Terrorism : అన్సరుల్లా బంగ్లా టీమ్.... ఇది క్రికెట్ జట్టు కాదు, భయానక ఉగ్రవాద సంస్థ...

ABN , First Publish Date - 2022-08-25T16:13:34+05:30 IST

ఉగ్రవాదులు అనేక రూపాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. కొంత కాలం

Terrorism : అన్సరుల్లా బంగ్లా టీమ్.... ఇది క్రికెట్ జట్టు కాదు, భయానక ఉగ్రవాద సంస్థ...

న్యూఢిల్లీ : ఉగ్రవాదులు అనేక రూపాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. కొంత కాలం వరకు వీరు ప్రభుత్వ వ్యవస్థలను ధ్వంసం చేసేవారు. రాన్రానూ వీరు సామాన్యులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు. దైవదూషణ చేశారని ఆరోపించి, సామాన్యులను నడి వీథుల్లో అత్యంత కిరాతకంగా  హతమార్చుతున్నారు. అలాంటి ఓ ఉగ్రవాద సంస్థ పేరే అన్సరుల్లా బంగ్లా టీమ్ (Ansarullah Bangla Team-ABT). ఇది జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల కన్నా పెద్దది. ఈ ఉగ్రవాద సంస్థ ప్రభావం భారత దేశంపై కూడా ఉంది. 


జీహాద్ కోసం...

బంగ్లాదేశ్‌లో విస్తృతంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న అన్సరుల్లా బంగ్లా టీమ్‌కు భారత ఉపఖండంలోని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ (Al Qaeda in the Indian Subcontinent -AQIS)తో సంబంధాలు ఉన్నాయి. రాడికలైజ్డ్ ఇస్లామిక్ జీహాద్ బోధనలే దీనికి పునాది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా స్థానిక స్థాయిలో ఉగ్రవాద కేంద్రాలను నిర్వహిస్తూ దూసుకుపోతోంది. 


ఇస్లాంను వ్యతిరేకిస్తే చావే గతి

లౌకికవాదులు, స్వేచ్ఛావాదులకు ఈ ఉగ్రవాద సంస్థ ఇచ్చే సందేశం ఒకటే. ‘‘అతివాదంగా కనిపిస్తున్న మతపరమైన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దు. మేం చెప్పే మతపరమైన ఆచారాలను విమర్శించొద్దు. వీటికి విరుద్ధంగా ఏమైనా చేశారో చావుకు సిద్ధంకండి’’ - ఇదే ఆ సందేశం. 


మతపరంగా విభజన తేవడమే లక్ష్యం

బంగ్లాదేశ్‌లోని మైనారిటీలైన హిందువులు, ఇతర మతస్థులు, సెక్యులర్ లిబరల్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. మతపరమైన విభజనను సృష్టించి దాడులకు పాల్పడుతోంది. ఇది సామాన్యులనే లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రభుత్వ యంత్రాంగం జోలికి వెళ్ళదు. 


నరికి చంపడంలో శిక్షణ

ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నారంటూ, ఇస్లాంకు శత్రువులంటూ,  దైవ దూషణకు పాల్పడ్డారంటూ వీథుల్లోనే సామాన్యులను కత్తులతో నరికి చంపుతోంది. ఇలా కిరాతకంగా చంపడం కోసం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. 


2007లో ప్రారంభం

ఢాకా మసీదులోని రాడికల్ మత బోధకుడు ముఫ్తీ జషీముద్దీన్ రహమానీ 2007లో జమాతుల్ ముస్లిమీన్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అల్ ఖైదా ఉగ్రవాది అన్వర్ అల్ అవ్లాకీ స్ఫూర్తితో ఈ సంస్థను స్థాపించాడు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ కాలిఫేట్‌ను ఏర్పాటు చేయడమే ఇతని లక్ష్యం. ప్రస్తుతం బంగ్లాదేశ్ సెక్యులర్ పార్లమెంటరీ రిపబ్లిక్‌గా ఉంది. ఈ ఉగ్రవాద సంస్థ మొదట్లో అంత పెద్దది కాదు. కానీ 2008లో దీని ఎదుగుదల ప్రారంభమైంది. చివరికి 2013లో అన్సరుల్లా బంగ్లా టీమ్‌గా మారింది.  ఏబీటీలో మొదట్లో సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు చేరేవారు. ప్రస్తుతం ఇతర వర్గాల విద్యార్థులు కూడా దీనిలో చేరుతున్నారు. 


భారత్‌కూ హాని

జీహాద్‌ను వ్యాపింపజేయడమే ఎజెండాగాగల ఏబీటీ కేవలం బంగ్లాదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సింగపూర్‌లో 2015లో 14 మంది ఏబీటీ ఉగ్రవాదులు అరెస్టయ్యారు. భారత దేశంలోని అస్సాంలో 2017లో ఐదుగురు ఏబీటీ ఉగ్రవాదులు అరెస్టయ్యారు. అస్సాంలో ఈ ఏడాది జూలైలో రెండు ఏబీటీ-ఏక్యూఐఎస్ మాడ్యూల్స్ గుట్టు రట్టయింది. గత వారం ఇద్దరు ఇమామ్‌లు అరెస్టయ్యారు. వీరికి ఏబీటీ-ఏక్యూఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయి. 


Updated Date - 2022-08-25T16:13:34+05:30 IST