Jul 8 2021 @ 02:17AM

ఏ భాయ్‌.. గాడీ రోకో

‘‘మషాల్‌’’ చిత్రం(1984) లోని ఓ దృశ్యం..

బొంబాయి రోడ్డు ఫుట్‌ పాత్‌ లో వినోద్‌ (దిలీప్‌ కుమార్‌), సుధ (వహీదా రహమాన్‌) లు నడుస్తున్నారు. రాత్రి సమయం. చీకటి. వర్షం పడుతోంది.. వెనుక నడుస్తున్న సుధ కడుపు నెప్పితో మెలికలు తిరిగిపోతూ నిలిచిపోయిన సంగతి కూడా తెలీదు. తన లోకం తనది. ఆమె పిలుపు విని వెనుక చూేస్త ఒక్కసారిగా షాక్‌. ఆమెను దగ్గరకు తీసుకుని ‘నేనున్నాగా నీకేం కాదు, ఆసుపత్రికి తీసుకెళ్తాన’ని ఓ చోట కూర్చోబెడతాడు. నాన్నా, కారాపు.. నా భార్య చావు బతుకుల్లో ఉంది. అర్జంటుగా ఆసుపత్రికి చేర్చాలని బతిమాలుతాడు. ఏ కారూ ఆగదు. ఆపిన కారు దగ్గరికి పోయినపుడు.. ఆసామి ఆపొద్దని డ్రైవర్‌తో అంటూనే.. కారు వేగం అందుకుంటుంది. వినోద్‌ దొర్లి పడతాడు. క్షణాల్లో అతని ఒడిలో సుధ చివరి శ్వాస వదులుతుంది.

ఈ సీన్‌లో.. ఒక నడివయసు వ్యక్తి జీవితంలోని నాజూకు క్షణాల్లో అతని బాధ ఆవేదనా వ్యక్త పరచడానికి అతని ఎక్ర్స్పెషన్స్‌, బాడీ లంగ్వేజ్‌, ఉచ్చారణ, స్వరం తో కసరత్తు చేయించే విధం (intonations) అన్నీ వాడుకుంటూ ఆ సీన్‌ ని అజరామరం చేసాడు దిలీప్‌ కుమార్‌. ఇంకో విశేషమేంటంటే.. ఈ చిత్రం అతను ప్రయాణం మొదలు పెట్టిన 40 ఏళ్ళ తర్వాతది. దీని తర్వాత కూడా విధాత, శక్తి,(ఈ రెండు కాస్త ముందు) కర్మా, సౌదాగర్‌ లు కూడా చేసాడు. ఇంతే గొప్పగా. ఇది దిలీప్‌ కుమార్‌ నటన పరిచయానికి ఒక పార్శ్వం.


11 డిసెంబర్‌, 1922న యూసుఫ్‌ పఠాన్‌ ఖాన్‌ లాలా గులాంసర్వర్‌ ఖాన్‌, అయేషా బేగం లకు పేషావర్‌ లో (అప్పటికి అది బ్రిటిష్‌ ఇండియాలోనే ఉంది) జన్మించాడు. వాళ్ళ పన్నెండు మంది సంతానం లో ఒకడు. తండ్రిది పళ్ళ వ్యాపారం, నాసిక్‌ దగ్గర్లో పళ్ళ తోటలు ఉండేవి. నాసిక్‌ లోని దేవ్‌లాలి లోనే యూసుఫ్‌ చదువు. రాజ్‌ కపూర్‌ బాల్యకాలం నుంచే ేస్నహితుడు. పద్దెనిమిదేళ్ళప్పుడే తండ్రితో తగాదా వచ్చి ఇల్లొదిలి పూనే కెళ్ళాడు యూసుఫ్‌. అక్కడ ఒక ఆర్మీ కేంటీన్‌ లో పనిచెస్తూ కొంత డబ్బు దాచుకున్నాడు. ఆ తర్వాత బొంబాయి కి పయనం. అక్కడ నటి దేవికా రాణి తో పరిచయం అతని జీవన ప్రయాణాన్ని ఒక మలుపు తిప్పింది. దేవికా రాణి అప్పట్లో స్టార్‌. ఆమెను ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ఇండియన్‌ సినెమా గా చెప్తారు. భర్త హిమాంశు రాయ్‌ ఇంకా కొంతమందితో కలిసి బాంబే టాకీస్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. యూసుఫ్‌ పరిచయం అయ్యాక అతనికి తాము తీస్తున్న చిత్రం ‘‘జ్వార్‌ భాటా’’(1944) లో నటించే అవకాశం ఇచ్చింది. అలాగే హిందీ చిత్ర ప్రపంచంలో అతన్ని ‘‘దిలీప్‌ కుమార్‌’’ గా పేరు మార్చుకోమని సలహా ఇచ్చింది. ఇప్పటికీ దిలీప్‌ కుమార్‌ అంటే గుర్తు పడతారు గాని, యూసుఫ్‌ ఖాన్‌ అంటే పాత తరం వాళ్ళు తప్ప ఎవరూ ఎరుగరు. చిత్రం బాగా ఆడలేదు కానీ ఆ తర్వాత దిలీప్‌ కుమార్‌ వెనుతిరిగీ చూడలేదు. త్వరలోనే ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా మన దేశపు మొదటి పెద్ద స్టార్‌ పుట్టాడు.


