Abn logo
Mar 31 2021 @ 17:38PM

గుజరాత్‌కు కాసేపట్లో మరో మూడు రఫేల్ జెట్స్

న్యూఢిల్లీ : భారత దేశ వైమానిక దళం మరింత బలోపేతం కాబోతోంది. బుధవారం సాయంత్రం 7 గంటలకు మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు గుజరాత్‌లోని అంబాలాకు చేరుకోబోతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విమానాలు బుధవారం ఉదయం 7 గంటలకు ఫ్రాన్స్‌లో బయల్దేరాయి. 


ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్‌‌లో ఉన్న మెరినాక్ వైమానిక స్థావరం నుంచి మార్చి 31న ఉదయం 7 గంటలకు మూడు రఫేల్ యుద్ద విమానాలు బయల్దేరాయి. అంబాలాలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌కు సాయంత్రం 7 గంటలకు చేరుకుంటాయి. దీంతో మన దేశంలో మొత్తం రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య 14కు చేరుతుంది. 


ఏప్రిల్‌లో మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు మన దేశానికి వస్తాయి. వీటిని పశ్చిమ బెంగాల్‌లోని హసిమర వైమానిక స్థావరంలో ఉంచుతారు. రాబోయే రెండు నెలల్లో మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు వస్తాయి. 


భారత్-ఫ్రాన్స్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ప్రకారం మన దేశానికి 36 రఫేల్ యుద్ధ విమానాలను సరఫరా చేయవలసి ఉంది. ఈ ఒప్పందం విలువ రూ.59 వేల కోట్లు. ఈ ఒప్పందంలో భాగంగా జూలై 29న ఐదు రఫేల్ యుద్ధ విమానాలు మన దేశానికి వచ్చాయి. సెప్టెంబరు 10న వీటిని అంబాలా వైమానిక స్థావరంలో ప్రవేశపెట్టారు. గత ఏడాది నవంబరు 3న, ఈ ఏడాది జనవరి 27న మూడేసి చొప్పున రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి. ఒప్పందం ప్రకారం మొత్తం విమానాలు 2022 చివరికల్లా మన దేశానికి వచ్చే అవకాశం ఉంది.


జాతీయంమరిన్ని...