కూరగాయల రైతుకు భరోసా ఏదీ?

ABN , First Publish Date - 2022-06-07T05:09:16+05:30 IST

కూరగాయల రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది.

కూరగాయల రైతుకు భరోసా ఏదీ?

  • ఈ ఏడాది కూరగాయల సాగు లక్ష్యం అంతంత మాత్రమే
  • మూడేళ్ల కిందట కంటే లక్ష్యం తక్కువే
  • కూరగాయ ధరలు మండుతున్నా ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం
  • కూరగాయ రైతుకు ప్రోత్సాహం కరువు 
  • నారుకు మాత్రమే సర్కార్‌ రాయితీ
  • అన్ని పంటలకు కాదు... కొన్నిపంటలకే సబ్సిడీ
  • దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు చూపు

కూరగాయల రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. దీంతో కూరగాయలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగు విస్తీర్ణం తగ్గడంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుబడి తగ్గింది. ఇప్పటికైనా కూరగాయల రైతులను ప్రోత్సహించకుంటే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జూన్‌ 6) : మునుపెన్నడూ లేనివిధంగా కూరగాయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నెలలుగా కూరగాయ ధరలు దిగిరావడం లేదు. జులై నాటికి కొన్ని కూరగాయ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. కూరగాయ పంటలు సాగు పెంచితేనే ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఎందుకో కూరగాయ పంటల సాగు పెంపు విషయంలో అంత శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రెండేళ్లుగా కూరగాయ పంటల సాగు విస్తీర్ణం పెరగకపోగా.. భారీగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో కూడా కూరగాయ పంటలు సాగు లక్ష్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూడేళ్ల కిందట కంటే కూడా ఈసారి లక్ష్యాలు తక్కువగా ఉన్నాయి. మూడేళ్ల కిందట రంగారెడ్డిజిల్లాలో 32,500 ఎకరాల్లో కూరగాయ పంటలను రైతులు సాగు చేశారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా రవాణా, మార్కెటింగ్‌ సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో గడిచిన ఖరీ్‌ఫలో రంగారెడ్డిజిల్లాలో రైతులు కేవలం 15వేల ఎకరాల్లోనే కూరగాయ పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 20వేల ఎకరాల్లోనైనా కూరగాయ పంటలు సాగు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అంటే గత మూడేళ్ల కిందట కంటే కూడా తక్కువగానే విస్తీర్ణం ఉండడం గమనార్హం.  ఒకవైపు భారీ డిమాండ్‌తో కూరగాయ ధరలు మండిపోతుంటే మరోవైపు కూరగాయ పంటలు సాగు పెంచే విషయంలో సర్కార్‌ సరైన చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌ మహానగరంలో కూరగాయల కొరత అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూరగాయ ధరలు భగభగమండుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో కూరగాయలు దిగుమతి కావడం లేదు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. హైదరాబాద్‌ నగరంతోపాటు రంగారెడ్డిజిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలను సరఫరా చేయాలంటే కనీసం 50వేల హెక్టార్లలో పంటలు పండించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 1.25లక్షల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. కానీ ఇందులో సగం విస్తీర్ణంలో కూడా కూరగాయ పంటలు పండించడం లేదు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది కూరగాయ పంటలు సాగు లక్ష్యం అంతంత మాత్రమే కావడం గమనార్హం. మూడేళ్ల కిందట లక్ష్యాలు తక్కువగా ఉండడం గమనార్హం. ఇందుకు అధికారులు చెబుతున్న సమాధానం కూడా వింతగానే ఉంది. గతంలో కరోనా కారణంగా కూరగాయ పంటలు వేసిన రైతులు నష్టపోయారని, ఇందువల్ల గడిచిన వానాకాలం, యాసంగి సీజన్లలో కూరగాయపంటల సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే రైతులు తిరిగి కూరగాయపంటలసాగుకు ఆసక్తి చూపడం లేదు. పెట్టుబడి ఖర్చులు గడిచిన అయిదేళ్లలో రెట్టింపు కావడంతో రైతులు కూరగాయపంటలు వేసేందుకు ముందుకు రావడం లేదు.  ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తేనే పెద్ద ఎత్తున రైతులు కూరగాయపంటలు వేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. 


