సీఎం వచ్చేదాకా ఆందోళన!

ABN , First Publish Date - 2022-06-16T08:06:20+05:30 IST

నిర్మల్‌ జిల్లా బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్‌ ఐటీ)లో విద్యార్థుల ఆందోళన రెండోరోజైన బుధవారం కొనసాగింది.

సీఎం వచ్చేదాకా  ఆందోళన!

  • స్పష్టం చేసిన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు.. 
  • తరగతుల బహిష్కరణ.. సమస్యలపై రెండోరోజూ గళం
  • సమస్య పరిష్కరిస్తామని మంత్రులు కేటీఆర్‌, సబిత హామీ
  • లెక్కచేయని విద్యార్థులు.. నిర్మల్‌ కలెక్టర్‌ చర్చలూ విఫలం
  • అక్కడికెళ్లిన నేతలు, తల్లిదండ్రులను అడ్డుకున్న పోలీస్‌లు
  • సమస్య గవర్నర్‌ దృష్టికి.. బండి సంజయ్‌ వినతి పత్రం
  • సోషల్‌ మీడియాలో వేలాదిగా పోస్టులు


బాసర, జూన్‌, 15: నిర్మల్‌ జిల్లా బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్‌ ఐటీ)లో విద్యార్థుల ఆందోళన  రెండోరోజైన బుధవారం కొనసాగింది. ఎనిమిది వేల మంది విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి వర్సిటీలో నెలకొన్న సమస్యలపై గొంతెత్తారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద రోజంతా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వర్షంలో తడుస్తూనే  కదలకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. సీఎం  కేసీఆర్‌ వర్సిటీకి వచ్చి.. సమస్యలు పరిష్కరించేదాక  ఆందోళన ఆపబోమని స్పష్టంచేశారు. సోషల్‌ మీడియా వేదికగానూ వేల మంది విద్యార్థులు తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ హమీ ఇచ్చినా.. వైస్‌ చాన్సలర్‌తో సమావేశం ఏ ర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా విద్యార్థులు మాత్రం పట్టు వీడటం లేదు. మాటలు చెప్పొద్దని.. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని సోషల్‌ మీడియా వేదికగా మంత్రులకు విద్యార్థులు ఘాటైన సమాధానాలిచ్చారు.


 మరోపక్క విద్యార్థులతో నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫా రుఖీ గంటపాటు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేదాకా ఆందోళన విరమించేది లేదని కలెక్టర్‌కు విద్యార్థులు తేల్చిచెప్పారు. ఆ చర్చల నుంచి మధ్యలోనే బయటకొచ్చేసి ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత ఒకేసారి ఎనిమిది వేల మంది విద్యార్థులు ప్రధాన గేటువైపు తరలిరావడంతో పోలీసులు టెన్షన్‌పడ్డారు. ముందు జాగ్రత్తగా వర్సిటీలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టారు. కాడా, విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ప్రయత్నించిన నాయకులను, ఇతర వ్యక్తులను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విపక్ష నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. బాసర వంతెన వద్ద కూడా పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.  


గవర్నర్‌కు దృష్టికి సమస్య 

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన, సమస్యల గురించి బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావులు బుధవారం గవర్నర్‌ తమిళి సై దృష్టికి తీసుకెళ్లారు. ట్రిపుల్‌ ఐటీలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థుల ఆందోళన చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.


ఆ ముగ్గురు విద్యార్థులు ఎక్కడ? 

చర్చల కోసం నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ, ఇతర అధికారుల వద్దకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు తిరిగి రాకపోవడంతో మిగతా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ వర్సిటీకి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని తేల్చి చెప్పారు. అదే సమయంలో నిర్మల్‌ కలెక్టర్‌తో పాటు అధికారులు తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చర్చల కోసం తీసుకెళ్లిన ముగ్గురు వర్సిటీ విద్యార్థులను వెంటనే తమకు అప్పగించాలని వారు డిమాండ్‌ చేశారు. మరోవైపు నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌, ఇతర జిల్లా ఉన్నతాధికారులందరూ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. రాత్రి అయినప్పటికీ వారు వర్షంలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు.  


రేపటి నుంచి తరగతులు: కలెక్టర్‌ 

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు. విద్యార్థులతో రెండు దఫాల చర్చల అనంతరం బుధవారం రాత్రి బాసర పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు చెప్పారు. విద్యాపరమైన, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వారికి సంబంధం లేని విషయాలను కూడా లేవనెత్తుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం కూడా ఒప్పుకొందని చెప్పారు. గురువారం నుంచి విద్యార్థులకు ఎప్పటిలాగే తరగతులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-16T08:06:20+05:30 IST