చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల లెక్కలివీ..!

ABN , First Publish Date - 2020-04-09T19:04:23+05:30 IST

చిత్తూరు జిల్లాలో బుధవారం మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో నగరి పట్టణంలో రెండు, తిరుపతిలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈ ముగ్గురూ ఇప్పటికే కరోనా వైరస్‌ సోకిన బాధితుల కుటుంబీకులే. నగరిలో

చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల లెక్కలివీ..!

జమాత్ సభ్యుల కుటుంబాల్లో మరో ఇద్దరికి కరోనా

చిత్తూరు జిల్లాలో ఇరవైకి చేరుకున్న కరోనా కేసులు

ముగ్గురూ కరోనా బాధితుల కుటుంబీకులే


తిరుపతి (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో బుధవారం మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో నగరి పట్టణంలో రెండు, తిరుపతిలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈ ముగ్గురూ ఇప్పటికే కరోనా వైరస్‌ సోకిన బాధితుల కుటుంబీకులే. నగరిలో గత నెల ఢిల్లీ నిజాముద్దీన్‌ వెళ్ళి వచ్చిన జమాత్‌ సభ్యుల్లో ఇద్దరికి కరోనా సోకినట్టు ఈ నెల 5వ తేదీన గుర్తించిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు తాజాగా వైరస్‌ బారిన పడ్డారు. అదే విధంగా తిరుపతికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా వుంటూ గత నెల చివరి వారంలో తిరుపతి రాగా అతనికి కూడా వైరస్‌ సోకినట్టు ఈ నెల 5న అధికారులు గుర్తించారు. ఇపుడు అతని కుమారుడు కూడా వైరస్‌ బారిన పడినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. నగరిలో నమోదైన కేసులకు సంబంధించి ఎవరినుంచి వైరస్‌ సోకిందనే విషయం స్పష్టంగా తెలుస్తుండగా తిరుపతిలో తండ్రీ కొడుకులిద్దరికీ ఎవరి నుంచీ సోకిందన్నది మాత్రం తెలియరాలేదు. కాగా బుధవారం అధికారులు ప్రకటించిన మూడు కేసులతో జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20కి చేరుకుంది. తిరుపతిలో కేసుల సంఖ్య ఆరుకు, నగరిలో నాలుగుకు పెరగడంతో జిల్లా యంత్రాంగం ఈ రెండు చోట్లా లాక్‌డౌన్‌ ఆంక్షలను, వైరస్‌ నివారణా చర్యలను మరింత కఠినంగా చేపడుతోంది.


ముప్పు పొంచే ఉంది!

విదేశాల నుంచీ జిల్లాకు వచ్చిన వారిలో దాదాపుగా అందరినీ జిల్లా యంత్రాంగం గుర్తించింది. హోమ్‌ క్వారంటైన్‌, ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో వారిని పరిశీలనలో వుంచింది. అయితే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వారిని మాత్రం ఇంకా పూర్తిగా గుర్తించలేదు. అటువంటి వారి నుంచీ జిల్లాకు ఇంకా ముప్పు పొంచే వుందని అధికారులు అనుమానిస్తున్నారు. గుర్తించినంత మేరకు మాత్రం వారిని హోమ్‌ లేదా ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వుంచింది. మొత్తంగా చూస్తే విదేశాల నుంచీ వచ్చిన వారిలో ఒకరు మాత్రమే వైరస్‌ బారిన పడ్డారు. అయితే ఆ వ్యక్తి బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వానికి సకాలంలో సమాచారమివ్వడం, కుటుంబసభ్యులకు దూరంగా హోమ్‌ ఐసొలేషన్‌ పాటించడంతో ఇప్పటిదాకా అతనినుంచీ మరెవరికీ వైరస్‌ సోకలేదు.కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అతన్ని తిరుపతి తరలించి ఆస్పత్రిలో చేర్చి చికిత్స కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వారిలో గుర్తించిన వారిని, వారి కుటుంబీకులను, సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్‌ చేశారు. మొత్తం నమోదైన 20 కేసుల్లో ప్రవాస భారతీయుడి విషయం పక్కన పెడితే మిగిలిన 19 కేసుల్లో 11 మంది జమాత్‌ సభ్యులున్నారు. 


