‘బుగ్గపాడు’లో మరో ముందడుగు

ABN , First Publish Date - 2022-08-05T06:49:10+05:30 IST

‘బుగ్గపాడు’లో మరో ముందడుగు

‘బుగ్గపాడు’లో మరో ముందడుగు
:బుగ్గపాడులో మెగా ఫుడ్‌ పార్కు

మెగాఫుడ్‌పార్క్‌లో ఐదు పరిశ్రమలకు స్థలం కేటాయింపు

ధ్రువీకరించిన టీఎస్‌ఐఐసీ అధికారి 

యూనిట్ల స్థాపనకు ముందుకొస్తున్న పారిశ్రామికవేత్తలు

పర్యవేక్షణ మెరుగు పడితేనే సత్ఫలితాలు

సత్తుపల్లి, ఆగస్టు 4: సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడులో ప్రభుత్వం నిర్మించిన మెగా ఫుడ్‌పార్కులో తాజాగా అయిదు వ్యవసాయాధారిత పరిశ్రమలకు స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇక్కడి ఫుడ్‌పార్కులో పరిశ్రమలు స్థాపించేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకోగా వీటిలో అయిదు కంపెనీలకు స్థలం కేటాయించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.


ఫుడ్‌పార్కు పూర్వాపరాలివీ..

స్థానికంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటంతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో బుగ్గపాడులో మెగా ఫుడ్‌పార్కు నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 2008 జనవరి 27న అప్పటి ప్రభుత్వం ఫుడ్‌ పార్కుకు శ్రీకారం చుట్టింది. 200ఎకరాలను భూసేకరణ చేశారు. ఆ తరువాత ఫుడ్‌పార్కు పనులు ముందుకు సాగలేదు. తరువాత కాలంలో కేంద్ర ప్రభుత్వం ఫుడ్‌ పార్కులకు నిధులు కేటాయించటంతో బుగ్గపాడులో స్థలం కూడా అందుబాటులో ఉండటంతో ఇక్కడ ఫుడ్‌పార్కు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2016 నవంబర్‌ 13న మెగా ఫుడ్‌పార్కు నిర్మాణానికి అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు శంకుస్థాపన చేశారు. 200 ఎకరాలను పారిశ్రామికమౌలిక సదుపాయాల కల్పనా సంస్థకు అప్పగించారు. అప్పట్లో రూ.112 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. అందులో కేంద్ర ప్రభు త్వం రూ.50కోట్లు, నాబార్డు రుణం రూ.32కోట్లుగా ప్రకటించారు. మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది.


అభివృద్ధి ఇలా...

200 ఎకరాల విస్తీర్ణంలో  60 ఎకరాల్లో మౌలిక వసతుల కోసం కేటాయించారు. దీనిలో రోడ్లు, నీరు, విద్యుత, వ్యర్ధాల ట్రీట్మెంట్‌, వేర్‌ హౌస్‌, ప్యాక్‌ హౌస్‌, సబ్‌స్టేషన, వాటర్‌ ట్యాంకు, ప్రహరీ, సెంట్రల్‌ లైటింగ్‌, పరిపాలనా భవనం, కోల్డ్‌ స్టోరేజి, స్టాండర్డ్‌ డిజైన ఫ్యాక్టరీ తదితర నిర్మాణాలు చేపట్టి 90శాతం పైగా పూర్తి అయ్యాయి. తాజాగా మౌలిక వసతులు పూర్తి కావొచ్చిన క్రమంలో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. 70దరఖాస్తులకుగాను  ఐదు దరఖాస్తులను ఆమోదించి ఆయా కంపెనీలకు స్థలాలు కేటాయించారు. ఈ విషయాన్ని టీఎ్‌సఐఐసీ అధికారి ఒకరు ధృవీకరించారు. వీటికి సంబంఽధించి అగ్రిమెంట్‌, డబ్బు చెల్లింపు తదితర నియమనిబంధనల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని సదరు అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతనే కంపెనీలు తమకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టే అవకాశాలున్నాయి.


పర్యవేక్షణేదీ? 

ఫుడ్‌పార్కుకు శంకుస్థాపన చేసిన సమయంలో రెండు కంపెనీలకు స్థలం కేటాయించినట్లు ప్రకటించారు. వీటిలో ఒక కంపెనీ ఇప్పటి వరకూ అడ్రెస్‌ లేకుండా పోయింది. మరో కంపెనీ పనులు ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా ఆశించిన ప్రగతి లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా పాతిక వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉంటాయని అప్పట్లో ప్రకటించినాఆరేళ్ల కాలంలో ఆశించిన స్థాయిలో పరిశ్రమ స్థాపన జరగలేదు. దీనికి తోడు ఇక్కడ జరుగుతున్న పనులు, పరిశ్రమల కేటాయింపు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, మంత్రుల పర్యవేక్షణ లేకపోవటంతో మెగా ఫుడ్‌పార్కు ఫలితాలు సకాలంలో ఇవ్వటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా స్థలాలు పొందిన పారిశ్రామికవేత్తలు సకాలంలో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తే రైతులకు కొంత మేర ప్రయోజనం కలుగుతుందని చెపుతున్నారు.

Updated Date - 2022-08-05T06:49:10+05:30 IST