Abn logo
Nov 26 2021 @ 02:39AM

అనంత పోలీసుల అతి

వైసీపీ నేతలను విమర్శించారని తెలుగు మహిళలపై కక్ష సాధింపు

ఉదయాన్నే ఇళ్లపై ఆకస్మిక దాడులు

ఫోన్లు లాగేసుకుని ప్రతి వస్తువూ తనిఖీ

బ్యాంకు పాస్‌బుక్‌లు స్వాధీనం

వైసీపీకి వ్యతిరేకంగా మీడియాతో ఎందుకు మాట్లాడారు?

ఎవరైనా డబ్బులిచ్చి మాట్లాడించారా?

ఎంత డబ్బిచ్చారంటూ సీఐల ప్రశ్నలు

నాలుగు గంటల పాటు వేధింపులు

ఆవేదనతో ఒకరి ఆత్మహత్యాయత్నంవిపక్షానికి చెందిన వారిపై అధికారపక్షం నుంచి ఫిర్యాదు అందితే చాలు! రంగంలోకి దిగడమే! ఆడవాళ్లపైనా ప్రతాపం చూపడమే! అనంతపురం జిల్లా పోలీసులు ఇదే చేశారు. అధికార పార్టీ నేతల బూతులపై స్పందించిన టీడీపీ మహిళా నేతలపై కేసులు పెట్టారు. బుధవారం పోలీసు స్టేషన్‌కు రప్పించారు. శుక్రవారం మళ్లీ రావాలన్నారు. గురువారం తెల్లవారుజామునే మూకుమ్మడిగా వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ‘డబ్బులు తీసుకుని మాట్లాడారా’ అంటూ వింత ప్రశ్నలు సంధించారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మహిళా నేత ప్రియాంక పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.


అనంతపురం వైద్యం, నవంబరు 25: అనంతపురం జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. అధికార పక్షాన్ని విమర్శించారని తెలుగుదేశం మహిళా నాయకుల ఇళ్లపై దాడులకు దిగి.. ఆకస్మిక సోదాలు జరిపారు. వారం రోజుల క్రితం అసెంబ్లీలో మాజీ సీఎం చంద్రబాబు కుటుంబంపై కొందరు వైసీపీ ఎమ్మెల్యేల అసభ్య వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అనంతపురం టీడీపీ నాయకురాళ్లు కూడా మీడియా సమావేశం ఏర్పాటుచేసి వైసీపీ సభ్యులను తప్పుపట్టారు. ఆ మీడియా భేటీలో మాట్లాడిన తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి స్వప్న, అనంతపురం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, అనంతపురం నగర అధ్యక్షురాలు విజయశ్రీ, నగర ప్రధాన కార్యదర్శి జానకి, తేజస్వినిలపై వైసీపీ మహిళా విభాగం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఆ ఐదుగురు బుధవారం అనంతపురం నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో హాజరయ్యారు. పోలీసులు వివిధ సాకులు చూపి వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచారు. శుక్రవారం (26వ తేదీన) మళ్లీ రావాలని ఆదేశించి పంపేశారు. అయితే గురువారం తెల్లవారుజామునే జిల్లా కేంద్రంలోని తమ నివాసంలో ఉన్న  స్వప్న, విజయశ్రీ, తేజస్విని, జానకి ఇళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. సోదాలు చేపట్టారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో ప్రతి మహిళా నేత ఇంటికి ఇద్దరు సీఐలు, ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీసులు వెళ్లారు. సోదాలు చేస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మహిళా నేతలతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే అందరి వద్ద ఉన్న సెల్‌ఫోన్లనూ పోలీసులు తీసుకున్నారు. విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడాలని చూశారు. ఆ సమయంలో స్వప్న, ఆమె భర్త బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. తమ ఇంట్లో ఎందుకు సోదాలు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ  విషయం తెలిసి అనంతపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు పెద్దఎత్తున వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. లోపలకు రానివ్వకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. వారి తీరును నిరసిస్తూ ఆ ఇళ్ల ముందే బైఠాయించారు. పోలీసులు, వైసీపీ నేతలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అయినా పోలీసులు దాదాపు 4 గంటలపాటు వారి ఇళ్లలోనే ఉండి.. వారిని పలు ప్రశ్నలతో వేధిస్తూ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువునూ తనిఖీ చేశారు. ప్రధానంగా డబ్బు, బంగారం, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు మొదలైనవాటిని పరిశీలించి పంచనామా చేశారు. స్వప్న ఇంట్లో రూ.4 లక్షల వరకు నగదు లభించగా.. మిగతా మహిళా నేతల ఇళ్లలో ఖర్చులకు ఉంచుకున్న కొంత డబ్బు ఉంది. ‘మీరు మీడియా సమావేశంలో ఎందుకు మాట్లాడారు? ఎవరైనా డబ్బులిచ్చి మాట్లాడించారా? ఎంత డబ్బు ఇచ్చారు’ అంటూ వారిని సీఐలు ప్రశ్నించారు. తనిఖీల అనంతరం బ్యాంకు పాస్‌బుక్‌లను తీసుకెళ్లారు. తేజస్విని కుటుంబం నడుపుతున్న తేజా డ్రైవింగ్‌ స్కూల్‌ వాహనాలను కూడా సీజ్‌ చేశారు. పోలీసుల వేధింపులు భరించలేక ప్రియాంక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు అరాచకాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే మహిళలని కూడా చూడకుండా కక్ష సాధింపులకు దిగుతారా అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేమేమైనా ఉగ్రవాదులమా? దొంగలమా? ఎవరినైనా హత్య చేశామా? బూతులు తిట్టిన వారిని ప్రశ్నిస్తే అమాయక మహిళలపై మీ ప్రతాపాన్ని చూపుతారా? వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తి ఇలా వ్యవహరించడం ఏమిటి’ అని పోలీసులను నిలదీశారు. మరోవైపు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వి.ప్రభాకరచౌదరి పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తామని కాల్వ హెచ్చరించారు.