యాంటీబాడీస్

ABN , First Publish Date - 2021-05-14T06:18:20+05:30 IST

ఒక్కసారి ఆత్మీయంగా పలకరిస్తే ఏకాంత కుహరాలు వెలుగు సీమలుగా విచ్చుకుంటాయి....

యాంటీబాడీస్

ఒక్కసారి

ఆత్మీయంగా పలకరిస్తే

ఏకాంత కుహరాలు

వెలుగు సీమలుగా విచ్చుకుంటాయి.

‘హల్లో’ అనే ఒక్క మాటతో

ఉల్లాస వీచికలు జాగృతమౌతాయి.


టీకాలు మాత్రమే కాదు

ఒక్క స్నేహితుని పరామర్శ చాలు

మందు బిళ్లలు ఎలాగూ తప్పదు

రోగ విజేతలీ స్వాస్థ్య వచనాలు.


ముఖం నిండా ప్రేమను నింపుకొని

‘ఫికర్ చెయ్యకు బిడ్డా’ అని చూడు

ఎక్కడెక్కడి యాంటీబాడీలో

లోపల లైనుకట్టి

యుద్ధానికి సన్నద్దమౌతాయి.


తల తిరుగుడు వైరస్‌కు

విరుగుడు కొంత అవసరం.

ఓపిక వుంటే కాస్సేపు ఘంటసాలను విందాం.

పుట్టినప్పటి నుంచి

మన ఊపిరిలో ఊపిరి

మన రుధిరంలో కలిసిన సంగీత ఝరి.

ఆయన గొంతును మరోసారి

మన మనసు పొలాల్లో చల్లుకుందాం.


కాస్సేపు

స్వరరాణి లతా మంగేష్కర్

రాగలతికలను

హృదయానికి చుట్టుకుందాం.

తాజమహల్‌ను కరిగిస్తే

రఫీ గొంతులో పాటవుతుంది

కనులు మూసుకొని

ఓసారి ఆస్వాదిద్దాం.


బంగారూ!

కంగారు వద్దు.

రక్తం నిండా

ప్రణయశక్తిని కలుపుకుందాం.

ఆనందమే అసలైన ఆక్సిజన్.


ధైర్యం వొట్టి ఆహార్యం కాదు

మూలమూలల

దుమ్ము దులిపే బహుళకార్యం.

తలుచుకుంటే

యాంటీబాడీస్

చల్తీ కా నామ్ గాడీస్ అవుతాయి.

పైగా ఇవి ఉచితం

జీవన తరళహారానికి

భావోజ్వల రత్నఖచితం.

డా. ఎన్. గోపి

Updated Date - 2021-05-14T06:18:20+05:30 IST