అందులో 8 మంది ఢిల్లీ, ముగ్గురు అసోం వెళ్ళి వచ్చారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన 8 మందిలో ముగ్గురు వ్యక్తుల ద్వారా మరో ఐదుగురికి వైరస్‌ వ్యాపించింది. తిరుపతి యువకుడి ద్వారా అతడి తల్లిదండ్రులిద్దరూ వైరస్‌ బారిన పడగా, రేణిగుంట యువకుడి ద్వారా అతని సోదరికి, నగరి వ్యక్తి ద్వారా అతని కుటుంబంలోని ఇద్దరు మహిళల కు సోకింది. జమాత్‌ సభ్యులు, వారి ద్వారా వైరస్‌ బారిన పడిన ఐదుగురు కలిపి మొత్తం 16 మంది సంగతి అటుంచి తే మిగిలిన ముగ్గురికీ వైరస్‌ ఎవరి నుంచీ సంక్రమించిన్నది తెలియడంలేదు. తిరుపతి మహిళ కుటుంబంతో కలసి గత నెల ఆదిలాబాద్‌ జిల్లా వెళ్ళి వచ్చారు. రాకపోకలు తిరుపతి-నిజాముద్దీన్‌ నడుమ నడిచే ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాగడంతో వైరస్‌ ఎప్పుడు, ఎలా, ఎవరి నుంచీ సోకిందనేది తెలియడం లేదు. అలాగే తిరుపతి వ్యక్తి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా వుంటూ గత నెల 23వ తేదీ వరకూ సిటీ బస్సుల్లో విస్తృతంగా ప్రయాణించారు. వైరస్‌ ఎలా సోకిందో తెలియని పరిస్థితి. అయితే ఆ వ్యక్తి కూడా తిరుపతి వచ్చాక బాధ్యతగా వ్యవహరించి నిబంధనలు పాటించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. తొలుత అతడికి వైరస్‌ సోకినట్టు ఈ నెల 5న తేలగా బుధవారం అతని కుమారుడికి కూడా సోకినట్టు వెల్లడైంది. గుర్తించిన అనుమానితులందరినీ క్వారంటైన్‌ చేసినందున వైరస్‌ వ్యాప్తికి ఓ విధంగా అడ్డుకట్ట పడినట్టే. అటువంటివారిలో పాజిటివ్‌ కేసులు మరిన్ని బయటపడినా అవన్నీ ఆ కుటుంబాల పరిధిలోనే ఆగిపోతాయి. అయితే ఇంకా గుర్తించని వారితో మాత్రం జిల్లాకు ముప్పు పొంచి వుందని అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. అందుకే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వారు తమకు తాముగా సమాచారమివ్వాలని, క్వారంటైన్‌ పాటించాలని, అనారోగ్య లక్షణాలుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా అధికారులు పదే పదే పిలుపునిస్తున్నారు.


పీపీఈ కిట్లకు కొరత లేదు:కలెక్టర్‌ 

జిల్లాలో ఇరవై కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ నారాయణ్‌ భరత్‌ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. 14 క్వారంటైన్‌ కేంద్రాల్లో 450 మంది కరోనా అనుమానిత లక్షణాలు కల్గిన వారున్నారన్నారు. విదేశాల నుండి వచ్చినవారిలో 1816మందిని , ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన 1789 మందిని 28 నిరాశ్రయుల కేంద్రాల్లో ఉంచామని చెప్పారు. జిల్లాలో మాస్కులకు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్వి్‌పమెంట్‌ కిట్లకు, శానిటైజర్లకు కొరత లేదన్నారు.ఇంతవరకు 4.20 లక్షల సర్జికల్‌ త్రీ లేయర్స్‌ మాస్కులు, 5 వేల ఎన్‌-95 మాస్కులను ఆస్పత్రుల సిబ్బందికి, పోలీసులకు అందించామన్నారు. 15,350 లీటర్ల శానిటైజరును క్షేత్రస్థాయి సిబ్బందికి పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రభుత్వం ద్వారా రోజుకు 50-60 వేల మధ్య మాస్క్‌లు, 500 పీపీఈ కిట్లు అందుతుండగా వాటిని ఆస్పత్రులకు, ఎంపీడీవో కార్యాలయాలకు, పీహెచ్‌సీలకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ నిధులతో స్విమ్స్‌ ఆస్పత్రికి ఎక్వి్‌పమెంట్స్‌ కొనుగోలు చేస్తామన్నారు. కరోనా అనుమానితుల నుంచి జిల్లాలో ఇప్పటివరకు 444 శాంపిల్స్‌ సేకరించగా 374 శాంపిల్స్‌కు సంబంధించి నెగిటివ్‌ వచ్చిందని, మరో 50 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సివుందన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కరోనా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఇంతవరకు 565 ఫిర్యాదులు అందాయన్నారు. కరోనాకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖకు టోల్‌ ఫ్రీ నెంబరు 1100, ఆరోగ్య సలహా మేరకు 104, పరీక్షా కేంద్రాల వివరాలకు 0866 2410978 లేదా 7013387382, 8008473799, కంట్రోల్‌ రూమ్‌కు 98499 02379ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-04-09T19:04:23+05:30 IST