ట్రాజెడీ కింగ్‌

శరత్‌ బాబు వ్రాసిన నవల ‘‘దేవదాస్‌’’ ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో మూలానికి చాలా దగ్గరగా వున్నది, సినెమేటిక్‌ గా గొప్పది అయిన చిత్రం ‘‘బిమల్‌ రాయ్‌’’ తీసిన  చిత్రమే. అందులో దేవదాసుగా చేసిన దిలీప్‌ కుమార్‌ వయసు అప్పుడు ముప్పై లోపే. కానీ ఆ విషాద పాత్రలు (దేవదాసు కాకుండా ఇంకా కొన్ని వున్నాయి విషాద చిత్రాలు బాబుల్‌, దాగ్‌, దీదార్‌ లాంటివి) అతనికి డెప్రెషన్‌ కు గురి చేసాయి. ఇంగ్లండ్‌ లో వున్న ఒక డ్రామా కోచ్‌, కౌన్సెలర్‌ అతన్ని డిప్రెషన్‌ లోంచి బయటకు రావడానికి కామెడీ చిత్రాలు చేయమని సలహా ఇచ్చాడు. ట్రాజెడీ కింగ్‌ పేరు వున్నా దిలీప్‌ అన్ని రకాల పాత్రలూ చేశాడు. 


వివాహం, ప్రేమ ప్రసంగాలూ

1966 లో దిలీప్‌ కుమార్‌ వివాహం నటి సాయరా బాను తో అయ్యింది. అయితే మొదట దిలీప్‌ కుమార్‌ కామినీ కౌశల్‌ తో ఆ తర్వాత మధుబాల, వైజయంతి మాల లతో ప్రేమ లో పడ్డాడు. కానీ ఆ ప్రణయం వివాహం వరకూ సాగలేదు. సాయరా తో వివాహం చేసుకున్నా, వాళ్ళిద్దరి మధ్యా 22 సంవత్సరాల వ్యత్యాసం వుంది. ఆమె 1972 లో గర్భం దాల్చినా ఎనిమిదో నెలలో మిేస్కరేజ్‌ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళు పిల్లల గురించి ఆలోచించలేదు, దేవేచ్చకే వదిలేశారు. 1981 లో ఆస్మా సాహిబా ను రెండవ భార్యగా చేసుకున్నాడు. కాని వారి వివాహం రెండేళ్ళకు మించి నిలవలేదు. దిలీప్‌ కుమార్‌ సాయరా బాను ల వైవాహిక జీవితం అద్భుతం. బహుశా బాలీవుడ్‌ దంపతులలో వీరిదే అతి దీర్ఘమైన నిలకడైన వైవాహిక జీవితం.


