70% అహ్మదాబాద్‌ వాసుల్లో యాంటీబాడీలు

ABN , First Publish Date - 2021-06-13T09:06:13+05:30 IST

రోజుకు ఐదు వేలపైగా కేసులు.. రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు.. వాటి ఎదుట పదుల సంఖ్యలో అంబులెన్స్‌ల బారులు.. ఇదీ ఏప్రిల్‌- మే నెలల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో పరిస్థితి. కరోనా

70% అహ్మదాబాద్‌ వాసుల్లో యాంటీబాడీలు

దేశంలో మరో 84 వేల మందికి కరోనా


అహ్మదాబాద్‌, న్యూఢిల్లీ, జూన్‌ 12: రోజుకు ఐదు వేలపైగా కేసులు.. రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు.. వాటి ఎదుట పదుల సంఖ్యలో అంబులెన్స్‌ల బారులు.. ఇదీ ఏప్రిల్‌- మే నెలల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో పరిస్థితి. కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన ఈ విలయంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, నాడు కరోనా విజృంభణ తీవ్రతను తాజా సీరో సర్వే స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మే నెలాఖరు-జూన్‌ తొలి వారం మధ్య నిర్వహించిన ఐదో సీరో సర్వేలో 70% మంది నగరవాసుల్లో యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. కాగా, అధిక వేగంతో వ్యాపించే డెల్టా వేరియంట్‌ (బి.617.2) కారణంగా దేశంలో ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాల్లో అహ్మదాబాద్‌ ముందుంది.  


70 రోజుల అత్యల్ప సంఖ్యలో కేసులు

దేశంలో శుక్రవారం 84,332 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గత 70 రోజుల్లో ఇవే అత్యల్పం. వైర్‌సతో మరో 4,002 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ తెలిపింది. కాగా, మహారాష్ట్రలో మరణాల లెక్కలను మరోసారి సవరించారు. కొత్తగా 406 మంది చనిపోగా.. గతంలో లెక్కలకు రాని 2,200 మరణాలను కూడా జోడించారు. తమిళనాడు, కేరళలో మృతుల సంఖ్య ఇంకా అధికంగానే ఉంటోంది. అయితే, రెండు నెలల తర్వాత కర్ణాటకలో పాజిటివ్‌ రేటు 5 దిగువకు వచ్చింది.  


రష్యాలో మళ్లీ విజృంభణ

రష్యాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో కేసులు దాదాపు 50 శాతం పెరిగాయి. ఈ నెల 6వ తేదీన 9,163 కేసులు నమోదవగా.. శుక్రవారం 13,500 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గతంలోలాగే రాజధాని మాస్కోలో ప్రజలు అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. క్రితం వారంతో పోలిస్తే.. ఇక్కడ రెట్టింపు సంఖ్యలో పాజిటివ్‌లు వస్తున్నాయి. రష్యాలో ఇప్పటివరకు 52 లక్షల మందిపైగా వైర్‌సకు గురయ్యారు. 1.26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-06-13T09:06:13+05:30 IST