Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 19 Sep 2022 00:53:01 IST

‘‘ఏ కవైనా తాను జీవించివున్న కాలానికి గొంతుక కావాలి’’

twitter-iconwatsapp-iconfb-icon
ఏ కవైనా తాను జీవించివున్న కాలానికి గొంతుక కావాలి

పల్లిపట్టు నాగరాజు : పలకరింపు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పట్ల మీ స్పందన?

దీని ద్వారా ఇంకొంచెంమందికి పరిచయం అయ్యే వీలు కలిగింది. ఈ అవార్డు ఉత్పాదక కుటుంబాలైన మా దళిత బహుజన కుటుంబాల శ్రమ సంస్కృతికి, వారి ఆత్మగౌరవ ప్రకటనకు, వారి పలుకుబడికి దక్కిన గుర్తింపు. మా అమ్మకు నాన్నకు, దారి కూడా సరిగ్గా లేని మా మిట్ట యిండ్లకు, ఇప్పటి మా ఊరికి దక్కిన గౌరవం ఇది.


వచన కవిత్వంలో గ్రామీణ వ్యవహారిక భాష, యాస మీ ప్రత్యేకత. ఎలా కుదిరింది?

భాష ద్వారానే జాతికి గుర్తింపు. భాష బతికితేనే జాతి బతికినట్టు. భాష బతకాలి అంటే ప్రజలు ఆ భాషలో మాట్లాడాలి. అలా మాట్లాడుతున్న వాళ్ళు గ్రామీణ ప్రజలు. నిజానికి మారుమూల ప్రాంత ప్రజలు జీవించి ఉన్న మాతృభాషా నిఘంటువులని భావిస్తాను. వాళ్లే ఇంకా భాషను కాపాడుతున్నారు. ప్రతి భాషలోనూ ప్రాంతాల వారీగా వ్యక్తీకరణలో భేదాలు ఉంటాయి. అది సహజం. అయితే వాటిని మాండలికం అనే మాటలో కుదించి ఏ ఒకటీ రెండూ జిల్లాల లేదా ఒక ప్రాంతపు వ్యక్తీకరణనే ప్రామాణిక భాషగా భావించడం, అదే మీడియా భాషగా చెలామణి కావడం, అదే పుస్తకభాషగా గౌరవం పొందటం- మిగిలిన ప్రాంతాల పలుకుబడుల్ని తక్కువ చేయడమే. అన్ని ప్రాంతాల మాటల్నీ కలిపి వాడగలిగే భాష పరిపుష్టి అవుతుంది అనిపిస్తుంది.


ఇక మీరు యాస అన్నది కూడా మా ప్రాంతపు ప్రజల భాషే. ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా నాకు ఈ ప్రాంతపు నిత్య వ్యవహారపు మాటలతో ఎక్కువ దగ్గరితనం వుంటుంది. అందుకే కవిత్వంలో అవి అలవోకగా చేరాయి. అంతకుమించి మరేం లేదు. కానీ మా సీమ ప్రాంతం భాష, నుడి కథల్లో వచ్చినంతగా కవిత్వంలోకి రాలేదు. పనిగట్టుకుని కాకపోయినా, కవిత్వం చెప్పే క్రమంలో మా ప్రాంతపు శ్రమజీవుల భాష, మా కుటుంబాల భాష కవిత్వంలో చేరింది. అది నేను ఎంచుకున్న వస్తువును బలంగా చెప్పడానికి తోడ్పడింది. 


నిరుపేద దళిత కుటుంబం నుంచి, మారుమూల గ్రామం నుంచి వచ్చి, అంతర్జాతీయ సంక్షోభాలను, సంఘర్షణలను కవితా వస్తువులుగా మలచుకోవటం వెనక మీ అధ్యయనం గురించి?

