బీసీలకు రుణాలేవీ?

ABN , First Publish Date - 2022-09-27T06:23:21+05:30 IST

జనాభాలో సగానికి పైగా ఉన్న వెనకబడిన తరగతుల కులాలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఒకవైపు ఎస్సీ కులస్తులకు దళితబంధు పేరు తో రుణాలు ఇస్తున్న ప్రభుత్వం, త్వరలో గిరిజనులకు గిరిజనబంధు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ బీసీ కులాలకు మాత్రం రుణాల మంజూరు విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో బీసీలకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలు ఇచ్చారు.

బీసీలకు రుణాలేవీ?
జిల్లాకేంద్రంలో గల బీసీ కార్పొరేషన్‌ కార్యాలయం

జిల్లాలో ఆరేళ్లుగా బీసీలకు రుణాలు లేవు

ఫెడరేషన్‌లకూ రుణాలు కరువాయే..

సబ్సిడీ రుణాల కోసం నిరుద్యోగ యువత నిరీక్షణ

కలగా మారిన బీసీ కార్పొరేషన్‌ రుణాల పంపిణీ తీరు

వెనకబడిన తరగతుల కులాలపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం 

2017 నుంచి రుణాల కోసం లబ్ధిదారుల ఎదురుచూపు

జిల్లావ్యాప్తంగా వేలాది మంది యువతకు తప్పని ఇక్కట్లు

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 26: జనాభాలో సగానికి పైగా ఉన్న వెనకబడిన  తరగతుల కులాలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఒకవైపు ఎస్సీ కులస్తులకు దళితబంధు పేరు తో రుణాలు ఇస్తున్న ప్రభుత్వం, త్వరలో గిరిజనులకు గిరిజనబంధు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ బీసీ కులాలకు మాత్రం రుణాల మంజూరు విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో బీసీలకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలు ఇచ్చారు. ఫెడరేషన్‌లకు సైతం సబ్సిడీ రుణాలు ఇచ్చరు. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు మాత్రమే అరకొరగా సబ్సిడీ రుణాలు ఇచ్చిన ప్రభుత్వం.. 2017 నుంచి దాదాపుగా ఆరు సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు ఇవ్వడం లేదు. చదువుకోని, ఉపాధిలేని, నిరుద్యోగ యువతకు వివిధ కార్పొరేషన్‌ల ద్వారా గత ప్రభుత్వాలు సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు. ఇచ్చిన రుణం ద్వారా ఉపాధి పొందడం లేదా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఇచ్చే సబ్సిడీ రుణాల కోసం నిరుద్యోగ యువత గత ఆరేళ్లుగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇతర కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు వస్తున్నా.. బీసీ కార్పొరేషన ద్వారా రుణాలు కలగానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా జిల్లాలో కూడా 2017 తర్వాత బీసీలకు సబ్సిడీ రుణాలు రాలేదు.

2017లో చివరి రుణాలు

2018-18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా చివరి సారిగా రుణాలు ఇచ్చిన అవి పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందలేదు. ఆ ఆర్థిక సంవత్సరానికి గాను కేటగిరి-1, కేటగిరి-2, కేటగిరి-3 కింద మొత్తం 21వేల 529 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా.. ఆ తర్వాత సంవత్సరం కేటగిరి-1 కింద కేవలం 1862 మందికి రూ.50వేల చొప్పున రూ.9కోట్ల 30లక్షల సబ్సిడీ రుణాలు అందజేశారు. 2017లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 2018లో రుణాలు ఇచ్చారు. కానీ 21వేల 529 మంది లబ్ధిదారులు ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. రెండేళ్ల తర్వాత 1862 మందికి రూ.50 వేలు ఇచ్చారు. కేటగిరి-2, కేటగిరి-3లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రం ఇంకా రుణాలు ఇవ్వలేదు.

ఫెడరేషన్‌లకు మొండిచేయి

జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు సబ్సిడీ రుణాల విషయంలో మాత్రం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. వ్యక్తిగత సబ్సిడీ రుణాలతో పాటు ఫెడరేషన్‌లకు సైతం గత ఆరేళ్లుగా రుణాలు రాలేదు. జిల్లాలో 13 ఫెడరేషన్లకు బీసీ కార్పొరేషన్‌లో రిజిస్ర్టేషన్‌లు చేసుకోగా 2017 నుంచి ఫెడరేషన్లకు రుణాలు రాలేదు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీ కార్పొరేషన్‌ ద్వారా 482 మంది లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా తొమ్మిది మంది లబ్దిదారులకు, రజక ఫెడరేషన్‌లో 105 మంది లబ్ధిదారులకు, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌  ద్వారా 95 మంది లబ్ధిదారులకు మొత్తం 1862 మంది లబ్ధిదారులకు 13 ఫెడరేషన్‌లకు రూ.93 కోట్ల సబ్సిడీ రుణాలు ఇచ్చారు. 

ఆరేళ్లుగా ఎదురుచూపులు

2017 సంవత్సరానికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా మూడు కేటగిరిలలో రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.లక్షలోపు కేటగిరి-1, రూ.2లక్షల లోపు కేటగిరి-2, రూ.12లక్షల లోపు కేటగిరి-3 ద్వారా మొత్తం 21వేల 529 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వూ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినా.. ఆ ఆర్థిక సంవత్సరం రుణాలు ఇవ్వనే లేదు. వంద శాతం సబ్సిడీతో రూ.50వేలు, 80 శాతం సబ్సిడీతో రూ.లక్ష, కేటగిరి-2లో 70శాతం సబ్సిడీ, కేటగిరి-3లో 60 శాతం సబ్సిడీతో రుణా లు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటికీ లబ్ధిదారులకు పూర్తిస్థాయి లో రుణాలు ఇవ్వలేదు. 2017 ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం 1862 మంది కి రూ.50వేలు 2018లో ఇచ్చి అధికారులు చేతులుదులుపుకున్నారు.  ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడంతో జిల్లాలో యువ త ఆరేళ్లుగా రుణాల కోసం ఎదరుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, బీసీల హ క్కుల కోసం ఉద్యమాలు చేస్తున్న బీసీ సం ఘాలు సబ్సిడీ రుణాల విషయంలో మౌనం పాటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా బీసీ బిల్లు పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నా.. బీసీ సం ఘాలు రుణాల కోసం పోరాటం చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.

Updated Date - 2022-09-27T06:23:21+05:30 IST