ఘనంగా లక్ష్మీనరసింహస్వామి గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-02-27T06:42:29+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అంతర్వేదిపాలెం వాస్తవ్యులు అల్లూరిరామరాజు, వెంకటసత్యనారాయణరాజులతో నిర్మితమైన రాజాధిరాజా వాహనంపై స్వామివారు గ్రామ పురవీధుల్లో ఊరేగారు.

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి గ్రామోత్సవం
రాజాధిరాజా వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

అంతర్వేది, ఫిబ్రవరి 26: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అంతర్వేదిపాలెం వాస్తవ్యులు అల్లూరిరామరాజు, వెంకటసత్యనారాయణరాజులతో నిర్మితమైన రాజాధిరాజా వాహనంపై స్వామివారు గ్రామ పురవీధుల్లో ఊరేగారు. గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు ధూపసేవ, ఏడు గంటలకు కేశవదాసుపాలెం వాస్తవ్యులు బెల్లంకొండ, ఉండపల్లి వారి కుటుంబీకులతో నిర్మితమైన అశ్వవాహనంపై స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ, దాసరి వాసు, బెల్లంకొండ సూరిబాబు, ఉండపల్లి పండు, మూలాస్వామి పాల్గొన్నారు. 

ఆలయంలో చోర సంవాదం

కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7.30గంటలకు కేశవదాసుపాలెం వాస్తవ్యులు ఉండపల్లి, బెల్లంకొండ కుటుంబీకులతో నిర్మితమైన అశ్వవాహనంపై స్వామివారిని 16మండపాల స్తంభం వద్దకు తీసుకువచ్చారు. ఆలయ అర్చకుల సమక్షంలో చోర సంవాదం వేడుకలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, స్థానాచార్యులు వింజమూరి రంగాచార్యులు, వేదపండితులు చింతా వెంకట శాస్త్రి, అర్చక స్వాముల సారధ్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ఉండపల్లి, బెల్లంకొండ కుటుంబసభ్యులు, ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ, భక్తులు పాల్గొన్నారు.

నేడు స్వామివారికి చక్రస్నానం

అంతర్వేది కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం మాఘ పౌర్ణమి రోజున ఉదయం శ్రీస్వామివారికి చక్రస్నానం జరగనుంది. ఈ సందర్భంగా రుద్రరాజు బంగారమ్మ బహూకరించిన గరుడ పుష్పక వాహనంపై స్వామివారి ఆలయంవద్ద నుంచి సముద్రం వద్దకు బయలుదేరి అనంతరం చక్రవారి అవభ్రుదోత్సవం సముద్ర స్నానం, వసంతమండ పంవద్ద ప్రత్యేక పూజలు, ధ్వజారోహణ జరుగుతుంది. ప్రత్యేక బృందాలతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఆలయం వద్ద క్యూలైన్లు, సముద్ర స్నానాలవద్ద గజఈతగాళ్లను ఏర్పాటు చేసినట్టు ఎఫ్‌డీవో సంజీవరావు తెలిపారు. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.

నేడు గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం

శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మాఘ పౌర్ణమి సందర్భంగా శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుప్రభాతసేవ మొదలుకొని శ్రీస్వామివారి తిరువారాధాన, బాలభోగం, వార్షిక అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు అంతర్వేదిపాలెం వాస్తవ్యులు రుద్రరాజు బంగారమ్మ వారితో నిర్మితమైన గరుడ పుష్పక వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది.

Updated Date - 2021-02-27T06:42:29+05:30 IST