తాగునీటి సరఫరాకు మరో రూ.8 కోట్లు

ABN , First Publish Date - 2020-06-03T10:44:16+05:30 IST

తాగునీటి సరఫరాకు జిల్లాకు మరో రూ.8 కోట్లు మంజూరైనట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామనాయక్‌ తెలిపారు.

తాగునీటి సరఫరాకు మరో రూ.8 కోట్లు

355 గ్రామాలకు ట్యాంకర్లతో నీరు..

తలుపుల, తనకల్లు మండలాల్లోనే అత్యధికం..

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామనాయక్‌..


అనంతపురం వైద్యం, జూన్‌2: తాగునీటి సరఫరాకు జిల్లాకు మరో రూ.8 కోట్లు మంజూరైనట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామనాయక్‌ తెలిపారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 355 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. పెనుకొండ డివిజన్‌లోని కదిరి, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లోనే అధికంగా నీటి సమస్య ఉందన్నారు. ఇందులోనూ కదిరి నియోజకవర్గంలోని తలుపుల, తనకల్లు మండలాల్లో సమస్య తీవ్రంగా ఉందన్నారు. పెనుకొండ డివిజన్‌లో 335 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు.


తలుపుల మండలంలో 79, తనకల్లు 60, ఆగళి 37, ఓడీసీ 35, ఆమడగూరు 31, నల్లమాడ 28 గ్రామాలున్నాయన్నారు. రొళ్ల, చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో కూడా కొన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. దాదాపు 400 ట్యాంకర్లు ఏర్పాటు చేసి, రోజుకు 1600 ట్యాంకుల నీటిని 335 గ్రామాలకు సరఫరా చేస్తున్నామన్నారు. కళ్యాణదుర్గం మండలంలో రెండు, అనంతపురం రూరల్‌ మండలంలో 18 గ్రామాలకు ట్యాంకర్లతో సరఫరా చేయిస్తున్నామన్నారు. జిల్లాకు తాగునీటి అవసరాలకు రూ.25 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఇంతకుముందు రూ.4.81 కోట్లు, తాజాగా మరో రూ.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.


తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి, ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాకేంద్రంతోపాటు ప్రతి డివిజన్‌లోనూ ఫిర్యాదుల సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆయా ప్రాంతాలకు అధికారులు, సిబ్బంది వెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పథకాలున్నా కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఉరవకొండ ప్రాంతం నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయనీ, ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. వర్షాలు కురుస్తుండటంతో కొంత ఊరట కలుగుతోందన్నారు. వర్షాలు పడకపోతే మరో 100 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2020-06-03T10:44:16+05:30 IST