Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 30 Nov 2021 03:41:41 IST

అన్నదాతకు ఏదీ భరోసా..?

twitter-iconwatsapp-iconfb-icon
అన్నదాతకు ఏదీ భరోసా..?

  • ప్రత్యామ్నాయ పంటకు ప్రోత్సాహం లేనట్లే!
  • విత్తన సబ్సిడీ, పంటల బీమా ఊసెత్తని సీఎం
  • మార్కెట్‌ భద్రత, ఎమ్మెస్పీ పర్యవేక్షణ, 
  • కొనుగోళ్లకు లభించని హామీ
  • సీఎం ప్రకటనతో నీరుగారిపోయిన రైతాంగం
  • యాసంగి సాగు.. రైతుల ఇష్టాయిష్టాలకే వదిలేసిన రాష్ట్ర  ప్రభుత్వం


హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటలో.. అన్నదాత పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టంచేయగా.. యాంసంగిలో కొనుగోలు కేంద్రాలు ఇకమీదట ఏర్పాటు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రైతాంగం.. ఈ యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తప్పించుకుంటాయని అనుమానిస్తూనే ఉంది. అందుకే.. సీజన్‌ మొదలైనా.. వరి సాగుకు తొందరపడడం లేదు. సోమవారం నాటికి వెయ్యి ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారు. యాసంగిలో వరికి బదులుగా.. నూనె గింజలు, పప్పు ధాన్యాలు సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. అయితే.. ఈ ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసిన రైతులకు.. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుందేమోనని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశ తప్పలేదు. 


ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసినా.. ఎలాంటి అదనపు ప్రోత్సాహకాలూ ఉండవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయడంతో.. వారు నీరుగారిపోయారు. యాసంగిలో వరి సాగుచేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని, రైస్‌మిల్లర్లు- విత్తన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని రైతులు తమంతటతాము వరి సాగుచేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని సోమవారం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ ప్రకటించారు. రెగ్యులర్‌గా ఇచ్చే రైతుబంధు మాత్రమే పంపిణీ చేస్తామని ప్రకటించారు. వరి సాగును వదిలేసి.. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని చెప్పిన కేసీఆర్‌.. ఈ దిశగా కనీసం విత్తన సబ్సిడీ అయినా ఇస్తారని రైతులు ఆశ పడ్డారు. గతంలో.. పంట రకాలను బట్టి 35 నుంచి 65 శాతం వరకు విత్తనాలపై సబ్సిడీ ఇచ్చేవారు. కానీ, నాలుగేళ్లుగా ఈ సబ్సిడీలు నిలిచిపోయాయి. ‘తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ’ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలంటే.. ముందుగా ‘సబ్సిడీ విత్తనాలు’ అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తన సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరిస్తారని రైతులు భావించారు. కానీ, సీఎం కేసీఆర్‌ ప్రకటనలో ఆ ఊసే లేదు. 


పంట బీమా లేనట్లే!

సాధారణంగా యాసంగి సీజన్‌లో అకాల వర్షాలు కురుస్తుంటాయి. వడగండ్లు.. కడగండ్లు మిగుల్చుతుంటాయి. దీంతో.. ఏటా రైతులు పంటలు చేతికొచ్చే సమయంలో నష్టపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే.. పంట బీమా పథకం అన్నదాతకు అందుబాటులోకి రావాలి. కానీ.. ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచిస్తున్న దాఖలా కూడా కనిపించడం లేదు. రైతు బంధు, రైతుబీమా మినహా.. పంటల బీమా పథకాల అమలుపై చేతులెత్తేసింది. గతంలో నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌, మోడిఫైడ్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌, వెదర్‌బే్‌సడ్‌ క్రాప్‌ ఇన్సురెన్స్‌ స్కీమ్‌లు అమలులో ఉండేవి. రైతాంగం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాటాల వంతున ఇన్సురెన్స్‌ ప్రీమియం చెల్లించేవి. ఐదేళ్ల క్రితం ఈ పథకాలన్నింటికీ మంగళం పాడేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని (పీఎంఎఫ్‌బీవై) అమలులోకి తీసుకొచ్చి.. మూడేళ్లకే దాన్నీ తీసేశారు. దీంతో రైతులకు రాష్ట్రంలో పంట బీమా పథకాలేవీ అందుబాటులో లేకుండా పోయాయి. ఏపీ, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌లో పంటల బీమా పథకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేస్తున్నాయి. అదేతరహాలో తెలంగాణలో కూడా పంట బీమా పథకాన్ని అమలుచేయాలని రైతుల నుంచి రెండేళ్లుగా డిమాండ్‌ వస్తోంది. కానీ, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈసారైనా.. పంట బీమా అందుబాటులోకి తెస్తుందని అంచనా వేసిన రైతులకు.. ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయడం లేదన్న విషయం కేసీఆర్‌ ప్రకటనతో స్పష్టత వచ్చింది. ఏ పంట సాగు చేసినా.. పరిస్థితి గాలిలో దీపమేనని తెలిసొచ్చింది. 


పంట కొనుగోళ్లు ప్రైవేటు ట్రేడర్ల చేతిలోకే..

రైతులు వరి సాగువైపు మొగ్గుచూపటానికి ప్రధాన కారణం.. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండడం. దీంతో.. రైతులకు మార్కెటింగ్‌ సమస్య లేకుండా పోయింది. ట్రేడర్లు, దళారుల వద్దకు పోవాల్సిన అవసరం లేకుండాపోయింది. దీంతో రైతులు.. వరి సాగుపై మక్కువ పెంచుకున్నారు. సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచేశారు. వరి సాగుకు పూర్తిగా అలవాటుపడి పోయారు. ఇప్పు వీళ్లను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలంటే.. ప్రోత్సాహకాలతో పాటు ‘ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు’ ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. కానీ, ప్రభుత్వం నుంచి ఆ భరోసా రావడంలేదు. దీంతో.. ప్రైవేటు ట్రేడర్లచేతిలోకి పంట వెళ్లిపోతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌, హాకా లాంటి సంస్థలు ప్రొక్యూర్‌మెంట్‌ చేయటానికి ప్రభుత్వానికి నోడల్‌ ఏజెన్సీలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా నిర్వీర్యమైపోయాయి. 


రెండేళ్లుగా మొక్కజొన్నలను కూడా మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయడంలేదు. రైతులు అతి తక్కువ ధరకు ప్రైవేటు ట్రేడర్లకు అమ్ముకుంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగుచేస్తే... ప్రభుత్వం కొనుగోలుచేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు... ‘అంత రిస్క్‌ చేయదల్చుకోవడంలేదు’ అని సీఎం కేసీఆర్‌ ఒక్కముక్కలో తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసినా.. ప్రభుత్వం కొనబోదనే క్లారిటీ ఇచ్చినట్లయింది. అంటే.. రైతులు ఏ పంట వేసినా.. ప్రభుత్వం పట్టించుకోబోదని సీఎం ప్రకటనతో అర్థమవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. రైతుకు కనీసం మద్దతు ధరైనా లభించేది. కానీ, బహిరంగ మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీలు లేనప్పుడు.. ట్రేడర్లు, దళారులదే పైచేయి అవుతుంది. రైతులకు ఎమ్మెస్పీ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. వరికి బదులుగా రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగుచేస్తే.. ఎమ్మెస్పీ ఇచ్చేలా గానీ, ఇప్పించేలాగానీ ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యాన్ని కూడా సీఎం కేసీఆర్‌ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళకు గురవుతున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.