Abn logo
Aug 1 2021 @ 00:33AM

పరభాషాదాస్యం ఇంకెన్నాళ్లు?

కొన్నిరోజులుగా తెలుగు, సంస్కృత భాషలపై విపరీతమైన చర్చ జరుగుతోంది. సంస్కృత భాషను అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ద్వితీయ భాషగా, ఐచ్ఛిక విషయంగా ప్రవేశపెట్టడానికి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన పత్రం ఈ చర్చలకు, వివాదానికి దారి తీసింది. 


ప్రజల రాజకీయార్థిక, సాంస్కృతిక చరిత్ర భాషతో ముడిపడి ఉంటుంది. విభిన్న జాతుల, భాషల, సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశంలో పరభాషల ఆధిపత్యం కొత్తేమీ కాదు. ఆధిపత్యం అంటే పాలకుల రాజకీయ, మత, సాంస్కృతిక అవసరాలే. భాష, భావాల రూపంలో అవి వ్యక్తమవుతాయి. ఆ విధంగా చూసినప్పుడు మన మొదటి పరభాష, ఆధిపత్య భాష సంస్కృతం. ప్రపంచప్రజల మధ్య అనుసంధాన భాష అనే ఇంగ్లీష్‌ను అధ్యయన మాధ్యమంగా తీసుకువచ్చారు. మరో పక్క అధికార భాష పేరుతో ఉత్తరాది భాషైన హిందీని రుద్దుతున్నారు. ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం భాషలు చేసే ముప్పేట దాడిని ఎదుర్కొని నిలబడాల్సిన దుస్థితి తెలుగు భాషకు దాపురించింది. అసలు తెలుగువారిలో కూడా పరభాషాదాస్యం క్రమంగా పెరిగిపోతున్నది.


స్వతంత్ర భారతదేశంలో యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కమిషన్ (1946-49), సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ (1952-53), నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ (1964–66), నూతన విద్యావిధానం (1986) బోధన భాషగా తల్లిభాషకు ఉన్న ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పాయి. శ్యాం పిట్రోడా నేతృత్వంలోని విజ్ఞాన కమిషన్ (1992) మాత్రం ఒకటో తరగతి నుంచే ఆంగ్లబోధన జరగాలని సిఫారస్సు చేసింది. దీనిపై భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి భాషాశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కొన్ని హేతుబద్ధమైన సిఫారసులు చేశారు. ‘నూతన విద్యావిధానం–2020’లో ‘సంస్కృతిని కాపాడుకోవాలంటే సంస్కృతి తాలూకు భాషలను కూడా కాపాడుకోవాలనే’ మాట ఉంది. ఈ మాటను కేవలం సంస్కృత భాషకు మాత్రమే అన్వయిస్తున్నారు! 


ఇప్పుడు ఇంటర్మీడియట్‌లో ద్వితీయభాషగా సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. నిజానికి తెలుగు వారి భాషాసాహిత్యాలకు సంస్కృతం మిత్రుని రూపంలో ఉన్న ఆధిపత్య రూపం. సంస్కృత సాహిత్యంలో ఈ దేశ మెజారిటీ ప్రజల, మూల వాసుల జీవన స్థితిగతులు, ఆచార సంప్రదాయాలు, దేవుళ్లు లేరు. వారి కులపురాణాలు, కనీసం వారి సాహిత్యం తాలూకు ప్రస్తావనలు కూడా లేవు. మెజారిటీ తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక జవజీవాలు సంస్కృతంలో లేవు. భారతదేశంలో 9 కోట్ల మంది ప్రజలు తెలుగును తల్లిభాషగా ప్రకటించుకుంటే, సంస్కృతాన్ని 24,821 మంది మాత్రమే తల్లిభాషగా ప్రకటించారు. భారతీయత పేరుతో జనసామాన్యానికి ఏనాడో దూరమైపోయిన, జనవ్యవహారంలో లేని భాషను ప్రజల్లోకి విద్యా, విధానపరమైన నిర్మాణాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలను తెలుగు భాషాభిమానులు, దళిత, బహుజనులు తిరస్కరించాల్సిన అవసరం ఉంది. 


స్పష్టమైన భాషావిధానం, తెలంగాణ సాంస్కృతిక, సాహిత్యాల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు నటించే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలుగు ప్రజానీకానికి జవాబు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. నిజానికి, తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి నన్నయ చేసిన మహాభారత ఆంధ్రీకరణ దోహదం చేయలేదు. తెలంగాణ మట్టి భాష కుర్క్యాల కందపద్యాలు, కోటిలింగాల, దూలికట్ట నాణేలు తెలుగు భాషను ప్రాచీన భాషగా నిలబెట్టాయి. ఈ కృషిలో తెలంగాణ ప్రభుత్వానిది పెద్దన్న చేయి. అయితే ఇప్పుడు, నాటి ఉద్యమస్పూర్తి సన్నగిల్లినట్లుంది. పొరుగు రాష్ట్రం తమిళనాడు తల్లిభాషపై ప్రేమతో విద్యా, ఉపాధి, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో మార్పులు సాధిస్తుంటే, మనం మాత్రం పాలకులు చెప్పే అసంబద్ధ మాటలకు తలలూపుతున్నాం. సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఏకంగా తెలుగు అకాడమీని, తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మార్చింది! తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2017లో ప్రపంచ తెలుగు మహాసభలను అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రారంభసమావేశంలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు తప్పనిసరి చేస్తామని, తన గురువు మృత్యుంజయ శర్మ కాళ్లు మొక్కి మరీ మాట ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు, సాహిత్యానికి, తెలుగుభాషా, సాహిత్యాలను అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు గత ఏడున్నరేళ్లుగా చేసింది శూన్యం. 


ఇంటర్మీడియట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటున్న సంస్కృత భాష మార్కుల భాష. ఇంటర్‌లో నేరుగా సంస్కృతం రెండవ భాషగా చదివి, 90శాతం పైగా మార్కులు ఎలా సాధిస్తున్నారు? ఆరు నుంచి ఎనిమిది నెలలలోపే, దేవ నాగరి లిపిలో కాకుండా తెలుగు లిపిలో రాసి అన్ని మార్కులు పొందడం ఎలా సాధ్యమో, ఇందులోని శాస్త్రీయతను ఏ సంస్కృత పండితుడు చెప్పగలడో చూడాలి. ఇక్కడే సంస్కృత భాష విశ్వసనీయతను, గౌరవాన్ని కోల్పోయింది. 


ఒక పక్క తల్లిభాషల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అది నశించిపోయే అవకాశం ఉందని యునెస్కో వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. భారతీయ భాషాభివృద్ధి, పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాకు సారథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ గణేష్ డేవి గత ఐదు దశాబ్దాల్లో 283 భాషలు అంతరించాయని, సరైన భాషా పరిరక్షణ విధానాలు లేక భారతదేశం భాషల మృత్యుదిబ్బగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిభాషలకు ప్రత్యేక స్థానం కల్పించాల్సిన సందర్భంలో సంస్కృతభాషను ప్రవేశపెట్టడం సరైన చర్య కాదు. ఇలాంటి అనాలోచిత చర్యలపై తెలంగాణ బుద్ధి జీవులు స్పందించకపోవడం విడ్డూరం. ప్రజల ఆకాంక్షల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి వివేచనతో, ఆధునిక స్పృహతో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇమ్మిడి మహేందర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం