పంట.. కోసేదెలా?

ABN , First Publish Date - 2020-04-08T12:06:53+05:30 IST

అన్నదాతలపై కూడా కరోనా దెబ్బ పడింది. ఈ ఏడాది రబీ సీజన్‌లో వరి పైరు బాగా పండింది. రైతులు కోతలకు

పంట.. కోసేదెలా?

వరి కోతలకు కూలీల కొరత

అన్నదాతల్లో ఆందోళన

నరసన్నపేట/జలుమూరు, ఏప్రిల్‌ 7 :  అన్నదాతలపై కూడా కరోనా దెబ్బ పడింది. ఈ ఏడాది రబీ సీజన్‌లో వరి పైరు బాగా పండింది. రైతులు కోతలకు సన్నద్ధమవుతున్న వేళ.. కరోనా ప్రభావం మొదలైంది. వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో పంట కోతలకు కూలీల కొరత వేధిస్తోంది. ఓ వైపు వరి వెన్ను వాల్చుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


జిల్లాలో ఈ ఏడాది ప్రధానంగా వంశధార ఎడమ, కుడి కాలువల పరిధిలోని రైతులు వేలాది ఎకరాల్లో రబీ సాగుచేశారు. ఈ కాల్వల పరిధిలో నరసన్నపేట, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస తదితర మండలాలు ఉన్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని 1200 హెక్టార్లలో సాగు చేశారు. నరసన్నపేట, జమ్ము, కరగాం, కంబకాయి, నర్సింగపల్లి, తాళ్లవలస, కూర్మనాథపురం, జలుమూరు తదితర గ్రామాల్లో వరి పైరు కోత దశకు వచ్చి పదిరోజులు అవుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. వ్యవసాయ పనులు కూడా మూకుమ్మడిగా చేయరాదని, భౌతిక దూరం పాటించాలని అధికారులు ఆదేశించారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు కూలీలు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూలీలు దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ పనులకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. 


కళ్లాల్లోనే ధాన్యం

జలుమూరు మండలంలో ఈ ఏడాది 1,920 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. సంక్రాంతి తరువాత అకాల వర్షాలు పడడం... వాతావరణం అనుకూలించడంతో మంచి దిగుబడులు వచ్చాయి. పంటదశకు వచ్చే సరికి కరోనా ప్రభావం పడడంతో పంట కోతకు..నూర్పిడికి రైతులు అవస్థలు పడ్డారు. కొందరు కూలీలకు రెట్టింపు వేతనాలు చెల్లించి.. వరికోతలు పూర్తి చేశారు.  కళ్లాల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వేళ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు రైతులు ఈ ధాన్యాన్ని విక్రయించేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొనేనాథుడి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. మద్దతు ధర అందజేయాలని వేడుకుంటున్నారు. 

Updated Date - 2020-04-08T12:06:53+05:30 IST