Covid సాయం కోసం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పిలుపు

ABN , First Publish Date - 2021-05-07T18:20:45+05:30 IST

కోవిడ్-19 బాధితులకు సేవలందించేందుకు ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్

Covid సాయం కోసం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పిలుపు

న్యూఢిల్లీ : కోవిడ్-19 బాధితులకు సేవలందించేందుకు ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ నడుం బిగించారు. స్వయంగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తుండటంతో అనేక మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి సహాయపడటం కోసం ప్రారంభించిన ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని తమ ఫ్యాన్స్‌ను కోరారు. ఈ మేరకు ఈ దంపతులిద్దరూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 


కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నవారికి అండదండలు అందించడం కోసం నిధి సేకరణను ప్రారంభించినట్లు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఓ వీడియో సందేశంలో తెలిపారు. సహాయ కార్యక్రమాల కోసం నిధిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధి కోసం తాము రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. 


‘‘కోవిడ్-19 మహమ్మారి మొదలైనప్పటి నుంచి మన దేశం పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటోంది. మన ఆరోగ్య వ్యవస్థలు సవాలును ఎదుర్కొంటున్నాయి, మనం కలిసికట్టుగా ముందుకు వచ్చి, మన భారత దేశానికి సహాయపడవలసిన అవసరం ఉంది’’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విరాట్  పేర్కొన్నారు. 



‘‘కోవిడ్-19 సహాయం కోసం నిధులను సేకరించేందుకు అనుష్క, నేను కెట్టోలో ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. మీ సహకారానికి కృతజ్ఞులం. ప్రాణాలను కాపాడటానికి ఏమాత్రం సొమ్ము అయినా తక్కువేమీ కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘గట్టి ప్రభావం చూపేవిధంగా మేం చేయగలిగినదంతా చేస్తాం, అయితే ఈ పోరాటంలో మాకు మీ సహాయం కావాలి. మా ఉద్యమంలో చేరాలని మీ అందరినీ కోరుతున్నాను. మన దేశాన్ని సురక్షితంగా, దృఢంగా తీర్చిదిద్దడానికి మన వంతు కృషి మనం చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పోరాడితే విజయం సాధించగలుగుతామని తెలిపారు. 


శుక్రవారం పోస్ట్ చేసిన ఈ వీడియోలో అనుష్క మాట్లాడుతూ, భారత దేశంలో పరిస్థితులు కఠినంగా ఉన్నాయన్నారు. మన దేశం ఈ విధంగా ఇబ్బందుల్లో పడటం తమను కలచివేస్తోందన్నారు. నిధి సేకరణలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, సహాయం చేసే మొత్తం ఎంత చిన్నదైనప్పటికీ, గొప్ప ప్రభావం చూపగలదని చెప్పారు. 


విరాళాలు ఇవ్వడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి


#InThisTogether #ActNow #OxygenForEveryone #TogetherWeCan #SocialForGood


@kettoindia @actgrants



Updated Date - 2021-05-07T18:20:45+05:30 IST