‘ఉక్కు’ దిశగా మరో అడుగు..!

ABN , First Publish Date - 2021-02-24T05:08:22+05:30 IST

జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో రూ.12-15 వేల కోట్ల పెట్టుబడి, దశల వారీగా 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ నిర్మాణానికి 2019 డిసెంబరు 23న సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

‘ఉక్కు’ దిశగా మరో అడుగు..!
ఉక్కుపరిశ్రమకు కేటాయించిన స్థలం వద్ద ప్రహరీగోడ నిర్మాణం

జాయింట్‌ వెంచర్‌గా లిబర్టీ స్టీల్‌ ఇండియా సంస్థ

తొలి దశలో రూ.10,082 కోట్లు పెట్టుబడి

ఎల్‌వోఏ ఇచ్చే అధికారం వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఎండీకే

రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

మెగా ఇండస్ర్టియల్‌ పార్కుకు 692.58 ఎకరాలు

ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్ర ఏర్పాటు


(కడప-ఆంధ్రజ్యోతి): ఉక్కు పరిశ్రమ నిర్మాణం దిశగా మరో అడుగు పడింది. ఇప్పటికే పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌తో కలసి పరిశ్రమ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపిక, గ్లోబల్‌ టెండర్లు కూడా పూర్తి చేశారు. ఎస్‌బీఐ క్యాప్‌ సిఫారుల మేరకు జాయింట్‌ వెంచర్‌ (జీవీ)గా లిబర్టీ స్టీల్‌ ఇండియా లిమిటెండ్‌ను ఎంపిక చేశారు. ఆ సంస్థతో ఎల్‌ఓఏ చేసుకోవడానికి వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఎండీకి అధికారం ఇస్తూ మంగళవారం విజయవాడలో సీఎం జగన్‌ అధ్యక్షన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే పనులు ప్రారంభం అయ్యే అకాశం ఉందని నిపుణులు అంటున్నారు.ఆ వివరాలు ఇలా.. 

జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో రూ.12-15 వేల కోట్ల పెట్టుబడి, దశల వారీగా 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ నిర్మాణానికి 2019 డిసెంబరు 23న సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. పునాదిరాయి వేసి ఏడాది దాటింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ను వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌గా మార్చారు. పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. ఆ తరువాత భాగస్వామ్య సంస్థ ఎంపిక కోసం గ్లోబల్‌ టెండర్లు నిర్వహించగా.. లిబర్టి స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థతో ఎస్‌బీఐ క్యాప్‌ సిఫారుల ప్రకారం జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ఎంపిక, జేవీగా లిబర్టీ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఎంపిక, ఆ సంస్థతో ఎల్‌వోఏ చేసుకోవడానికి వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఎండీకి అనుమతులు ఇస్తూ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే.. ఆ సంస్థ తొలి దశలో రూ.10,082 కోట్లు, రెండో దశలో రూ.6వేల కోట్లు వ్యయం చేయనుందని క్యాబినెట్‌ ఆమోదంలో వివరించారు. అంతేకాకుండా.. జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల పరిధిలో 3,148.68 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌కు కేటాయించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంటే.. జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఫేజ్‌-1లో 3 మిలియన్‌ టన్నులు, ఫేజ్‌-2లో 3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఆమోదం తెలిపింది.


మెగా ఇండస్ర్టియల్‌ పార్కుకు 692.58 ఎకరాలు

కడప నగర సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయదలచిన మెగా ఇండస్ర్టియల్‌ పార్కుకు 692.58 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వల్లూరు మండలం అంబాపురం సమీపంలో 93.99 ఎకరాలు, సీకే దన్నె మండలం కొప్పర్తి సమీపంలో 598.59 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయిస్తూ తీర్మానించారు. అలాగే.. ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణం, 12 పోస్టులు మంజూరు చేస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.



Updated Date - 2021-02-24T05:08:22+05:30 IST