పాపను కాపాడండయ్యా..!

ABN , First Publish Date - 2022-05-21T08:48:02+05:30 IST

ఆడిపాడే వయసులో ఆ చిన్నారికి పెద్ద కష్టమే వచ్చింది. నాలుగేళ్ల వయసులోనే బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడిన ఆమెను బతికించుకునేందుకు ఆ నిరుపేద తల్లిదండ్రులు అప్పోసొప్పో చేసి రూ.35 లక్షలతో ఆపరేషన్‌ చేయించారు. హమ్మయ్య గండం గట్టెక్కిందిలే అని

పాపను కాపాడండయ్యా..!

నాలుగేళ్ల చిన్నారికి బ్రెయిన్‌ ట్యూమర్‌

35 లక్షలు ఖర్చుచేసి గతేడాది ఆపరేషన్‌ 

ఇన్ఫెక్షన్‌ సోకడంతో మళ్లీ ప్రాణాపాయంలోకి

ఆపరేషన్‌కు మరో 11 లక్షలు అవసరం

దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు


కొండపి, మే 20: ఆడిపాడే వయసులో ఆ చిన్నారికి పెద్ద కష్టమే వచ్చింది. నాలుగేళ్ల వయసులోనే బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడిన ఆమెను బతికించుకునేందుకు ఆ నిరుపేద తల్లిదండ్రులు అప్పోసొప్పో చేసి రూ.35 లక్షలతో ఆపరేషన్‌ చేయించారు. హమ్మయ్య గండం గట్టెక్కిందిలే అని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో ఇన్ఫెక్షన్‌ రూపంలో ఆ చిన్నారి మళ్లీ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. మళ్లీ ఆపరేషన్‌ అవసరం. అందుకు భారీగానే ఖర్చవుతుంది. ఇప్పటికే మానసికంగా, ఆర్థికంగా కుంగిపోయిన ఆ తల్లిదండ్రులకు అంతమొత్తం సమకూర్చడం అసాధ్యం. దీంతో దాతల సాయం కోసం దీనంగా అర్ధిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో నివాసముండే టీచరు దంపతులు బూదూరి చంద్రశేఖర్‌, జ్యోత్స్నకు జోషిక అనే కుమార్తె ఉంది. జోషికకు మూడేళ్లు వచ్చేసరికి తలనొప్పి అని ఏడవడం మొదలుపెట్టింది. విజయవాడ, గుంటూరులో పరీక్షలు చేయిస్తే తలలో ట్యూమర్‌ (క్యాన్సర్‌ కణితి) ఉందని చెప్పారు.


శస్త్రచికిత్స చేయాలని, దానికి రూ.50లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అయినా అధైర్యపకుండా బిడ్డను కాపాడుకునేందుకు తాహతుకు మించి రూ.35 లక్షలు ఖర్చుచేసి గతేడాదే ఆపరేషన్‌ చేయించారు. అయితే తాజాగా తలలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. ప్రస్తుతం చిన్నారికి మద్రాసు అడయార్‌ కేన్సర్‌ వైద్యశాలలో వైద్యం చేయిస్తున్నారు. ఈ ఆపరేషన్‌కయ్యే మొత్తం ఖర్చులో 20శాతం అంటే రూ.15 లక్షలు రోగి తరఫువారే భరించాలని చెప్పినట్టు చిన్నారి తల్లితండ్రులు తెలిపారు. వైద్యశాలకు చెందిన డాక్టర్ల సాయంతో ఒక స్వచ్ఛంద సంస్థ సోషల్‌ మీడియా వేదికగా విరాళాలు సేకరిస్తోంది. దానితోపాటు చంద్రశేఖర్‌ స్నేహితులు కూడా విరాళాలు సేకరించారు. ఇప్పటివరకు దాదాపు రూ.4లక్షలు సమకూరాయి. ఇంకా రూ.11 లక్షలు అవసరమని చంద్రశేఖర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సాయం చేయవలసిన వారు తన ఫోన్‌పే నంబర్‌ 9505560596కు గానీ, యూనియన్‌ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ 520291027862513 (కొండపి బ్రాంచ్‌ - ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: యూబీఐఎన్‌0826383)కు గానీ పంపించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-05-21T08:48:02+05:30 IST