అసలే కరోనా కష్టకాలం.. ముందుంది మరో ప్రమాదం..!

ABN , First Publish Date - 2020-07-10T21:03:17+05:30 IST

రోనా వంటి విపత్కర సమయంలో మరో ప్రమాదం అటు ప్రజలను, ఇటు అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తోంది. జిల్లాలో అడపాదడపా వర్షాలు మొదలయ్యాయి. దీంతో జ్వరాల సీజన్‌ కూడా ప్రారంభమైంది.

అసలే కరోనా కష్టకాలం.. ముందుంది మరో ప్రమాదం..!

ముందుంది ప్రమాదం.. మేల్కోవాలి తక్షణం!

మొదలైన జ్వరాల సీజన్‌

అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ

కరోనా సమయంలో ఇది మరింత ప్రమాదం

ఏది వైరల్‌ జ్వరమో.. ఏది కరోనా జ్వరమో తెలుసుకోవడం కష్టం

వేగంగా కూడా జరగని కరోనా పరీక్షలు


నెల్లూరు (ఆంధ్రజ్యోతి) : కరోనా వంటి విపత్కర సమయంలో మరో ప్రమాదం అటు ప్రజలను, ఇటు అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తోంది. జిల్లాలో అడపాదడపా వర్షాలు మొదలయ్యాయి. దీంతో జ్వరాల సీజన్‌ కూడా ప్రారంభమైంది. ఏటా జూలై నెలాఖరు నుంచి నవంబరు వరకు జిల్లాలో జ్వరాల తీవ్రత విపరీతంగా ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి. చాలా వరకు వైరల్‌ జ్వరాలు వస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో కిటకిటలాడుతుంటాయి. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడం ఎక్కువ మందిలో జరుగుతుంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఈ జ్వరాలమాటున పెను ప్రమాదం హెచ్చరిస్తోంది. ఓ వ్యక్తికి జ్వరం వస్తే అది సాధారణ జ్వరమా లేక కరోనా కారణంగా వచ్చిన జ్వరమా అని తెలుసుకోవడం చాలా కష్టం. కరోనా నిర్ధారణ పరీక్ష జరిపితే తప్ప తెలుసుకోవడం సాధ్యం కాదు. 


ఇప్పుడే ఎవరైనా జ్వరమంటూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతుంటే ముందు కరోనా పరీక్ష చేయించుకొని రమ్మంటున్నారు. ఈ పరీక్ష ఫలితం వచ్చే వరకు రోగికి చికిత్స అందించకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. కానీ జిల్లాలో కరోనా పరీక్షలు అంత వేగంగా జరగడం లేదు. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో శాంపిల్స్‌ సేకరణ కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగ్గట్టుగా నిర్ధారణ చేసే సామర్థ్యం లేకపోవడంతో రోజుల తరబడి ల్యాబ్‌లలో శాంపిల్స్‌ పేరుకుపోతున్నాయి. ఇటువంటి తరుణంలో జ్వరాలు విజృంభిస్తే వారందరికీ పరీక్షలు నిర్వహించడం అంత సులువైన పని కాదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓ వైపు వైద్య శాఖ ఇంటింటికీ తిరుగుతూ ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా అన్న వివరాలు తెలుసుకుంటోంది. స్థానికంగా ఫీవర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే జ్వరాల తీవ్రత పెరిగితే ఈ క్లినిక్‌ల ద్వారా చికిత్స అందించడం కష్టమవుతుందని అంచనా వేస్తున్నారు. 


పారిశుధ్యం అస్తవ్యస్తం

ఇదే సమయంలో వైరల్‌ జ్వరాలకు ప్రధాన కారణం పారిశుధ్య నిర్వహణ లోపం. అటు పట్టణాల్లో, ఇటు పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. వేసవిలో అయితే దీని వల్ల పెద్దగా నష్టం లేకపోయినా వర్షాకాలం సీజన్‌లో పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ చేపట్టకపోతే గతంలో మాదిరి జ్వరాలు విజృంభిస్తాయి. ఇప్పటి నుంచే పారిశుధ్యంపై దృష్టి సారించి ప్రజల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాబోవు మూడు నెలలు ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ముఖ్యంగా నెల్లూరు నగరంతోపాటు మున్సిపాలిటీల్లో ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉండడం, అందులో నీరు నిల్వ చేరడంతో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఇక రోడ్లపై మురికి నీరు చేరుతుండడం కూడా దోమలు ప్రబలడానికి మరో కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు ప్రమాదాన్ని అంచనా వేసుకొని అందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరముంది. ఓ వైపు జిల్లాలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు మరోవైపు పారిశుధ్య కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది. 

Updated Date - 2020-07-10T21:03:17+05:30 IST