అవార్డులూ సన్మానాలు

దిలీప్‌ అందుకున్న అవార్డులకు లెక్కే లేదు. ఫిలింఫేర్‌ పేరుతో వచ్చిన అవార్డుల్లో మొదటిది తనే తీసుకున్నాడు. అలాగే ఇప్పటిదాకా పెద్ద సంఖ్యలో (14 సార్లు నామినేట్‌ అయ్యి 8 సార్లు గెలుచుకున్నాడు) అవార్డులందుకున్న నటుడు. Film fare life time achievement award కూడా అందుకున్నాడు. భారత ప్రభుత్వం అతనికి పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. పాకిస్తాన్‌ ప్రభుత్వం కూడా అతనికి ‘‘నిషాన్‌-ఎ-ఇంతియాజ్‌’’ తో సత్కరించింది. అప్పట్లో శివ ేసనా అభ్యంతరం వ్యక్త పరచినా అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్పేయీ కారణంగా దిలీప్‌ కుమార్‌ ఆ సత్కారాన్ని స్వీకరించగలిగారు. 2000-2006 మధ్య కాలంలో కాంగ్రెస్‌ ఇతన్ని రాజ్యసభ సభ్యుడుగా నామినేట్‌ చేసింది.

పరేశ్‌ దోశి , 9848487768

బాలీవుడ్‌ త్రయం

1947 లో వచ్చిన ‘‘జుగ్ను’’ అనే చిత్రంతో అతను ప్రశంసలు అందుకున్నాడు, పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ దర్శకుడు సత్యజిత్‌ రాయ్‌ కూడా అతన్నిthe ultimate method actor కితాబు ఇచ్చాడు. బాలీవుడ్‌ లో గొప్ప హీరోలు అంటే ఆ కాలం లో రాజ్‌ కపూర్‌, దిలీప్‌ కుమార్‌, దేవ్‌ ఆనంద్‌ లు. ముగ్గురికీ తమ ప్రత్యేకతలు ఉన్నాయి. చిత్రాల ఎంపికలో, నటనలో. వాళ్ళ మధ్య ఆరోగ్యకరమైన పోటీ తప్ప పరస్పర గౌరవమే వుండేది. ఇక ప్రేక్షకులు కూడా అందరినీ ఆదరించారు. రాజ్‌ కపూర్‌, దిలీప్‌ కుమార్‌ లు చిన్నప్పటినుంచీ ేస్నహితులు. రాజ్‌ కపూర్‌ తండ్రి పృథ్వీరాజ్‌ కపూర్‌ గొప్ప నటుడు. అవే జీన్స్‌ రాజ్‌ కపూర్‌ కీ వచ్చాయి. ‘నువ్వు అందంగా వుంటావు, సినిమాల్లో చేరవచ్చు’ అని రాజ్‌ అన్నప్పటికీ దిలీప్‌ కుమార్‌ సంశయించాడు. ఎందుకంటే తను సిగ్గరి, నటన గురించి ఏమీ తెలీదు. కాని అతను సూపర్‌ స్టార్‌ (అప్పటికి ఈ పదం పుట్టలేదు. మొట్టమొదటి సూపర్‌ స్టార్‌ అంటే రాజేష్‌ ఖన్నా నే అంటారు) కావాల్సి వుంటే మరోలా ఎలా జరుగుతుంది?


డైలాగ్‌ డెలివరిలో కింగు

ఇల్లొదిలి పారిపోయి ఒక పార్సీ కాఫీ షాప్‌ ఓనర్‌, మరో భారతీయాంగ్ల జంటల సిఫారసు తో ఆర్మీ కేంటీన్‌ లో పనికి కుదిరాడు. తన ఇంటి గురించి గాని, తన జీవితం గురించి గానీ ఏమీ చెప్పకుండానే తన అనర్గళ ఆంగ్ల సంభాషణలతో అకట్టుకుని ఆ పని సంపాదించు కున్నాడు. ఉర్దూ, హిందీ, పంజాబీ, మరాఠీ, ఆంగ్లం, బాంగ్లా, గుజరాతీ, పష్తో, ఫారసీ, అవధీ, భోజ్‌పురీ భాషలు సమాన నైపుణ్యంతో తెలుసు దిలీప్‌కుమార్‌కి. పల్లె ప్రధాన చిత్రాలైనా, ఉర్దూ రొమాంటిక్‌ చిత్రాలైనా, పీరియాడిక్‌ చిత్రాలైనా.. పై పెచ్చు తన స్వరాన్ని సంభాషణలోని భావానికి అనుగుణంగా హెచ్చు తగ్గులు చేస్తూ, స్పష్టమైన ఉచ్చారణతో పలికేవారు.