అదనపు వీసీపై.. గరం గరం

ABN , First Publish Date - 2022-09-23T05:42:12+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అదనపు వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ వ్యతిరేకవర్గంతో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య భేటీ కావడం చర్చనీయాంశమైంది.

అదనపు వీసీపై.. గరం గరం

వ్యతిరేక వర్గంతో పొన్నూరు ఎమ్మెల్యే భేటీ

ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉద్యోగుల ఫిర్యాదు

అవినీతి, అక్రమాల చిట్టాపై ఎమ్మెల్యే దృష్టికి

ఆ పదవి నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతి 

పెదకాకాని, సెప్టెంబరు 22: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అదనపు వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ వ్యతిరేకవర్గంతో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య భేటీ కావడం చర్చనీయాంశమైంది. గురువారం సాయంత్రం వర్సిటీలోని వికాస భవనంలో ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి వీసీకి వ్యతిరేకంగా ఉన్న పలువురు అధ్యాపకులు, అధ్యాపకేతర ఉద్యోగులు, పరిశోధకులు హాజరయ్యారు. గడిచిన మూడేళ్లుగా పి.రాజశేఖర్‌ హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా పలు ఉద్యోగ నియామకాలు చేపట్టారని, వర్సిటీ నిధులు పెద్దఎత్తున దుర్వినియోగ పరిచారని ఆరోపించారు. దూర విద్యకేంద్రం, పరీక్ష కేంద్రాలు, వర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలల నుంచి భారీఎత్తున నగదు వసూలు చేశారని,  ఇందుకోసం తన కింద  పనిచేస్తున్న పలువురు అధికారులను ఉపయోగించుకున్నారని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ అవినీతి, అక్రమాలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వెంటనే అదనపు వీసీ పదవి నుంచి రాజశేఖర్‌ని తొలగించి రెగ్యులర్‌గా కొత్త వీసీని నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేని కోరారు. గడిచిన మూడేళ్లుగా వర్సిటీలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు ఎమ్యెల్యే రోశయ్యని ఆహ్వానించకుండా ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు. దీంతో ఎమ్మెల్యే రోశయ్య నేరుగా శాసనసభ స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం వివరణ ఇవ్వాలని వీసీని పలుమార్లు ఆదేశించారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఆచార్య రత్నషీలామణి కూడా వీసీ రాజశేఖర్‌ పాలనపై హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయనకు పూర్తిస్థాయి వీసీ పదవి వస్తుందని, ఆయన వర్గం ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే రోశయ్య స్పందించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణని కలిసి వీసీ రాజశేఖర్‌ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో ఆ నియామకాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోశయ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వీసీకి వ్యతిరేకవర్గంతో భేటీ కావటంతో వర్సిటీ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశంగా మారింది.

18మంది తొలగింపునకు నోటీసులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 60 సంవత్సరాలు నిండిన ఉద్యోగులను తొలగించేందుకు వర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ నోటీసులు జారీచేశారు. మీ అందరికీ 60 సంవత్సరాలు నిండాయని వర్సిటీ ఇప్పటికే 9నెలలు అదనంగా కొనసాగించామని ఇక మీదట మిమ్మల్ని వర్సిటీ ఉద్యోగులుగా కొనసాగనివ్వమని తెలుపుతూ వారికి నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వర్సిటీ ఉద్యోగుల వయస్సు 62 సంవత్సరాలకు పెంచగా ఇంతవరకు విశ్వవిద్యాలయానికి ఆ జీవో కాపీ అందలేదని దీంతో మిమ్మల్ని తొలగించక తప్పదని  ఆ నోటీసులో పేర్కొన్నారు. వీసీ నోటీసులు జారీ చేయటంతో ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నోటీసులు అందుకున్న ఉద్యోగులు వీసీ రాజశేఖర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే రోశయ్యతో కూడా ఈ అంశంపై చర్చించారు. 


Updated Date - 2022-09-23T05:42:12+05:30 IST