నేను గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాణ్ణే అయినా నా ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది. తిరుపతి నాకు మొత్తం ప్రపంచాన్ని పరిచయం చేసింది. నేను పుట్టిన పేదకుటుంబ దళితజీవితం వివ క్షలను, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని, దాని మూలాలను పరిచయం చేసింది. నాలో పట్టుదలను, కసిని, ప్రశ్నించేతనాన్ని, చిన్నపాటి వివక్షను కూడా భరించలేనితనాన్ని ఒంట బట్టించింది. చదువుకుంటున్న క్రమంలో పరిచయమైన ప్రోగ్రెసివ్‌ ఆలోచనల సాహిత్యం, అంబేడ్కర్‌ ఆలోచనలకు చెందిన సాహిత్యం నేను ఉన్నచోట నుంచే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణలను, సంక్షోభాలను అర్థం చేసుకు నేందుకు వీలు కల్పించాయి. పుట్టుక నేపథ్యంగా మొదటి నుంచి నేను సంఘర్షణ జీవిని. అన్యాయం, అవమానం, వివక్ష ఏ స్థాయిలో వున్నా ఏ ప్రాంతంలో వున్నా ఏ వ్యక్తికి ఎదురైనా నా కంటబడితే నేను గమ్ముగా ఉండలేను. నిజానికి ఆ వుండబట్టలేని తనం నుంచే, నన్ను నేను వ్యక్తీకరించుకునేతనంలోంచే నా కవిత్వం రాస్తున్నాను. అణచివేయబడుతున్న మనుషుల ఆత్మగౌరవ ప్రకటనలే నా కవిత్వం. 


దోపిడీ ఏఏ రూపాల్లో ఎన్నెన్ని మార్గాల్లో జరుగుతుందో తెలుసుకోవడం నేడు కష్టమేమీ కాదు. కానీ ఏమిటిది? ఎందుకిలా? అని అడిగే నోళ్లే కరువైపోయాయి. అడిగే కొద్దిపాటి గొంతుల్ని ఎలా అణచివేస్తున్నారో మనం గమని స్తూనే ఉన్నాం. అందరం కలిసికట్టుగా మాట్లాడాల్సిన అని వార్యమైన సందర్భంలో ఉన్నాము. అది త్వరలో జరుగుతుందని ఆశ. జరుగు తుంది. ఇవన్నీ నా కవిత్వం చర్చిస్తుంది. ఏ కవైనా తాను జీవించివున్న కాలానికి గొంతుక కావాలి.  


సాహిత్యకారుడుగా కానీ సామాజిక పౌరుడుగా కానీ మీరు దుఃఖపడిన సందర్భాలు?

చిన్నప్పడు మా దళిత కుటుంబాల తల్లుల్ని తండ్రుల్ని ఆధిపత్య కుటుంబాల వాళ్ళు చులకనగా మాట్లాడినప్పుడు. ఏదైనా వాళ్లకు అనుకూలంగా నడుచుకోనప్పుడు ‘కొవ్వు పట్టిన మాదిగది’, ‘పొగురు పట్టిన మాలది’, ‘తిమురు బట్టిన మాలోడు, మాదిగోడు’ వంటి మాటలు నన్ను చిన్న తనంలోనే బాధించాయి. ఇంకా ఎక్కువ బాధపెట్టిన విషయం ఏంటంటే మా దళితుల ఇళ్లల్లో ఎంత పెద్దవాళ్ల నైనా కూడా శూద్రకులాలు, ఆధిపత్య కుటుంబాలు పేరు ముందు ‘ఒసే.. ఒరే’ అనిపిలవడం. మా తాతల్ని అవ్వల్ని కూడా నా వయస్సుకూడా లేనివాళ్ళు అలా పిలవడం చాలా బాధేసేది. కూలిపనులకు పోయినకాడ మాకు దోసిళ్ళలో నీళ్లుపొసేవాళ్లు. కూలిడబ్బులు అడగటానికి పోయినపుడు నేను చెప్పులు ఎక్కడో వీధిలోనే వదిలేసిపోవడం, దూరంగా నిలబడి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ బాధించేవి. ఒక్కోసారి మా అమ్మతో నాన్నతో ‘ఎందుకు ఇలా’, ‘మనం ఎవరికి తక్కువ’ అని కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి.


