అరాచకం తప్ప అభివృద్ధి ఏదీ?

ABN , First Publish Date - 2022-07-28T05:05:12+05:30 IST

మూడేన్నర ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అరాచక పాలన తప్ప, అభివృద్ధి లేదని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

అరాచకం తప్ప అభివృద్ధి ఏదీ?
మాట్లాడుతున్న అయ్యన్న

 భయపడేది లేదు.. పోరాడుతాం
టీడీపీ శ్రేణులూ ధైర్యంగా ఉండండి
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

విజయనగరం రూరల్‌, జూలై 27:
మూడేన్నర ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అరాచక పాలన తప్ప, అభివృద్ధి లేదని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుతో కలిసి ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడారు. మూడున్నరేళ్ల కాలంలో మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్న చందంగా రాష్ట్ర పరిస్థితి తయారైందన్నారు. విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయని, ప్రాథమిక విద్యను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. బడికి వెళ్లనివారు (డ్రాపౌట్స్‌)ని తగ్గించాలని ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే, ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా తయారైందన్నారు. 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలల్లో విలీనం చేశారని, దీనివల్ల ఒకవైపు డ్రాపౌట్స్‌ పెరగడమే కాకుండా, మరోవైపు రానున్న కాలంలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు, మందులు లేని పరిస్థితి ఉందన్నారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని గద్దె నెక్కిన ఈ ప్రభుత్వం దశలవారీగా మద్యాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ఉండవని, నగదు చేతికి ఇస్తేనే, మద్యం విక్రయిస్తున్నారని, ఈ విధంగా కొన్ని మద్యం కేసుల డబ్బు దొడ్డిదారిన జగన్‌కు చేరుతోందని ఆరోపించారు. కొత్తగా 175 బార్లు ఏర్పాటు చేస్తున్నారని, ఈ బార్లు ద్వారా రానున్న ఎన్నికల్లో మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసేందుకు వ్యూహం పన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై లేనిపోని కేసులు పెట్టి పార్టీ శ్రేణులను భయపెట్టేందుకు జగన్మోహన్‌రెడ్డి, సాయిరెడ్డి పన్నాగం పన్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెంనాయుడు, కళా వెంకటరావు, విజయనగరంలో అశోక్‌ గజపతిరాజు, విశాఖపట్టణంలో తనని ఇబ్బందులకు గురిచేయడం ద్వారా పార్టీ శ్రేణులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి బెదిరింపులకు లొంగేది లేదని, ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతామన్నారు. టీడీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, మూడు జిల్లాల్లో ఏ నాయకుడి జోలికి వెళ్లినా.. మూడు జిల్లాల్లోని 35 నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ శ్రేణులు కదలివచ్చేలా చూస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ, మూడున్నరేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం అప్పులు మీద అప్పులు చేస్తోందని ధ్వజమెత్తారు. రోడ్ల పరిస్థితి చూస్తే దారుణమని, పోలవరం ప్రాజెక్టు అలాగే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో తాను మహానాడుకు కూడా హాజరుకాకుండా ఏడు మండలాల విలీన ప్రక్రియ పూర్తికి తన వంతు సహకారం అందించానన్నారు. ప్రస్తుతం ఆ ఏడు ముంపు మండలాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని, వర్షాలు ముంచినా వారిని ఆదుకునే నాథుడు కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడేన్నరేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో టీడీపీ నాయకులు అదితి గజపతిరాజు, కనకల మురళీమోహన్‌, విజ్జపు ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-28T05:05:12+05:30 IST