ఆందోళన.. ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-12T07:14:23+05:30 IST

రుయాలో విషాద ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. పాలకుల వైఫల్యం వల్లే ఆక్సిజన్‌ అందక సోమవారం రాత్రి 11 మంది కరోనా బాధితులు మృతిచెందారంటూ మండిపడ్డాయి.

ఆందోళన.. ఆగ్రహం

ప్రతిపక్షాలను అడ్డుకున్న పోలీసులు 

స్టేషన్‌కు తరలింపు.. ఆపై విడుదల 


తిరుపతి(జీవకోన), మే 11: రుయాలో విషాద ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. పాలకుల వైఫల్యం వల్లే ఆక్సిజన్‌ అందక సోమవారం రాత్రి 11 మంది కరోనా బాధితులు మృతిచెందారంటూ మండిపడ్డాయి. మంగళవారం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రుయాస్పత్రికి వచ్చిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు దదిగిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత విడుదల చేశారు. 


ప్రభుత్వం బాధ్యత వహించాలి: టీడీపీ 


కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్‌, మెరుగైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ మండిపడ్డారు. ఆక్సిజన్‌ అందక సోమవారం రాత్రి 11మంది విలవిల కొట్టుకుని మృత్యువాత పడటం దీనికి నిదర్శనమన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు  రూ.20 లక్షల పరిహారం అందించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రుయా అధికారులు, డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాత్రి సమయంలో కేవలం జూనియర్‌ డాక్టర్లపైనే బాధ్యతలు పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చేరాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం రుయా వద్ద మాజీ ఆమెతోపాటు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, నాయకులు మబ్బు దేవనారాయణరెడ్డి, చినబాబు, మహేష్‌యాదవ్‌, ప్రకాష్‌, రుద్రకోటి, తిరుమలనాయుడు ధర్నాకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. 


విపక్షాల గొంతునొక్కుతారా?: బీజేపీ 


సకాలంలో ఆక్సిజన్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం, వాటిని పరిశీలించి రోగులకు సమస్య రాకుండా చూసుకోవడంలో రుయా అధికారులు విఫలమయ్యారని బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించేందుకు వచ్చిన విపక్షాల గొంతునొక్కేందుకు పోలీసులతో అరెస్టులు చేయించడం బాధాకరమన్నారు. రుయాలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన తమతో పాటు ఇతర పార్టీల నాయకులనూ అరెస్టుచేసి లాక్కెళ్లడమంటే.. ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకోవడమేనని అన్నారు. మృతుల కుటుంబాలకు వెంటనే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. మృతుల కుటుంబీకులను పరామర్శించేందుకు రుయాస్పత్రికి వచ్చిన భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దయాకర్‌రెడ్డి, వరప్రసాద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. 


సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలి: సీపీఐ 


సకాలంలో ఆక్సిజన్‌ ట్యాంకరు వస్తుందా లేదా అనేది పర్యవేక్షించాల్సిన రుయా సూపరింటెండెంట్‌ నిర్లక్ష్యం కారణంగానే 11మంది కరోనా బాధితులు మృతి చెందారని సీపీఐ నేత రాధాకృష్ణ మండిపడ్డారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా బాధితులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. రుయా వద్ద ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు రాధాకృష్ణ, విశ్వనాధం, శ్రీరాములును అలిపిరి పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.


రూ.50లక్షల పరిహారం చెల్లించాలి: కాంగ్రెస్‌

రుయా ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు రూ.50లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్‌ పార్టీ నేత మాంగాటి గోపాలరెడ్డి డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ రుయా వద్ద ధర్నా చేశారు. కరోనా బాధితులకు సరైన వైద్యం, సకాలంలో ఆక్సిజన్‌ను అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. దీనిని గాలికి వదిలేసి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఈ ధర్నాలో కాంగ్రెస్‌ నాయకులు పి.భాస్కర్‌, వెంకటనరసింహులు, మురళి, నరేంద్రబాబు, గోపిగౌడ్‌, రామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T07:14:23+05:30 IST