అన్నదాతపై మరో పిడుగు

ABN , First Publish Date - 2022-01-20T04:30:00+05:30 IST

వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తున్న రైతులపై

అన్నదాతపై మరో పిడుగు

  • ఎరువుల ధరలకు ‘రెక్కలు’
  • రైతులపైౖ ఎరువుల భారం రూ.250 కోట్లు
  • సబ్సిడీపై నోరుమెదపని ప్రభుత్వాలు


వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తున్న రైతులపై మరో పిడుగు పడింది. ఎరువుల ధరలు పెరగతిడంతో లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పెట్టుబడులు అధికమవడంతో వ్యవసాయం చేయలేమంటూ  బోరుమంటున్న రైతన్నకు ఎరువుల ధర పెరుగుదల గుదిబండగా మారింది.  అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ ఎరువుల తయారీ కంపెనీలు అకస్మాత్తుగా ఎరువుల ధరలు పెంచాయి. దీంతో అన్నదాతల కష్టాలు రెట్టింపయ్యాయి.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): మూలిగే నక్కపై తాటికాయపడినట్లుగా ఉంది అన్నదాతల పరిస్థితి. అసలే పెట్టుబడి భారం పెరిగి అప్పులు పాలవుతున్న రైతులకు మరో షాక్‌ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ ఎరువుల తయారీ కంపెనీలు అకస్మాత్తుగా ఎరువుల ధరలు పెంచాయి. వాతావరణం అనుకూలించక పెట్టుబడులు తిరిగి రాక రైతులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఎరువుల ధరలు అమాంతంగా పెరగడంతో ఆగమ్యగోచరంగా మారింది. దీంతో పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న సాయం కూడా ఆవిరవుతోంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలతోపాటు కూలీల ధరలు పెరగడంతో రైతులకు ఖరీఫ్‌ పెట్టుబడి మరింత భారంగా మారిన సంగతి విధితమే. తరచూ బహిరంగ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరగడంతోపాటు డీజిల్‌ ధరలు పెరుగుదల కారణంగా దుక్కులు దున్నడానికి కూడా ఖర్చు పెరిగింది. ఇక కూలీల ధరలతోపాటు విత్తనాలు, క్రిమిసంహారక మందుల ధరలు ప్రతిఏటా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడిసాయం కూడా రైతులకు సరిపోవడం లేదు. వాస్తవానికి గతంలో కేంద్రం రైతులకు సరఫరా చేసే ఎరువులకు భారీగా సబ్సిడీ ఇచ్చేది. కానీ ఇటీవల కాలంలో సబ్సిడీని తగ్గించేశారు. ఈ ఏడాది ఎరువుల ధరలు దాదాపు 40శాతానికిపైగా పెంచడంతో రైతుల నడ్డివిరిగినట్లైంది. పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్రం మళ్లీ ఎరువులపై సబ్సిడీ పెంచాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో భాస్వరం, పొటాష్‌ ధరలు పెరగడంతో ఇందుకు అనుగుణంగా మిశ్రమ ఎరువుల ధరలను పెంచాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే తాజాగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచడం వల్ల ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలోని రైతులపై ఏటా సుమారు రూ.250కోట్ల వరకు భారం పడనుంది. ఉమ్మడిజిల్లా రైతాంగం వినియోగిస్తున్న అన్నిరకాల మిశ్రమ ఎరువుల ధరలను పరిగణనలోకి తీసుకుంటే గతేడాదితో పోలిస్తే బస్తాకు సగటున రూ.500కిపైగా భారం పడుతుంది.  ఉమ్మడి జిల్లాలో 2020-21 వ్యవసాయ సీజన్‌లో మొత్తం 2.49 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు వినియోగించారు. ఈ లెక్కన దాదాపు 5లక్షల బస్తాల కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. వచ్చే వ్యవసాయ సీజన్‌లోనూ ఇన్నే ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తే రైతులపై సుమారు రూ.200కోట్ల అదనపు భారం పడుతుంది. సాధారణంగా రబీ, ఖరీఫ్‌ సీజన్‌లలో ప్రతి పంటకు ఎకరానికి సగటున రెండు బస్తాల కాంప్లెక్స్‌ ఎరువుల్ని రైతులు వినియోగిస్తుంటారు. అధికంగా రైతులు 20:20:13, 28:28:0, 15:15:15:1 ఎరువులను వాడతారు. కొందరు రైతులు అధిక దిగుబడి కోసం పొటా్‌షను సైతం ఎక్కువగా వినియోగిస్తారు. అయితే రైతులు వినియోగించే ఈ ఎరువుల ధరలు ఈ ఏడాది భారీగా పెరగడంతో రైతులపై మరింత ఆర్ధిక భారం పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో బస్తా (50 కిలోలు) రూ.1275 ఉన్న డీఏపీ ధర ఇపుడు రూ.1900లకు పెంచేశారు. దీంతో ఒక బస్తా కొనుగోలు చేసిన రైతుపై రూ.600 అదనపు భారం పడుతుంది. అలాగే బస్తా రూ.850 ఉన్న పొటాష్‌ (ఎంఓపీ)ధర ఏకంగా రూ.1700లకు పెరిగింది. అంటే ఏకంగా పొటాష్‌ ధర 50శాతం పెంచేశారు. గతేడాది రూ.970గా ఉన్న 20:20:13 పలు దఫాలుగా పెరుగుతూ వస్తోంది. కొత్త ధరల ప్రకారం ఇపుడు ఇది రూ.1375కు చేరనుంది. ముఖ్యంగా వరిలో ఎక్కువగా మిశ్రమ ఎరువులను వినియోగిస్తారు. ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల వరి రైతులకు పెట్టుబడి భారం మరింత పెరగనుంది. ఇతర పంటలు సాగు చేసే రైతులపై కూడా సుమారు 30శాతం వరకూ అదనపు భారం పడనుంది. 


ఉమ్మడి జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో ఎరువుల వినియోగం (టన్నుల్లో)

వానాకాలం యాసంగి

1,09,384 28,260

74,683 28,293

6,396 2,500

Updated Date - 2022-01-20T04:30:00+05:30 IST