Abn logo
Mar 5 2021 @ 00:58AM

మరో మహోద్యమమే విశాఖ ఉక్కుకు రక్ష

తమ ప్రభుత్వం వ్యాపారం చేయదని, అందుకే ప్రభుత్వరంగ పరిశ్రమలన్నింటిని ప్రైవేటీకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పష్టం చేశారు. దీనికనుగుణంగానే ఇటీవల ప్రైవేటీకరణ స్పీడును పెంచారు. అయితే ప్రభుత్వ నిర్ణయానికి అంతే ధీటుగా, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐదు దశాబ్దాల క్రితం 32 మంది బలిదానంతో సాగిన మహోద్యమం ద్వారా సాధించుకున్న, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ మణిహారాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ప్రైవేటీకరించడానికి అనుమతించేది లేదని, మరో మహోద్యమానికైనా సిద్దమని ప్రజలు, ప్లాంట్‌ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.


కేంద్రప్రభుత్వం దీనిని ఎందుకు ప్రైవేటీకరించాలని నిర్ణయించిందో లోతుగా పరిశీలించకుండా, కొంతమంది ప్రముఖులు, నష్టాలొస్తున్నాయి కాబట్టే ఆ దిశగా అడుగు లేస్తోందని ఊహించేసుకుని, పరిష్కారాలు కూడా చూపించేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల విశాఖలో పోరాట కమిటీ నాయకులతో మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ మిగులు ఏడువేల ఎకరాలను అమ్మి అప్పులు తీర్చేయవచ్చని అన్నారు. అంతేకాక షేర్‌ మార్కెట్‌లో స్టీల్‌ప్లాంట్‌ వాటాలను లిస్టింగుకు కూడా పెట్టవచ్చని సూచన చేశారు. అయితే భూములు అమ్మడం ఎన్నడూ పరిష్కారం కాదు. అలాగే వాటాలమ్మడం అంటే అది చివరకు పూర్తి ప్రవేటీకరణకే దారి తీస్తుందనేది పచ్చి వాస్తవం. విశాఖలో ఉన్న హిందూస్థాన్‌ జింక్‌ పరిశ్రమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. పది శాతం వాటాల అమ్మకంతో ప్రారంభంచి జింక్‌ పరిశ్రమను వేదాంత కార్పొరేట్‌ కంపెనీకి పూర్తిగా అప్పగించారు. ఆ తరువాత దాన్ని మూసివేశారు. నేడు ఆ సంస్థ భూములతో వేదాంత కంపెనీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెగబడింది. అందువల్ల ఇటువంటి సూచనలు ప్లాంట్‌ను పరిరక్షించలేవు సరికదా, చివరకు పూర్తిగా వాటిని దెబ్బతీయడానికే ఉపకరిస్తాయి. ఇంకో ప్రధాన పార్టీ నాయకుడు, తాము ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకం కాదని, అయితే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను మాత్రం వ్యతిరేకిస్తామని తెలిపారు. ఇదెలా సాధ్యమో ఆయనకే తెలియాలి. ఎందువల్లనంటే, ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి నష్టాలు కారణమని కేంద్రప్రభుత్వం ఏనాడూ చెప్పలేదు సరికదా నేడు దేశంలో ఉన్న 339 ప్రభుత్వరంగ పరిశ్రమలలో రెండు డజన్లు మినహా మిగిలిన అన్నింటిని ప్రైవేటీకరిస్తామని స్పష్టంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్‌ సెక్రటరీ మరో అడుగు ముందుకేసి, ప్రైవేటీకరణ అయినా పరవాలేదు కాని, వచ్చే పెట్టిబడిదారుడు మంచివాడై ప్లాంటును సక్రమంగా నడిపితే చాలని సెలవిచ్చారు. కేంద్రప్రభుత్వ విధానాన్ని గమనించకుండా ఏవో పైపై సూచనలు చేయడం ఉపయోగకరం కాకపోవడమే కాక హానికరం కూడా. అయినా, విశాఖ ఉక్కు నష్టాలకు ప్రధాన కారణం ప్లాంట్‌కు స్వంత గనులు లేకపోవడమే. ఈ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోంది. గనుల కేటాయింపు మాత్రమే విశాఖ ఉక్కుకు పరిష్కారం తప్ప మరే పరిష్కారమైన దానిని దెబ్బతీయడానికే ఉపకరిస్తుంది. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాన్ని ఒక ఘనకార్యంగా భావిస్తున్న మోదీ సర్కార్‌ దానికి పెట్టిన పేరు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’. అంటే దేశ స్వావలంబన. ప్రభుత్వరంగాన్ని, వాటి ఆస్తులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాధత్తం చేయడం ఏ రకమైన ఆత్మ నిర్భరో సామాన్యులకు అంతుచిక్కని రహస్యం. మరోపక్క కార్పొరేట్లకు లక్షలకోట్ల రుణాలను మాఫీ చేస్తూ, సబ్సిడీల రూపంలో అందిస్తూ ప్రభుత్వం వాటి సేవలో తరిస్తోంది.


రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రుల హక్కును కాలరాస్తే సహించేది లేదని తెలుగు ప్రజలందరూ ఎలుగెత్తి చాటవలసిన సమయమిది. ఈ మహోద్యమాన్ని ముందుకు తీసుకుపోయేలా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోకుండా అన్న పార్టీలు రాష్ట్ర విశాల ప్రయోజనాల రీత్యా ఈ సమస్యపై కలిసికట్టుగా ఉద్యమించాలి. 

ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Advertisement
Advertisement
Advertisement