రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST

కేంద్రం తెచ్చిన మూడు రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రైతుల పోరాట సమస్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావ్‌ డిమాండ్‌ చేశారు

రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

సమష్టి పోరాటానికి రైతులు సిద్ధం కావాలి

ఏఐకెఎన్‌సీసీ కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావ్‌

 

నెల్లూరు (వైద్యం) అక్టోబరు 19 :  కేంద్రం తెచ్చిన మూడు రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను  వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రైతుల పోరాట సమస్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ హాల్‌లో  రైతుల సమస్యలపై సమావేశం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పించక పోగా కార్పొరేట్లకు లబ్ది చేకూరేలా వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకు వచ్చిందన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌తో పాటు దేశంలోని పలు పార్టీలు వ్యతిరేకించి సెలక్ట్‌ కమిటీకి పంపి ఓటింగ్‌ జరపాలని కోరినా రాజ్యసభ ఉపాధ్యక్షుడు మూజువాని ఓటుతో బిల్లులు ఆమోదించటం దుర్మార్గ మన్నారు. పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించాలని నిర్ణయించటం సరికాదన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకారం తెలిపి జీవో నెంబర్‌ 22ను తీసుకు వచ్చిందన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయక పోగా విద్యుత్‌ ఉత్పత్తుల సంస్థలపై అపారమైన ప్రేమను చూపటం అన్యాయమన్నారు. రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా అవి అమలు కావటం లేదని విమర్శించారు. రైతులు పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ చెబుతున్నా కొత్త చట్టం వల్ల అదిసాధ్యం కాదని తెలిపారు. ఈ పరిస్థితిలో రైతులు సమైక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఉపాధ్యక్షుడు రావుల అంకయ్య, ఏఐకెఎస్‌సీసీ కార్యదర్శి హరనాథ్‌, ఏపీ కౌలురైతు సంఘం అధ్యక్షుడు జమలయ్య మాట్లాడుతూ రైతుల కష్టాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేలా తీసుకు వచ్చిన వ్యవసాయ, నిత్యావసర, విద్యుత్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో రైతు సమాఖ్య నాయకులు కోటిరెడ్డి, సీపీఐ నేత రామరాజు, అధిక సంఖ్యలో రైతు సంఘ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST