పండుగకు పైసలేవీ?

ABN , First Publish Date - 2022-01-10T04:43:36+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీన రావాల్సిన జీతాలు ఈ నెల 9వ తేదీ దాటినా రాలేదు. దీంతో ఇంటి, వాహనాల ఈఎంఐల కోసం ఇచ్చిన చెక్‌లు బౌన్స్‌ అవుతున్నాయి.

పండుగకు పైసలేవీ?

ప్రభుత్వ ఉద్యోగులకు నేటికీ అందని వేతనాలు

పెన్షనర్ల సైతం విడుదలకాని పింఛను

సకాలంలో వాయిదాలు చెల్లించక ఫైన్ల భారం


(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీన రావాల్సిన జీతాలు ఈ నెల 9వ తేదీ దాటినా రాలేదు. దీంతో ఇంటి, వాహనాల ఈఎంఐల కోసం ఇచ్చిన చెక్‌లు బౌన్స్‌ అవుతున్నాయి. ఫలితంగా తప్పులేకున్నా ఉద్యోగుల సీబిల్‌ స్కోరు తగ్గడంతోపాటు అదనంగా ఫైన్‌ కట్టాల్సి వస్తోంది. ఇక ఫ్యామిలీ పెన్షనర్లకు వచ్చేదే తక్కువ. అవి కూడా ఇంటి, వైద్య ఖర్చులకే సరిపోతాయి. వీరికి సైతం ప్రభుత్వం నేటికీ పెన్షన్‌ జమచేయలేదు. ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్‌ బకాయిలు ఏళ్లు గడుస్తున్నా మంజూరు కావడంలేదు. ఏడాదికి రావాల్సి రెండు డీఏలు సైతం ప్రభుత్వం ఇవ్వడం లేదు. గత ఏడాది డీఏ మంజూరే చేయలేదు.


ఉమ్మడి జిల్లాలో 1.09లక్షల మంది

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందిన వారు మొత్తం 1.09లక్షల మంది ఉన్నారు. ఓట్ల వేట కోసం లెక్కకు మించి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస అవసరాలు తీర్చలేకపోతోంది. భవిష్యత్తు అవసరాల కోసం ఉద్యోగులు నెలవారీ వేతనాల నుంచి జీపీఎ్‌ఫలో దాచుకున్న సొమ్మును సైతం ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడంలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇది ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే రెండేళ్లుగా ఉద్యోగులకు వేతనాలు సకాలంలో రావడంలేదు. ఖజానా కటకట పేరుతో ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీన వాయిదాల పద్ధతిన రాష్ట్రప్రభుత్వం వేతనాలు విడుదల చేస్తోతంది. కొన్ని నెలలు 4వ తేదీన వేతనాలు మంజూరు చేసింది. ఆ తరువాత 7వ తేదీన వేతనాలు వచ్చాయి. ఈ నెల మాత్రం 9వ తేదీ ముగిసినా వేతనాల జాడ కానరావడం లేదు. ఈ నెల సంక్రాంతి పండుగ ఉండగా, పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు పలువురు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో వేతనాలు రాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మానసిక ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఇంటిలోన్‌, బీమా ప్రీమియం, వాహనాల లోన్‌, బ్యాంకు ఇతర రుణాలు, పర్సనల్‌ లోన్ల ఈఎంఐలు 1వ తేదీ, 2వ తేదీ, 4వ తేదీ, 7వ తేదీన ఉంటాయి. ఈ లోగా వేతనం జమయ్యే ఉద్యోగి బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకుంటే చెక్‌ బోన్స్‌ అవుతుంది. దీంతో అపరాధ రుసుము చెల్లించాల్సి రావడంతోపాటు, సీబిల్‌ పడిపోతోంది. ఫలితంగా భవిష్యత్తులో లోన్ల మంజూరుకు ఇబ్బందులు ఏర్పడతాయి. అదేవిధంగా ఇంటి అద్దెకు ఉన్నవారికి యజమానుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో ఉద్యోగులకు ఏం చేయాలో తెలియడం లేదు.


వెంటనే వేతనాలు జమ చేయాలి : ఎం.శ్రవణ్‌కుమార్‌, టీఎన్‌జీవోల జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ

ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేది ఉద్యోగులే. ప్రభుత్వ జయాపజయాలు ఉద్యోగుల సహకారం, పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథాకలు మోసుకెళ్లేది ఉద్యోగులే. వారే ఇబ్బందులకు గురైతే ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో ఉంటుంది. అందుకే ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల వేతనాలు వారి ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. వేతనాలు ఆలస్యంగా జమ కావడం మూలంగా నెలకు రూ.4 వేలకు ఫైన్ల, అధిక వడ్డీ రూపంలో ఉద్యోగులు నష్టపోతున్నారు.


1వ తేదీన వేతనం మా హక్కు : పి.వెంకటేశం, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 1వ తేదీనే వేతనాలు జమ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 1వ తేదీన వేతనం పొందడం ఎవరో మాకు దయతో వేసే భిక్ష కాదు, అది మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు. ఇప్పటి వరకు ప్రతినెలా 4, 7వ తేదీ వరకు వేతనాలు రాలేదు. ఈ నెల 9వ తేదీ ముగిసినా జీతాల జాడ లేదు. ఈఎంఐలపై ఫైన్లు పడుతున్నాయి. పండుగ దగ్గరలో ఉంది. పాలు, కరెంటు బిల్లులకు ఇబ్బందులు పడుతున్నాం. వేతనాలు వెంటనే విడుదల చేయాలి.


ఫ్యామిలీ పెన్షన్లర్లకు ఇబ్బందులు : ఖాదర్‌, ఆల్‌ పెన్షనర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ జిల్లా

ఉద్యోగి, పెన్షనర్‌ చనిపోతే వారిపై ఆధారపడిన వారికి వచ్చేదే ఫ్యామిలీ పెన్షన్‌. అది కూడా చాలా తక్కువ. పెన్షన్‌ ఏ తేదీన జమ అవుతుందో ఒక పద్ధతి లేకుండా పోయింది. పెన్షన్‌ మొత్తం పడితేనే వైద్య, ఆరోగ్య ఖర్చులకు వెసులుబాటు ఉంటుంది. 9వ తేదీ వచ్చినా పెన్షన్‌ జమ కాకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు చేయాల్సి వస్తోంది.

Updated Date - 2022-01-10T04:43:36+05:30 IST