పరిహారం ఏదీ?

ABN , First Publish Date - 2022-07-01T05:48:32+05:30 IST

విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన బాధితులకు పరిహారం చెల్లింపులో కొంత మందికి జాప్యం జరుగుతోంది. జిల్లాలో 70 శాతం వరకే చెల్లింపులు జరిగాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాలు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పరిహారం త్వరగానే అందించగా ఐదు నెలల నుంచి ఆలస్యం అవుతోంది.

పరిహారం ఏదీ?
భిక్కనూరు మండలంలో విద్యుత్‌షాక్‌తో స్తంభంపైనే మృతి చెందిన వ్యక్తి(ఫైల్‌)

- విద్యుత్‌షాక్‌కు గురై చనిపోతున్న కుటుంబాలకు అందని పరిహారం

- మరమ్మతుల సమయంలో కరెంట్‌కు బలవుతున్న అమాయకులు

- గడిచిన నాలుగేళ్లలో విద్యుత్‌షాక్‌తో 136 మంది మృతి

- ఇందులో 94 మంది బాధిత కుటుంబాలకే పరిహారం చెల్లింపు

- 267 పశువులు మృతి చెందగా.. 162 పశువులకు మాత్రమే పరిహారం


కామారెడ్డి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన బాధితులకు పరిహారం చెల్లింపులో కొంత మందికి జాప్యం జరుగుతోంది. జిల్లాలో 70 శాతం వరకే చెల్లింపులు జరిగాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాలు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పరిహారం త్వరగానే అందించగా ఐదు నెలల నుంచి ఆలస్యం అవుతోంది. గత నాలుగేళ్లలో జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ ప్రమాదాల్లో 136 మంది చనిపోగా 267 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇందులో 94 మంది బాధిత కుటుంబాలు, 162 పశువులకు పరిహారం అందింది. మిగతా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. విద్యుత్‌ కనెక్షన్‌ల మరమ్మతులు చేస్తుండగా కొందరు మృతి చెందుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో పంట పొలాల్లో విద్యుత్‌ తీగలు తెగివేలాడుతున్నప్పటికీ సంబంధిత విద్యుత్‌శాఖ అఽధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

నాలుగేళ్లలో 136 మంది మృతి

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌లలో గడిచిన నాలుగేళ్లలో విద్యుత్‌షాక్‌తో 136 మంది మృతి చెందినట్లు విద్యుత్‌శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 94 మంది బాధిత కుటుంబాలకు మాత్రమే పరిహారం అందింది. కామారెడ్డి డివిజన్‌లో 49 మంది విద్యుత్‌షాక్‌తో మృతి చెందగా ఇందులో 30 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. ఎల్లారెడ్డిలో 33 మంది మృతి చెందగా 29 కుటుంబాలకు, బాన్సువాడలో 47 మంది మృతి చెందగా 32 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. అదేవిధంగా విద్యుత్‌షాక్‌తో 267 పశువులు మృతి చెందాయి. ఇందులో 162 పశువులకు మాత్రమే పరిహారం అందింది. కామారెడ్డి డివిజన్‌లో 102 పశువులు మృతి చెందగా 70 పశువులకు, ఎల్లారెడ్డి 60 పశువులు మృతి చెందగా 41 పశువులకు, బాన్సువాడ డివిజన్‌లో 89 పశువులు మృతి చెందగా 48 పశువులకు పరిహారం అందింది. మరికొన్ని ఫైల్‌లు ప్రతిపాదనలోనే ఉన్నాయి. కామారెడ్డి డివిజన్‌లో విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన 8 మందికి చెందిన పైల్‌లను విద్యుత్‌శాఖ పరిహారం కోసం ప్రభుత్వానికి పంపగా మరో 11 పైళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఎల్లారెడ్డిలో ఇద్దరికి చెందిన ఫైళ్లను ప్రభుత్వానికి పంపగా మరో రెండు పరిశీలనలో ఉన్నాయి. బాన్సువాడలో 7 మంది ఫైళ్లు పంపగా మరో 8 పరిశీలనలో ఉన్నాయి. విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన పశువులకు సంబంధించి కామారెడ్డిలో 7 పశువులవి పరిహారం కోసం పంపగా మిగతా 25 పెండింగ్‌లో ఉన్నాయి. ఎల్లారెడ్డిలో 4 పశువుల వివరాలు పంపగా మరో 15 పెండింగ్‌లో ఉన్నాయి. బాన్సువాడలో 11 పశువులకు సంబంధించిన వివరాలు పంపగా మరో 30 పరిశీలనలో ఉన్నాయి.

మరణించిన వ్యక్తికి రూ.5 లక్షలు

విద్యుత్‌ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 2014లో రూ.1.50 లక్షల పరిహారం అందించేవి. ఆ తర్వాత 2019 వరకు రూ.4 లక్షల వరకు ప్రభుత్వాలు ఇచ్చాయి. 2020 నుంచి రూ.5 లక్షలకు పెంచారు. 2018 వరకు బాధితులకు త్వరగానే పరిహారం అందేది. ఆ తర్వాతే పరిహారం అందడంలో జాప్యం నెలకొంటుంది. పశువులకు విద్యుత్‌ సంస్థ అందజేస్తోంది. ఎద్దు, గేదె వంటివి చనిపోతే రూ.40 వేలు పంపిణీ చేస్తున్నారు. మేక, గొర్రె మృతిచెందితే రూ.7వేలు ఆర్థిక సహాయం విద్యుత్‌శాఖ ద్వారా ప్రభుత్వం బాధితులకు అందజేస్తోంది. అయితే పరిహారం అందేందుకు మృతి చెందిన కేసు విచారణ కీలకం కానుంది. ఈ నివేదికలు త్వరగా రాకపోవడంతోనే పరిహారంలో జాప్యం నెలకొంటుందని సంబంధితశాఖ అఽధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన కేసుల్లో అధికారులు ఇచ్చే నివేదికలే కీలకంగా మారుతున్నాయి. పశువులు విద్యుత్‌ ప్రమాదాల్లో మరణిస్తే సంబంధిత పశువైద్యాధికారి, విద్యుత్‌ అధికారులు నివేదికలు జతచేయాల్సి ఉంటుంది. ఇక వ్యక్తులు కరెంట్‌ షాక్‌కు గురై మరణిస్తే పోలీసులు ఇచ్చే ఎఫ్‌ఐఆర్‌, వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం రిపోర్టు జత చేస్తున్నారు. ఇవికాకుండా మృతుడి ఫొటోలు, విద్యుత్‌ అధికారులు ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్టు, ఆధార్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా వంటివి జతచేసి దరఖాస్తు చేసుకోవాలి.

ప్రమాదాలకు కారణాలు

విద్యుత్‌ ప్రమాదాలలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయి. పొలాల వద్ద నాసిరకం కేబుల్‌లు, పరికరాలు ఉపయోగించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే రైతులే చేసుకుంటున్నారు. వాస్తవానికి సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాలి. స్తంభాల వద్ద తీగలు ఊడిపడినప్పుడు పశువులు, మనుషులు పొరపాటున తగిలి విద్యుత్‌ షాక్‌కు గురవుతున్నారు. పొలాల్లో, గ్రామ శివారుల్లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్‌లు తక్కువ ఎత్తులో ఉండడం, రక్షణ కంచేలేకపోవడంతో వందలాది పశువులు మృత్యువాత పడుతున్నాయి. రైతులు విద్యుత్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-07-01T05:48:32+05:30 IST