ఇక సాహిత్యంలోకి వచ్చాకా దేశవ్యాప్తంగా దళితుల మీద ముస్లింల మీద జరుగుతున్న దాడులు చూస్తున్న పుడు, ఆ మధ్య హత్రాస్‌లో జరిగిన ఘటన, ఆసీఫా ఘటన, మొన్ననే జరిగిన ఇంద్రపాల్‌ అనే బాలుడి మరణం రాత్రుల్లో నిద్రలేకుండా ఏడిపించాయి. ఈ మాట మీతో పంచుకుంటున్నపుడు కూడా నాకు కన్నీళ్లు ఉబుకుతున్నాయి. ఇంకా ఎన్ని శవాలుగా మేము మారితే ఈ దేశంలో మాకు వివక్ష నుంచి అవమానాలనుంచి విముక్తి లభిస్తుంది.. అని అనిపిస్తుంది. మేము ఏ స్థాయిలో వున్నా ‘వాడు పలానా’ అనే దృష్టి ఎప్పుడు మారుతుంది ఈ సమాజానికి?

99894 00881

ఏ కవైనా తాను జీవించివున్న కాలానికి గొంతుక కావాలి

యాలై పూడ్సింది..!

యాలై పూడుస్తావుంది

ఎంతకాలం ఈ ఏగులాట


కొన్నాలికిలో బెల్లంపూసుకొని

అంగిట్లో యిసం బెట్టుకొని

బలే మాట్లాడతా వుండారు కాదబ్బా..

బలే బేలిపిస్తావుండారు గదయ్యా!


కాళ్లు తిమ్మిరెక్కేలా పిల్లకాయల్ని కూకోబెట్టి

నీతికోతలు కొస్తావుండారే..!

ఇంగులీసోడు యలబారి ఏండ్లు గడస్తావున్నా

దుమ్మెత్తి పోస్తారే గానీ

దేశం లోపల దొరల సంగతేందీ...?

దేశమొదిలిపోతున్న దొంగల కతేందీ..?

సెలవిస్తారా సామీ!


దేశాన్ని భారతమ్మని పిల్సుకుంటున్నామే

ఈ దేశాన ఆడకూతుర్ల మానపేనాలు 

చితికి బూడిదైపోతున్న అగత్త్యమేందీ..?


అంతో ఇంతో సదువుకున్నోళ్ళంతా

కులాల పేరుతో

మతాల పేరుతో

యీదులంతా పూనకమొచ్చి ఊగిపోతావుంటే


తంటాలు పెట్టిన తోడేళ్ళు...

బోగాలు కులికే బంగళాల్లో

ముక్కలు తింటూనో

వక్కాకు నములుతూనో 

పకపకాలాడతావుండే అన్నేకారి రోజుల్లో

తలా ఇంత కూడుబెడుతూ

కల్లాల్లో కుమిలి కుమిలి 

       మగ్గిపోతున్న మట్టిబతుకులేందీ..?

యవుడి కూడు వోడు తింటావుంటే

కూటికుండ కాడా

కూరసట్టి కాడా

కారుకూతలేంది...ఈ కత్తిగాట్లేందీ

కాలమిట్టా కడతేరిపోవాల్సిందేనా..!?

ఏనుగుపై 

సత్తిపెమానాలు జేసి పీఠాలెక్కినోళ్లు

ఏనుగు తొండం తగలబడిపోతావుంటే 

                     చూస్తూ కూడా

వులుకూ పలుకూలేని యీ ఉప్పాట యేందీ..?

ఉప్పుకూ ఊరుగాయకూ పనికిరాని 

                         ఊకదంపుడేంది??

యాడాదికొకతూరి ఏదోవొకసాకున

జెండాలు ఎగరేయడం 

         మామూలైపూడ్సింది గదా

జుబ్బాలసాటున గబ్బుతనాలు అగుపిచ్చకుండా

జబ్బలు సర్సుకోండి

ఎవుడేడపోతే యాముండాదిలే

మీరు కోరుకున్న కొండమీదే వాన గురువాల

కయ్యల్లో

కాల్వల్లో

ఈదుల్లో

ఊళ్ళల్లో

మట్టి రగతం దేశబకితై పారతావుంటే..

దేముడిరాగంలో దొంగభజన్లు సాగుతుండాల

సాల్లే... సాల్లే...

పొద్దుమొలస్తావుంది

మీ మోసకారి పాటల్కి ఇంకా ఇంకా

మా మద్దెల వాయించలేం

వారగా బోండప్పా

యాలై పూడ్సింది

వాకిలి చిమ్మాలా

కల్లాపు జల్లాలా.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.