మృతదేహంతో ఆందోళన

ABN , First Publish Date - 2022-05-18T05:27:44+05:30 IST

అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో జరిగిన అపశ్రుతిలో మృతి చెందిన యల్లయ్య మృతదేహంతో అన్నమయ్య విగ్రహం ఎదుట బంధువులు మంగళవారం ఆందోళన చేశారు.

మృతదేహంతో ఆందోళన
అన్నమయ్య విగ్రహం ఎదుట ఆందోళన చేస్తున్న దృశ్యం

టీటీడీ చైర్మన్‌తో ఎమ్మెల్యే మేడా చర్చలు 

ఉద్యోగంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వడానికి అంగీకారం


రాజంపేట, మే 17 : అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో జరిగిన అపశ్రుతిలో మృతి చెందిన యల్లయ్య మృతదేహంతో అన్నమయ్య విగ్రహం ఎదుట బంధువులు మంగళవారం ఆందోళన చేశారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద సోమవారం ఊంజల సేవ కార్యక్రమానికి ఊయలను ఏర్పాటు చేస్తుండగా ఊయల ఒక్కసారిగా కిందపడి ముగ్గురు గాయపడటం, కత్తి యల్లయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కడప రిమ్స్‌ నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి అన్నమయ్య విగ్రహం ఎదుట ఉంచి మృతుడి బంధువులతో పాటు బోయనపల్లె అరుంధతివాడ గ్రామస్థులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. టీడీపీ రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి అద్దేపల్లె ప్రతా్‌పరాజు వారికి మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. టీటీడీ ఏఈ రవి, మన్నూరు సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ భక్తవత్సలం, ఇతర టీటీడీ ఉద్యోగులు కలిసి మృతుడి కుటుంబీకులతో చర్చించారు. వెంటనే ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డితో ఫోన్‌లో ఈ విషయాన్ని వివరించారు. మృతుడు కత్తి యల్లయ్య కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 10 లక్షల రూపాయలు ఆర్థికసాయం చేయాలని ఎమ్మెల్యే కోరగా 5 లక్షల రూపాయల నగదు, టీటీడీలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ విషయం ఎమ్మెల్యే మృతుడి బంధువులకు తెలియజేశారు. అంత్యక్రియల కోసం తక్షణం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వారికి తెలియజేస్తూ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు, టీటీడీ ఏఈ రవికుమార్‌, బోయనపల్లె సర్పంచ్‌ బోగా రాజ తదితరుల చేతుల మీదుగా లక్ష రూపాయల మొత్తాన్ని అందజేశారు. 

Updated Date - 2022-05-18T05:27:44+05:30 IST