సెకండ్‌ వేవ్‌పై ఆందోళన

ABN , First Publish Date - 2020-12-03T05:45:26+05:30 IST

పెరుగుతున్న చలి నేపథ్యంలో కరోనా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిస్తున్నది. డిసెంబరులో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి.

సెకండ్‌ వేవ్‌పై ఆందోళన
కరోనా


జిల్లా కేంద్రంలో పెరుగుతున్న కేసులు

మండలాల్లో తగ్గుముఖం

నవంబర్‌లో 1,912 మందికి సోకిన వైరస్‌

28 మంది మృతి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పెరుగుతున్న చలి నేపథ్యంలో కరోనా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిస్తున్నది. డిసెంబరులో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ప్రజల్లో కరోనా తగ్గిందనే అభిప్రాయం నెలకొంది. చాలామంది కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాధి విస్తరిస్తుందేమోనన్న ఆందోళన నెలకొన్నది. జిల్లా కేంద్రంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. దీంతో నగరంలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం జిల్లా కేంద్రం నుంచి రావడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. నవంబరులో జిల్లాలో 1,912 మందికి కరోనా సోకింది. అక్టోబరుతో పోల్చితే 45 శాతం కేసులు తగ్గినా చలి తీవ్రత పెరుగుతుండడంతో మళ్లీ వ్యాధి వ్యాప్తి చెందవచ్చని భావిస్తున్నారు. జిల్లాలో నవంబరులో 4,521 ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించగా 750 మందికి, 41,176 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించగా 1,162 మందికి పాజిటివ్‌ వచ్చింది. నవంబరు నెలలో 45,697 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. 28 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాలో అక్టోబరు మొదటి వారంలో 7.5 శాతంగా ఉన్న పాజిటివ్‌ రేటు నవంబరు చివరి వరకు 4.18 శాతానికి పడిపోయింది. జిల్లాలో నవంబరులో వ్యాధి సోకినవారిలో చాలామంది కోలుకోగా హోమ్‌ ఐసోలేషన్‌లో 782 మంది ఉన్నారు.  జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 37 మంది, జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు, వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 38 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మార్చి 17న తొలి కరోనా కేసు నమోదుకాగా ఇప్పటి వరకు 22,042 మంది వ్యాధిబారిన పడ్డారు. మార్చిలో 13 మంది, ఏప్రిల్‌లో ఆరుగురు, మేలో నలుగురు వ్యాధి బారిన పడ్డారు. 

నిబంధనల సడలింపుతో పెరిగిన కేసులు

జూన్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం ప్రారంభించారు. ఆ నెలలో 96 మందికి వ్యాధి సోకగా జూలైలో 2,168 మందికి, ఆగస్టులో 8,328 మందికి, సెప్టెంబర్‌లో 6,116 మందికి, అక్టోబర్‌లో 3,410 మందికి కరోనా వ్యాధి సోకింది. ఆగస్టులో రికార్డు స్థాయిలో అత్యధిక కేసులు నమోదుకాగా సెప్టెంబరరులో కొద్ది తీవ్రత తగ్గినా ఆందోళన కలిగించేవిధంగానే కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో 45 శాతం కేసులు తగ్గగా, నవంబర్‌లో కూడా 45 శాతం కేసులు తగ్గాయి. ప్రస్తుతం జూలై మాసంలో మాదిరిగా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో కరోనావ్యాధి ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు 2,35,083 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 42,618 ఆర్‌టీపీసీఆర్‌, 1,92,465 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేశారు. వీరిలో 22,042 మందికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లావ్యాప్తంగా మార్చి నుంచి ఇప్పటి వరకు 214 మంది మృతి చెందారు. 859 మంది హోమ్‌ ఐసోలేషన్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా మిగిలిన అందరూ కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాధి పరిస్థితి జిల్లా కేంద్రంలో మినహా అంతటా దాదాపుగా అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తున్నది.

వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి...

జిల్లాలో వైరస్‌ తీవ్రత పెరగకుండా నివారించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నిర్ధారణ పరీక్షలపై దృష్టిసారించింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు మొబైల్‌ టీంల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం మొబైల్‌ వైద్య సిబ్బంది ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాప్‌లో 177 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి 92 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఎవరికి వ్యాధి నిర్ధారణ కాలేదు. వ్యాధి నియంత్రణ కోసం మరో నాలుగు వారాలపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి ముప్పు ఇంకా తొలగిపోనందున ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జి సుజాత కోరారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.

Updated Date - 2020-12-03T05:45:26+05:30 IST