సాధికారత వైపు తొలి అడుగు

ABN , First Publish Date - 2022-08-17T07:04:30+05:30 IST

‘‘ఇది నా చిన్న నాటి కల. ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాలని! ఎందుకో తెలియదు... బడి వయసులోనే నా మనసులో ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. అదే విషయం ఎప్పుడూ అమ్మా నాన్నలకు చెబుతుండేదాన్ని.

సాధికారత వైపు తొలి అడుగు

ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో అమెరికాలోని ‘కార్నెల్‌’ ఒకటి. అంతటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది మన తెలుగమ్మాయి మల్లకంటి అనూష. అంతేకాదు... ‘రతన్‌ టాటా ఫౌండేషన్‌’ నుంచి రెండున్నర కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ అందుకుంది. ఒక లక్ష్యం... దాన్ని సాధించేందుకు పట్టువదలని ప్రయత్నం... ఇవే తనకు ఈ అవకాశం తెచ్చిపెట్టాయంటున్న అనూషను ‘నవ్య’ పలుకరించింది. 


టాలెంట్‌


‘‘ఇది నా చిన్న నాటి కల. ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాలని! ఎందుకో తెలియదు... బడి వయసులోనే నా మనసులో ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. అదే విషయం ఎప్పుడూ అమ్మా నాన్నలకు చెబుతుండేదాన్ని. మొదట్లో వాళ్లు అంతగా పట్టించుకోలేదు. మా నాన్న లక్ష్మీకాంత్‌ సివిల్‌ ఏవియేషన్‌లో ఉద్యోగి. అమ్మ మాధవీలత గృహిణి. నాన్న ఉద్యోగరీత్యా మేం కొంత కాలం ఢిల్లీలో ఉన్నాం. నేను ఎల్‌కేజీ అక్కడే చదివానట. తరువాత విజయవాడకు వచ్చి స్థిరపడ్డామని అమ్మ చెప్పిం ది. ఒకటో తరగతి నుంచి ఇక్కడే చదివాను. అయితే ఇంటర్‌లోకి వచ్చేసరికి నా కల నెరవేర్చుకోవాలనే పట్టుదల ఎక్కువైంది. ఎలాగైనా అనుకున్నది సాధించాలనుకున్నా. ఉత్తమ వర్సిటీలు, వాటిల్లో చదవడానికి కావల్సిన అర్హతలు తదితర అంశాలపై అవగాహన పెంచుకున్నా. ప్రణాళిక వేసుకుని.. దానికి తగ్గట్టుగా సాధన మొదలు పెట్టాను. 


అమ్మ కోరిక అలా తీరింది... 

మొదటి నుంచి నేను చదువులో ముందుండేదాన్ని. దాంతోపాటే భరతనాట్యం, కూచిపూడి అభ్యాసం ప్రారంభించాను. నిజానికి ఇది అమ్మ కోరిక. సంప్రదాయ నృత్య కళాకారిణిగా తను ఎదగాలనుకుంది. కానీ పలు కారణాల వల్ల సాధ్యపడలేదు. ఆ లోటును నా ద్వారా తీర్చుకోవాలనుకుంది. అందుకే నాకు చిన్నప్పటి నుంచే భరతనాట్యం, కూచిపూడిల్లో శిక్షణ ఇప్పించింది. స్కూలు, కాలేజీ స్థాయిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, ఉత్సవాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. నాకంటూ ఒక వేదిక ఉండాలని యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాను. దాంతోపాటు నా ప్రతిభ, ప్రదర్శనలతో పాటు మన సంప్రదాయ నృత్య రీతులు మరింత మందికి చేరువ కావాలనే ఉద్దేశంతో వెబ్‌సైట్‌ రూపొందించాను. చదువు కోసం నాట్యాన్ని ఎప్పుడూ పక్కన పెట్టలేదు. నాకు రెండూ ముఖ్యమే. 


లక్ష్యం నెరవేరిన క్షణం... 

ఎంపీసీతో ఇంటర్‌ పూర్తయింది. 97 శాతం మార్కులు సాధించాను. అదే సమయంలో విదేశాల్లో చదువుకు కావల్సిన అర్హతలు కూడా సంపాదించాను. శాట్‌ (స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌), ఐఈఎల్‌టీఎస్‌ (ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌)లో ఉత్తీర్ణతతో నా లక్ష్యానికి చేరువయ్యాను. చివరకు నా కృషి ఫలించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అమెరికాలోని ‘కార్నెల్‌’లో బీఎస్సీ కంప్యూటర్స్‌కు సీటు లభించింది. ‘కార్నెల్‌’తో పాటు మరో ఏడు టాప్‌ యూనివర్సిటీలు కలిసి ‘ఐవీ లీగ్‌’గా ఏర్పడ్డాయి. ఇందులో కార్నెల్‌ వర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా 20వ ర్యాంక్‌లో ఉంది. దానికి నేను ఎంపిక అయ్యానని తెలిసినప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఇన్నేళ్ల నా కల ఫలించిన క్షణం అది. 


‘టాటా’ నుంచి రెండున్నర కోట్లు..

అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... అమెరికాలో నా చదువుకు ‘రతన్‌ టాటా ఫౌండేషన్‌’ 2.5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. రతన్‌ టాటా కూడా ‘కార్నెల్‌’ వర్సిటీ పూర్వ విద్యార్థే. అందుకే భారత్‌ నుంచి ఆ యూనివర్సిటీకి వెళ్లే అత్యుత్తమ ప్రతిభావంతులకు ఈ ఆర్థిక సాయం చేస్తారు. ఈసారి మొత్తం ఐదుగురిని ఎంపిక చేస్తే... అందులో నేనూ ఉండడం గర్వంగా అనిపిస్తుంది. ఏపీ నుంచి ఈ ఉపకార వేతనానికి అర్హత సాధించింది నేనొక్కతినే. విశేషమేమంటే... చిన్నప్పటి నుంచి సాధన చేసిన భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు నాకు సీటు రావడానికి దోహదపడ్డాయి. నా ప్రొఫైల్‌కు ఇవి ప్లస్‌ అయ్యాయి. ఏదిఏమైనా మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగి, మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని సాధికారత వైపు నడిపించాలన్నది నా ఆశయం. ఆ దిశగా ఇది నా తొలి అడుగు.’’ 


గుడాల శ్రీనివాస, విజయవాడ 

ఫొటో: లక్ష్మణ్‌   

Updated Date - 2022-08-17T07:04:30+05:30 IST