ న్ని కూడా కులాలకు చెందిన విద్యార్థులకు అందే పథకాలు. ఎస్టీ విద్యార్థుల అభ్యున్నతికి ఈ ప్రభు త్వం ప్రత్యేకంగా ఇంకేం చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 1650 మంది పనిచేస్తున్నారు. వారికి ఏటా ఏప్రిల్‌ 23కు కాంట్రాక్టు గడువు పూర్తవుతుంది. తిరిగి జూన్‌ 12 నుంచి విధుల్లోకి చేరతారు. కరోనా కారణంగా గురుకుల టీచర్లకు ఈ ఏడాది రెన్యువల్‌ చేయలేదు.  


నామ్‌కేవాస్తే కార్పొరేషన్‌..

ఏటా వేల మంది గిరిజన యువతకు స్వయంఉపాధి యూనిట్లను 60ు సబ్సిడీతో గత ప్రభుత్వం అందించిం ది. పలు రకాల మోటారు వాహనాలతోపాటు ఇన్నో వా కార్లను గిరిజన సంక్షేమ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా మం జూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పలు రకాలైన యం త్రాల కొనుగోలుకు రూ.లక్ష నుంచి రూ.20 లక్షల దాకా రుణసాయం బ్యాంకుల ద్వారా అందించింది. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంతమందికి ఎన్‌ఎ్‌సటీఎ్‌ఫడీఎస్‌ సహకారంతో నేరుగా ప్రభుత్వమే రుణాలందించేది. ఏటా 5 వేల మం ది ఎస్టీ నిరుద్యోగ యువత లబ్ధి పొం దారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం ఉపాధి పథకాలన్నింటికీ మంగ ళం పలికారు. కాంగ్రెస్‌ హయాం లో నిర్లక్ష్యం చేసిన ఎన్‌ఎ్‌సటీఎ్‌ఫడీసీని పూర్వ సీఎం చం ద్రబాబు పునరుద్ధరిస్తే, కొత్త ప్రభుత్వం తిరిగి మూలకు నెట్టేసింది. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం ఆ నిధులను నిలిపేసింది. పలు ఐటీడీఏ ప్రాజెక్టుల ద్వారా గిరిజనులకు గొర్రెలు, బర్రెలు తదితర ఆర్థికాభివృద్ధి యూనిట్లను 90% సబ్సిడీతో గతంలో అందించేవారు. పేద ఎస్టీ రైతులకు విద్యుత్‌ సౌకర్యం, బోర్లు, మోటార్లు, పైపులు అందేవి. అయితే, నవరత్నాలు అమల్లో ఉన్నందున ఆ పథకాలేవీ అవసరం లేదన్న ప్రభుత్వం వైఖరితో గిరిజనం అయోమయంలో పడ్డారు. గత ప్రభుత్వంలో ఎస్సీల అభివృద్ధి కోసం మంజూరుచేసిన వందల కోట్ల పనులను వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిలిపివేసింది. సుమారు రూ.వెయ్యి కోట్లతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టాల్సిన సిమెంట్‌రోడ్ల పనులన్నీ రద్దయ్యాయి. పైగా ఎస్టీల భూములను లాక్కొని కొత్తగా ఇంటి స్థలాలు ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2020-07-12T08:11:27+05:30 IST