పొటాష్‌ ఏదీ?

ABN , First Publish Date - 2021-10-18T03:59:39+05:30 IST

‘ఎరువులు అవసరమైన రైతులు రైతుభరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోండి. పది రోజుల్లో ఎరువులు అందిస్తాం’..ఇలా ప్రభుత్వంతో పాటు అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ ఎక్కడా అందిస్తున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా పొటాష్‌ కొరత వేధిస్తోంది. వరి పొట్ట దశలో పోటాష్‌ కీలకం. కానీ ఆర్బీకేలు, సొసైటీలు, రిటైల్‌ డీలర్ల వద్ద అసలు పొటాష్‌ అందుబాటులో లేదు. ఇది పంటపై ప్రభావం చూపుతుందని..దిగుబడులు తగ్గుముఖం పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొటాష్‌ ఏదీ?
ఎస్‌.కోట మండలంలో పొట్టదశలో వరి చేను

ఆర్బీకేల్లోనూ అందుబాటులో లేని ఎరువు

అదును దాటుతుండడంతో రైతుల్లో ఆందోళన

(శృంగవరపుకోట)

‘ఎరువులు అవసరమైన రైతులు రైతుభరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోండి. పది రోజుల్లో ఎరువులు అందిస్తాం’..ఇలా ప్రభుత్వంతో పాటు అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ ఎక్కడా అందిస్తున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా పొటాష్‌ కొరత వేధిస్తోంది. వరి పొట్ట దశలో పోటాష్‌ కీలకం. కానీ ఆర్బీకేలు, సొసైటీలు, రిటైల్‌ డీలర్ల వద్ద అసలు పొటాష్‌ అందుబాటులో లేదు. ఇది పంటపై ప్రభావం చూపుతుందని..దిగుబడులు తగ్గుముఖం పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయంగా వస్తున్న వ్యవసాయ పద్ధతుల ప్రకారం.. వరి పొట్ట దశలో ఉన్నప్పుడు యూరియాలో పొటాష్‌ను కలిపి వేస్తారు. సాధారణంగా ఎకరా పొలానికి ఒక బస్తా యూరియాలో 15 నుంచి 20 కిలోల పొటాష్‌ను కలిపి చల్లుతారు. పొటాష్‌ అందుబాటులో లేక ఖాళీ యూరియా వేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.

ఖరీఫ్‌లో నీటి సమస్య లేకున్నా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉంది. పొటాష్‌ లేకపోవడంతో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పద్ధతులను సూచిస్తోంది. మల్టీకె పౌడర్‌, సెల్పేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను కేజీన్నరను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. లేకుంటే యూరియా, భాస్వరం, పొటాష్‌ కలిగి ఉండే 14-35-56, 19-19-19 వంటి కాంప్లెక్స్‌ ఎరువులను వాడాలని చెబుతున్నారు. అయితే పౌడర్‌ను నీటిలో కలిపి పిచికారీ చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని రైతులు విముఖత చూపుతున్నారు. రైతులు అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా వ్యవసాయ శాఖ ఎరువుల వినియోగాన్ని సూచిస్తోంది. దమ్ము సమయంలోనే ఎకరా పొలంలో 15 కేజీల యూరియాతో పాటు 15 కేజీల పొటాష్‌ను చల్లమని అధికారులు సూచిస్తున్నారు. పొట్ట దశలో 15 కిలోలు, మొలక సమయంలో మరో 15 కిలోల యూరియా చల్లాలంటున్నారు. కానీ రైతులు మాత్రం సంప్రదాయంగా ఎకరాకు రెండు విడతల్లో రెండు బస్తాలు (45 కిలోలు) యూరియాను చల్లుతున్నారు. అవసరమైనప్పుడు ఎరువుల దొరకడం లేదని..అటువంటప్పుడు విడతల వారీగా వేయడం సాధ్యం కాదని చెబుతున్నారు.

సస్యరక్షణ చేపట్టాలి

పొటాష్‌కు ప్రత్యామ్నాయంగా మల్టీకే, సల్పేట్‌ ఆఫ్‌ పొటాష్‌ పౌడర్‌ను వాడొచ్చు. కిలో, అర కిలో పరిమాణాల్లో సైతం ఇవి అందుబాటులో ఉంటాయి. కేజీన్నర పౌడర్‌ను 200 లీటర్లలో కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేయాలి. ఈ సస్యరక్షణతో వరికి ఎంతో మేలు. 

- సీహెచ నీలవేణి, ఏవో, శృంగవరపుకోట




Updated Date - 2021-10-18T03:59:39+05:30 IST