నారుకు మాత్రమే సబ్సిడీ

గతంలో కూరగాయపంటలు పండించే రైతులకు అన్నిరకాల విత్తనాలను సబ్సిడీపై అందించేవారు. అంతేకాక పాలీహౌజ్‌లు, బిందుతుంపర సేద్య పరికరాలను సబ్సిడీపై అందించారు. అయితే ఇప్పుడు పాలీహౌజ్‌ల రాయితీని ప్రభుత్వం పరిమితం చేసింది. బిందు, తుంపర సేద్య పరికరాలు, కూరగాయ సామగ్రికి రాయితీలు ఇవ్వడం లేదు.  కానీ ఇపుడు  జీడిమెట్ల ఉద్యాన పరిశోధన సంస్థలోని నర్సరీ నుంచి రాయితీపై మొక్కలు సరఫరా చేస్తోంది. ఇది ఒక విధంగా రైతుకు ప్రయోజనకరమే. రైతులందరికీ దీనిపై అవగాహన లేదు. అలాగే రైతుకు కోరుకునే పంటలకు సంబంధించిన నారును ఇవ్వడం లేదు. ఆయా జిల్లాలకు ప్రభుత్వం నిర్దేశించిన పంటలకు మాత్రమే సబ్సిడీపై నారును అందిస్తున్నారు. ఉదాహరణకు రంగారెడ్డిజిల్లాలో టమాట, వంగ, మిర్చి నారు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇది కూడా పరిమితంగానే సరఫరా చేస్తున్నారు. ఒక రైతుకు గరిష్టంగా రెండున్నర ఎకరాలకు మాత్రమే సబ్సిడీపై నారు అందిస్తున్నారు. అంతకుమించి కూరగాయ పంటలు వేసుకోవాలంటే మళ్లీ రైతు విత్తనాలు వేసుకోవాలి. లేదా బయట నారు కొనుగోలు చేయాలి. ఆసక్తిగల రైతులు నెలరోజులు ముందుగానే నారును బుక్‌ చేసుకోవాలి. ఇది కూడా రైతుకు ఇబ్బందిగా మారింది. వాతావరణ పరిస్థితులు కారణంగా రైతు కూరగాయ పంటలు వేస్తుంటారు. అయితే ప్రభుత్వం నెల రోజులు ముందుగానే  డీడీలు తీసుకుని నారు బుక్‌ చేసుకోవాలనే నిబంధన పెట్టడం వల్ల రైతులు ఆసక్తి చూపడం లేదు. డీడీలే కడితేనే సరఫరా చేస్తామన్న నిబంధన సడలించాలని కోరుతున్నారు. 


సబ్సిడీ ఇలా...

ఎకరాకు ఏ కూరగాయ పంటకైనా 8వేల మొక్కలను సబ్సిడీపై అందిస్తున్నారు. ఒక్కో మొక్క ఖరీదు రూపాయి కాగా, వీటిని సబ్సిడీపై అందిస్తున్నారు. ఎకరానికి 8వేల కూరగాయ మొక్కలు అవసరమవుతాయని అంచనాతో మొక్కలు సరఫరా చేస్తున్నారు.  గరిష్టంగా ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలకు సరిపడా నారును మాత్రమే సబ్సిడీపై అందచేస్తున్నారు. ఎకరానికి 8వేల మొక్కలకుగానూ 8వేలు ఖర్చవుతుండగా ఇందులో రూ. 6,500లు రాయితీ ఇచ్చి రైతుకు రూ. 1500లకే వీటిని సరఫరా చేస్తున్నారు. రైతు తన వాటా కింద ఈ రూ. 1500లను డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 


 సబ్సిడీపై సరఫరా చేసే నారు వివరాలు

జిల్లా పేరు కూరగాయపంటల నారు 

రంగారెడ్డిజిల్లా టమాట, వంకాయ, మిర్చి

వికారాబాద్‌ జిల్లా టమాట, వంకాయ, మిర్చి

మేడ్చల్‌ జిల్లా టమాట, వంకాయ, 

క్యాప్సికమ్‌, బెండ

ఈ ఏడాది కూరగాయ పంటల సాగు లక్ష్యం (ఎకరాల్లో)

రంగారెడ్డిజిల్లా 20,000

వికారాబాద్‌ జిల్లా 35,000

మేడ్చల్‌ జిల్లా 5,645

Updated Date - 2022-06-07T05:09:16+05:30 IST