నష్టపోయిన వారికి పరిహారం ఏదీ..?

ABN , First Publish Date - 2022-06-14T05:30:00+05:30 IST

చెన్నేకొత్తపల్లి సభలో సీఎం జగన బటన నొక్కి.. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు.

నష్టపోయిన వారికి పరిహారం ఏదీ..?
ఉరవకొండ మండలం నింబగల్లు సచివాలయానికి తాళం వేసి నిరసన తెలుపుతున్న రైతులు

ఎంత మోసం..!

వందల్లో రైతులుంటే.. కొందరికే ఇచ్చారు

బీమా అందని రైతుల ఆగ్రహం

సచివాలయాల వద్ద ఆందోళన

సీఎం దిష్టిబొమ్మ దహనం


అనంతపురం అర్బన/నెట్‌ వర్క్‌, జూన 14: చెన్నేకొత్తపల్లి సభలో సీఎం జగన బటన నొక్కి.. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు. ఉమ్మడి జిల్లా రైతులకు రికార్డుస్థాయిలో లబ్ధి చేకూరిందని ఘనంగా ప్రకటించారు. సీఎం సభ అటువైపు జరుగుతుండగానే.. జిల్లా వ్యాప్తంగా తమకు అన్యాయం జరిగిందని వందలాది మంది రైతులు నిరసనకు దిగారు. గ్రామ సచివాలయాలకు తాళం వేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2021 ఖరీఫ్‌ సీజనకు సంబంధించి ఉచిత పంటల బీమా జాబితాను తాజాగా విడుదల చేశారు. అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పంట నష్టపోయిన తమకు జాబితాలో చోటెందుకు లేదని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రైతుల ప్రశ్నలకు వ్యవసాయ శాఖ అధికారులు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. 


సచివాలయానికి తాళం 

ఉరవకొండ మండలం నింబగల్లులో రైతులు సచివాలయ సిబ్బందిని బయటకు పంపేసి, తాళం వేశారు. గ్రామంలో 1,100 మంది రైతులుంటే 73 మందికి మాత్రమే పంటల బీమా మంజూరైందని రైతులు వాపోయారు. గ్రామంలో అత ్యధిక మంది మిరప సాగు చేశారని, రూ.లక్షల్లో నష్టపోయినా బీమా వర్తింపచేయక పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.30 వేలు కూడా తిరిగి రాలేదని అన్నారు. ఉద్యాన శాఖ అధికారులు అలసత్వం కారణంగానే తీవ్రంగా నష్టపోయామని అన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని రైతులతో చర్చించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


సచివాలయం పైకెక్కి.. 

వజ్రకరూరు మండలం చాబాలలో బీమా పరిహారం అందని రైతులు గ్రామ సచివాలయం పైకెక్కారు. ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. గమనించిన స్థానికులు, ఇతర రైతులు  పైనున్నవారికి సర్దిచెప్పి కిందకు తెచ్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, సచివాలయ సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. తమ గ్రామంలో 80 మందికిపైగా రైతులు మిరప సాగు చేస్తే ఇద్దరికి మాత్రమే బీమా వర్తింపజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇనపుట్‌ సబ్సిడీ మంజూరులో కూడా తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇస్తే తప్పా ఆందోళన విరమించేది లేదని వారు ఖరాకండిగా చెప్పారు. ఏఓ వెంకట రమణతో ఎస్‌ఐ ఫోనలో రైతులతో మాట్లాడించి, శాంతింపజేశారు. ఆందోళనలో మాజీ సర్పంచ ఎర్రిస్వామి, రైతులు అనంత, కేదార్‌నాథ్‌, లేపాక్షి, గోవర్ధన, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. విడపనకల్లు మండలం వేల్పుమడుగు సచివాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే తమకు పంటల బీమా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


బోర్డు పీకేసీ నిరసన 

పుట్లూరు మండలంలోని కందికాపుల సచివాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పంట నష్టపోయినవారికి బీమా ఇవ్వలేదని, పంట సాగుచేయని వారికి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సచివాలయ బోర్డును పీకేశారు. కొందరు అధికారులు, సిబ్బంది డబ్బులు తీసుకుని, తమకు ఇష్టమొచ్చినట్లుగా ఈ క్రాపింగ్‌ నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అర్హులందరికీ బీమా అందించేలా చర్యలు  తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించి శాంతింపజేశారు. 


ఆరుగురికేనా..? 

విడపనకల్లు మండలం జనార్దనపల్లిలో 250 మంది రైతులుంటే ఆరుగురికి మాత్రమే పంటల బీమా ఇచ్చారని బాధిత రైతులు  ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పుమడుగు గ్రామ సచివాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. తమ గ్రామంలో 250 మంది రైతులు నష్టపోయారని, కేవలం ఆరుగురికి పంటల బీమాను వర్తింపజేయడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. పంట నష్ట పోయిన ప్రతి రైతుకూ బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అధికారులు రైతులతో చర్చించి, శాంతింపజేశారు. ఇదే మండలం ఉండబండలో నష్టపోయిన రైతులకు కాకుండా, పంటలు వేయని రైతులకు బీమా ఇచ్చారని కొందరు రైతులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ మద్దతుదారులకు పంటలు వేయకున్నా బీమా ఇచ్చారని ఆరోపించారు. 


ఏఓ కార్యాలయం వద్ద..

పంటల బీమా ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపిస్తూ.. యల్లనూరు ఏఓ ఆఫీస్‌  ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపించి, తలుపులు మూసేసి, అక్కడై భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతు సంఘం నాయకులు రాజారామిరెడ్డి రైతులకు మద్దతిచ్చారు. అనంతరం ఏఓ కార్యాలయం ఎదుట సీఎం జగన దిష్టిబొమ్మను దహనం చేశారు. 


ఈ-క్రాపింగ్‌లో తప్పిదాలతోనే: సీపీఎం

ఈ-క్రాపింగ్‌లో తప్పిదాలతోనే పంటల బీమా అందక రైతులు నష్టపోయారని సీపీఎం నాయకులు మధుసూదన, రంగారెడ్డి అన్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉరవకొండ ఏడీఏ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సిబ్బంది సకాలంలో ఈ-క్రాప్‌ చేయలేదని, దీనికి వ్యవసాయ శాఖ అధికారులే పూర్తి  బాధ్యత వహించాలని అన్నారు. ఎకరాకు రూ.25 వేలు ప్రకటించి, కేవలం రూ.1100 మాత్రమే పరిహారం వచ్చినట్లు జాబితాలో పేర్కొన్నారని విమర్శించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు రవికుమార్‌, మురళి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-14T05:30:00+05:30 IST