‘అణు..మానం’ నిజమే!

ABN , First Publish Date - 2022-08-04T07:36:26+05:30 IST

‘అణు..మానం’ నిజమే!

‘అణు..మానం’ నిజమే!

బీచ్‌శాండ్‌ మైనింగ్‌పై కేంద్రం దర్యాప్తు

ఉల్లంఘనల వ్యవహారంలో జగన్‌ సర్కార్‌కు షాక్‌

బలంగా బిగుసుకుంటున్న ఆటమిక్‌ ఉచ్చు

ఐబీఎమ్‌తో విచారణకు అణుశక్తి విభాగం లేఖ

తొలి నుంచీ ఏపీ సర్కారుపై కేంద్రానికి అనుమానాలే

ఉల్లంఘనలు లేవన్న నివేదికపై పలు సందేహాలు

తిరిగి స్పందించకపోవడంతో నేరుగా రంగంలోకి

బీచ్‌శాండ్‌ఉత్పత్తి, ఎగుమతి, అమ్మకాలు, ఉల్లంఘనలు,

పర్యావరణ విధ్వంసంపై ఐబీఎమ్‌ దర్యాప్తు

వైసీపీ ఎంపీల ప్రశ్నలకు పీఎంవో మంత్రి స్పష్టీకరణ

అక్రమ ఎగుమతులపై ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

అంతా బాగుందని అప్పట్లో సర్కారు బుకాయింపు

మరి ఐబీఎమ్‌తో విచారణ దేనికంటూ సర్వత్రా ప్రశ్నలు


అణు..మానమే నిజమైంది. బీచ్‌శాండ్‌ నుంచి తీసిన అణుధార్మిక ఖనిజాలను దేశం దాటిస్తున్న వైనం పార్లమెంటు సాక్షిగానే బట్టబయలైంది. అప్పుల తప్పులతో ఆగని జగనన్న అక్రమాల పరంపర, చివరకు దేశ భద్రతకు సైతం ఎసరు పెట్టే పరిస్థితికి చేరుకోవడం కేంద్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో పెద్ద ఎత్తునే ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్టు పసిగట్టి.. దర్యాప్తునకు ఆదేశించింది.


న్యూఢిల్లీ, అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో జరిగిన ఉల్లంఘనలపై దర్యాప్తు జరిపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో ఈ ఖనిజ తవ్వకం విషయంలో ఉల్లంఘనలే లేవంటూ ఇప్పటివరకు వాదించిన జగన్‌ ప్రభుత్వానికి గట్టి షాక్‌ తగిలింది. ‘‘బీచ్‌శాండ్‌ తవ్వకాల్లో భాగంగా వెలికితీసిన మోనజైట్‌ను రహస్యంగా ఎగుమతి చేయడం, అమ్మడం విషయంలో ఉల్లంఘనలు జరిగాయని కేంద్ర అణుశక్తి సంస్థ (డీఏఈ) గుర్తించింది. దీనిపై ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (ఐబీఎం) ద్వారా దర్యాప్తు చేయించాలని గనుల మంత్రిత్వ శాఖను ఆ సంస్థ కోరింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరాం’’ అని బుధవారం లోక్‌సభలో మోదీ ప్రభుత్వం పేర్కొంది. నిజానికి, అణు ధార్మిక కార్యక్రమంలో కీలకమైన మోనజైట్‌ను రహస్యంగా విదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టు ఈ ఏడాది మార్చి 17న ‘రాష్ట్రంపై కేంద్రం అణు...మానం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ వార్తాకథనం ప్రచురించింది. ఇప్పుడు వైసీపీ సభ్యులు కోటగిరి శ్రీధర్‌, సంజీవ్‌ కుమార్‌ సింగారి అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానంలో ఈ ‘అణు...మానాలు నిజమే’నని తేలిపోయింది. ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రి జితేందర్‌ సింగ్‌ తన సమాధానంలో ఇదే విషయం స్పష్టం చేశారు. ‘‘బీస్‌ శాండ్‌ ఖనిజవనరుల తవ్వకం కోసం డీఏఈ...ఏపీ ఖనిజవనరుల అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో  17 ప్రతిపాదనలను స్వీకరించింది. వీటిలో విశాఖ భీమునిపట్నంలో 90.15 హెక్టార్లలో, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 198.471 హెక్టార్లలో బీచ్‌ శాండ్‌ డిపాజిట్లకు సంబంధించి ఏపీఎండీసీని లీజుదారుగా నియమించింది. పర్యావరణ నష్టం, మైనింగ్‌ చట్టాల ఉల్లంఘన, రహస్యంగా మోనజైట్‌ ఎగుమతికి సంబంధించి ఫిర్యాదులు రావడంతో ఏపీఎండీసీకి పంపిన మిగతా 15 ప్రతిపాదనలను 2021 జూన్‌ 11న పక్కన పెట్టాం’’ అని మంత్రి వివరించారు. ఐబీఎమ్‌ వద్ద మోనజైట్‌ ఉత్పత్తి, రవాణా, అమ్మకానికి సంబంధించిన వివరాలు ఉంటాయని మంత్రి చెప్పారు. 


