Anrich Nortje: మేం ఆరు టెస్టులు ఆడితే ఇండియా 15 ఆడుతుందా?.. ఇదేం బాలేదు: అన్రిక్ నార్జ్

ABN , First Publish Date - 2022-08-15T23:41:35+05:30 IST

టెస్టు క్రికెట్ ఆడే విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ప్రొటీస్ స్పీడ్‌స్టర్ అన్రిక్ నార్జ్(Anrich Nortje) ఆరోపించాడు

Anrich Nortje: మేం ఆరు టెస్టులు ఆడితే ఇండియా 15 ఆడుతుందా?.. ఇదేం బాలేదు: అన్రిక్ నార్జ్

కేప్‌టౌన్: టెస్టు క్రికెట్ ఆడే విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ప్రొటీస్ స్పీడ్‌స్టర్ అన్రిక్ నార్జ్(Anrich Nortje) ఆరోపించాడు. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు విపరీతంగా క్రికెట్ ఆడుతుంటే తాము మాత్రం సింగిల్ డిజిట్ మ్యాచ్‌లకే పరిమితమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. సఫారీ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌(England)లో పర్యటిస్తోంది.


మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 17న ప్రారంభం కానుంది. టెస్టు మ్యాచ్‌ల విషయంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో పోలిస్తే దక్షిణాఫ్రికా (South Africa) చాలా వెనకబడి ఉంది. 2019-2022 మధ్య దక్షిణాఫ్రికా 19 టెస్టులు మాత్రమే ఆడగా, ఇంగ్లండ్ 36 ఆడింది. ఇండియా 26, ఆస్ట్రేలియా 20 టెస్టులు ఆడింది. 


ఈ వ్యత్యాసంపై అన్రిక్ నార్జ్ తీవ్రంగా స్పందించాడు. ఇదేమీ బాగాలేదన్నాడు. తమ పూర్వపు జట్టులానే తాము కూడా నంబర్ వన్ టెస్టు జట్టుగా ఎదుగాలన్న తమ తపనను ఇది అడ్డుకుంటోందన్నాడు. ‘‘ఏడాదికి మేం 6 మ్యాచ్‌లు ఆడితే వారు 15 ఆడుతున్నారు. ఇదేమీ బాగాలేదు. మూడేళ్లలో మేం 18 గేమ్స్ ఆడితే మేం ఎవరికీ గుర్తుండం. అన్ని ఫార్మాట్లలోనూ మేం నంబర్ 1 జట్టుగా ఎదగాలనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యం కావడం లేదు. రెండు మ్యాచ్‌ల సిరీస్ కాదు.. మరింతగా టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నాం’’ అని నార్జ్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు.


 ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్న నార్జ్.. ఈ సమయంలో అత్యుత్తమ జట్టుతో నేరగా తలపడాలని ఉందన్నాడు. టెస్టు క్రికెట్ ఇంకా అల్టిమేటర్ ఫార్మాటే కాకుండా కఠినమైనదని అన్నాడు. నార్జ్ చివరిసారి జూన్ 2021లో టెస్టు క్రికెట్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్‌‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్ (World Test Championships) పట్టికలో దక్షిణఫ్రికా టాప్ ప్లేస్‌లో ఉంది. ఐదు టెస్టులు గెలిచిన ఆ జట్టు ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి. రెండింటిలో ఓటమి పాలైంది.

Updated Date - 2022-08-15T23:41:35+05:30 IST