మరో రెండేళ్లు సడలింపు

ABN , First Publish Date - 2022-05-21T08:47:11+05:30 IST

రాష్ట్రంలో యూనిఫాం పోస్టులకు మరో రెండేళ్లు వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరో రెండేళ్లు సడలింపు

  • యూనిఫాం పోస్టులకు వయో పరిమితి పెంపు
  • సీఎం కేసీఆర్‌ నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
  • పోలీస్‌ పోస్టుల దరఖాస్తులకు 26 తుది గడువు
  • గ్రూప్‌-1 కేటగిరీలో డీఎస్పీ పోస్టుకు ఎత్తు తగ్గింపు
  • 167.6 సెం.మీ నుంచి 165 సెం.మీ.కు కుదింపు


హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూనిఫాం పోస్టులకు మరో రెండేళ్లు వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్‌లో మూడేళ్లు ఇవ్వగా.. తాజాగా మరో రెండేళ్లు సడలింపు ఇచ్చింది. యూనిఫాం పోస్టులకు రెండేళ్ల వయో పరిమితి సడలింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను శుక్రవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. దీంతో రెండేళ్లు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల వయో పరిమితి సడలింపు ఉత్తర్వులను సీఎస్‌ జారీ చేశారు. పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, ఎస్పీఎఫ్‌, ఎక్సైజ్‌, రవాణా తదితర శాఖల పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. మూడేళ్ల వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 17,291 పోలీస్‌ పోస్టుల భర్తీకి పోలీస్‌ నియామక మండలి ప్రకటనలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా వయో పరిమితి సడలింపుతో కానిస్టేబుల్‌ పోస్టులకు ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 27 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు వయోపరిమితి ఉంటుంది.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్య్లూఎస్‌ అభ్యర్థులకు మరో ఐదేళ్ల సడలింపు ఉండగా.. ప్రభుత్వం ఉద్యోగులకు సర్వీసును బట్టి ఐదేళ్ల వరకు వయో పరిమితి సడలింపు ఇస్తోంది. యూనిఫాం పోస్టులకు ప్రభుత్వం ఇచ్చిన మూడేళ్ల సడలింపు సరిపోదని, మరో రెండేళ్లు ఇవ్వాలని నిరుద్యోగులు రెండుసార్లు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ‘మరో రెండేళ్లు వయో సడలింపు..?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 10న కథనం ప్రచురితమైంది. 


దరఖాస్తు గడువు పెంపు..

మరో రెండేళ్లు వయో పరిమితి పెంచడంతో పోలీస్‌ పోస్టుల దరఖాస్తు గడువును పోలీస్‌ నియామక మండలి పెంచింది. ఈ నెల 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. వయో పరిమితి సడలింపునకు సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్లను నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. కాగా, పోలీస్‌ పోస్టులకు ఈ నెల 2 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకే దరఖాస్తుకు తుది గడువు ఉండగా.. వయో పరిమితి పెంచడంతో మరో ఆరు రోజులు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. వయో పరిమితి పెంపుతో అదనంగా రెండు లక్షల దరఖాస్తులొచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.


డీఎస్పీ పోస్టుకు ఎత్తు తగ్గింపు..

ఉద్యోగార్థుల అభ్యర్థన మేరకు గ్రూప్‌-1 కేటగిరీలో డీఎస్పీ పోస్టుకు ఎత్తును ప్రభుత్వం తగ్గించింది. గతంలో 167.6 సెం.మీ ఉండగా.. ప్రస్తుతం దానిని 165 సెం.మీ.కు సడలించింది. అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుకూ ఇదే వర్తిస్తుందని తెలిసింది. ఎత్తు పెంపుపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారం వెలువడే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-05-21T08:47:11+05:30 IST