మరో ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2020-03-31T09:04:04+05:30 IST

రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. వరుసగా రెండో రోజూ 2 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అవి కూడా ఢిల్లీ కనెక్షన్‌ కేసులు కావడంతో భయాందోళన మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క

మరో ఇద్దరికి కరోనా

  • ‘తూర్పు’లో 2 పాజిటివ్‌ కేసులు.. బాధితులు ఇద్దరికీ ‘ఢిల్లీ కనెక్షన్‌’
  • రాష్ట్రంలో 23కి చేరిన బాధితులు
  • గుంటూరులో క్యూ కట్టిన అనుమానితులు


జీజీహెచ్‌(కాకినాడ), గుంటూరు, మార్చి 30: రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. వరుసగా రెండో రోజూ 2 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అవి కూడా ఢిల్లీ కనెక్షన్‌ కేసులు కావడంతో భయాందోళన మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసే ఉండగా సోమవారం మరో ఇద్దరికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ బ్యాంకుపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి, రాజమండ్రి రూరల్‌ మండలం కాతేరుకి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించగా సోమవారం వచ్చిన రిపోర్టులో ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చినట్టు నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.కిరణ్‌ తెలిపారు. బ్యాంకుపేటలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యుల్లో ఆయన తల్లి(65), భార్య(35), ఇద్దరు కొడుకులు(11, 12 ఏళ్లు), కుమార్తె(7)ను కూడా జీజీహెచ్‌కు తరలించారు. జగన్నాథపురానికి చెందిన వ్యక్తి నివేదిక రావాల్సి ఉంది. ఇటీవల లండన్‌ వెళ్చొచ్చిన రాజమండ్రి నగరానికి చెందిన ఎంబీఏ విద్యార్థి జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసుగా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.


కాతేరులో కలకలం

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామంలోని శాంతినగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఆయన సమీపంలోని కోలమూరు, జాంపేట ప్రాంతాలకు చెందిన వారితో కలసి మొత్తం 25 మంది ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మేకను కోసి విందు ఇచ్చారని ఇక్కడి సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులను, మరో వీధిలో ఉండే ఆయన చిన్నకొడుకు కుటుంబ సభ్యులు మొత్తం 16 మందిని క్వారంటైన్‌కు తరలించారు.


రెండు రోజుల్లో 97 మంది శాంపిల్స్‌

గుంటూరు జిల్లాను కరోనా భయం వెంటాడుతోంది. సోమవారం 200 మంది కరోనా భయంతో నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రులకు వచ్చారు. వీరిలో 42 మంది నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆదివారం కూడా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అనుమానిత లక్షణాలతో 200 మంది రాగా.. 55 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. అంటే రెండు రోజుల వ్యవధిలోనే 97 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించడం విశేషం. జిల్లాలో ఇప్పటి వరకు 142 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌, 61 మందికి నెగెటివ్‌ వచ్చింది. 77 మంది నివేదికలు రావాల్సి ఉంది.

Updated Date - 2020-03-31T09:04:04+05:30 IST