సర్కారుకు సంకటమే

బీచ్‌శాండ్‌ వ్యవహారం సర్కారుకు సంకటాన్ని తెచ్చిపెట్టేలా ఉందని అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర అణుశక్తి శాఖ సూచన మేరకు ఫిబ్రవరిలోనే రాష్ట్ర సర్కారు నివేదిక ఇచ్చింది. బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేసింది. ఈ నివేదికతో కేంద్రం నుంచి తదుపరి సందేహాలు ఉండవచ్చని అంచనావేశారు. కానీ అణుశక్తి శాఖ మరి కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ వాటిపై వివరణలు కోరింది. కానీ రాష్ట్రం మార్చి నెలాఖరు వరకు ఎలాంటి వివరణలు ఇవ్వలేదని కేంద్రమే లోక్‌సభ వేదికగా మార్చి 16న ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది. మరునాటి సంచికలోనే ఈ పరిణామాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. అయినా.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. ఆ తర్వాత నాలుగు నెలల పాటు ఈ అంశంపై  ఎలాంటి  కదలిక లేదు. సరిగ్గా ఐదు నెలల తర్వాత ఇప్పుడు మరోసారి ఈ అంశం లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. లోగడ ఇదే అంశంపై తాము లేవనెత్తిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై కేంద్ర అణుశక్తిశాఖ సంతృప్తికరంగా లేదని సభ్యుల ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానంతో తేలిపోయింది. అంతా బాగుందన్న రాష్ట్ర వాదనతో ఏకీభవించలేదని స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలోనే ఐబీఎమ్‌తో విచారణకు కోరినట్లు స్పష్టమవుతోంది. ఈ చర్య రాష్ట్ర సర్కారుకు సంకటాన్ని తెచ్చిపెట్టేలా ఉందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. 


బీచ్‌శాండ్‌కు అంతర్జాతీయ డిమాండ్‌

ఇసుకలో లభించే మోనజైట్‌ నుంచి థోరియంను వేరు చేసి అణు విద్యుత్‌ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. థోరియం అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. దేశ రక్షణలో అత్యంత విలువైన థోరియంను భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగించుకోవాలని, ప్రైవేట్‌ రంగానికి అనుమతిని ఇవ్వకూడదని గతంలోనే కేంద్రం అణు విధానం పేర్కొంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు, తమిళనాడు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు అంతర్జాతీయంగా ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలోపెట్టుకొని ఏపీ సర్కారు రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని ప్రాస్పెక్టివ్‌ లీజుదారుగా ప్రతిపాదించి 17 చోట్ల మైనింగ్‌ అనుమతులు కోరింది. కాగా, బీచ్‌శాండ్‌లో ఆరు రకాల మినరల్స్‌ ఉంటాయి. 1. ఇలిమినైట్‌ 2. రుటైల్‌ 3. జిర్కాన్‌ 4. గార్నెట్‌ 5. మోనజైట్‌ 6. సిలిమినైట్‌. వీటిని సాంకేతికంగా హై మినరల్స్‌గా పరిగణిస్తారు. ఇందులో మోనజైట్‌ బ్రెజిల్‌, మడగాస్కర్‌, భారతదేశంలో దొరికే బీచ్‌శాండ్‌లో అత్యధికంగా ఉంది. మన రాష్ట్రంలో కోస్తా తీరం అంతా సమృద్ధిగా ఉంది. 


అక్రమ ఎగుమతిపై ఫిర్యాదులు

గత ఏడాది కేంద్రం అనుమతించిన భీమిలీ, మచిలీపట్టణం బీచ్‌శాండ్‌ మైనింగ్‌లో మోనజైట్‌ను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న ఫిర్యాదులు కేంద్ర గనుల శాఖకు వెళ్లాయి. చట్టాలను ఉల్లంఘించి మైనింగ్‌ చేపట్టారని, దీని వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతోందని  అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఇది అసలే అణుధార్మిక శక్తిని ప్రేరేపించే మినరల్స్‌తో కూడిన వ్యవహారం కావడంతో ఈ ఫిర్యాదులపై కేంద్ర గనుల శాఖ  ఉలిక్కిపడింది. అనుమతులు తీసుకున్న ఆ రెండు చోట్ల ఏం జరుగుతోందంటూ కేంద్ర గనుల శాఖ ఆరాతీసింది. ఫిర్యాదుల్లోని అంశాలపై కొంత స్పష్టత రావడంతో, మిగిలిన లీజులపై ఏ నిర్ణయమూ తీసుకోవద్దని, వాటిని నిలిపివేయాలని కేంద్ర ఆటమిక్‌ ఎనర్జీ విభాగాన్ని కోరింది. అదే సమయంలో బీచ్‌శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. గత ఏడాది జూన్‌లోనే ఈ విషయాలపై విచారణ చేపట్టాలని రాష్ట్రానికి లేఖ రాసింది. మోనజైట్‌ అక్రమ ఎగుమతి, పర్యావరణ విధ్వంసం, గనుల చట్టాల ఉల్లంఘనలపై ఆ విచారణ చేపట్టాలని స్పష్టంగా దిశానిర్దేశం చేసింది. మరోవైపు ఈ విషయం తేలేవరకు మిగిలిన 15 మైనింగ్‌ అనుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. 

Updated Date - 2022-08-04T07:36:26+05:30 IST