మరో కుట్రకు తెరలేపిన కర్ణాటక!

ABN , First Publish Date - 2021-06-20T05:53:14+05:30 IST

కర్ణాటక మరో కుట్రకు..

మరో కుట్రకు తెరలేపిన కర్ణాటక!

ఎగువన మరో దోపిడీ

టీబీ వెనుక జలాల్లో అక్రమ ఎత్తిపోతల పథకం

అనుమతి లేకుండా 5 టీఎంసీల జల చౌర్యం

నిర్ధారించిన మూడు రాష్ట్రాల బోర్డు సభ్యులు

ఇప్పటికే ఎల్లెల్సీ, కేసీ కాల్వలకు అందని వాటా

కర్ణాటక ఆగడాలను అడ్డుకోలేని ఏపీ ప్రభుత్వం


కర్నూలు: నీటి చౌర్యానికి అలవాటు పడిన కర్ణాటక మరో కుట్రకు తెరలేపింది. ఎలాంటి అనుమతులూ లేకుండా తుంగభద్ర జలాశయం వెనుక జలాల నుంచి 5 టీఎంసీలకు పైగా నీటిని అక్రమంగా ఎత్తిపోసుకుంటోంది. టీబీపీ బోర్డులోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక సభ్యుల పరిశీలనలో ఈ విషయం తేటెతెల్లమైంది. ఇప్పటికే కేసీ కెనాల్‌, ఎల్లెల్సీకి కోటా ప్రకారం నీరు రావడం లేదు. తుంగభద్ర డ్యాం నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు వరకూ కర్ణాటక రైతులు అడుగడుగునా నీటిని దోచుకుంటున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ ఏటా ఎల్లెల్సీ, కేసీ కెనాల్‌ కోటా నీటికి కత్తెర పెడుతోంది. దీంతో ఎల్లెల్సీ, కేసీ కాల్వల ఆయకట్టుకు సరిపడా నీరు అందడం లేదు. జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నీరందక పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అక్రమ ఎత్తిపోతల పథకాలతో తమకు మరిన్ని కష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


అక్రమంగా ఎత్తిపోతల

తుంగభద్ర జలాశయం వెనుక జలాల నుంచి కర్ణాటక ప్రభుత్వం అక్రమ ఎత్తిపోతల ద్వారా 5.02 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. రెండు నెలల క్రితం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల తుంగభద్ర బోర్డు సభ్యులు ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. తుంగభద్ర డ్యాంకు కుడి, ఎడమ వైపు కర్ణాటకలో 38 ఎత్తిపోతల పథకాలను వీరు పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న 8 ఎత్తిపోతల పథకాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న 4 ఎత్తిపోతల పథకాలను ఈ బృందం పరిశీలించింది. తాగునీటి కోసం నిర్మిస్తున్న పావగడ ఎత్తిపోతల పథకానికి 2 టీఎంసీలు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, పాత ఎత్తిపోతల పథకాలకు 2 టీఎంసీల అనుమతి మాత్రమే ఉంది. కానీ 3.710 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని ఇంజనీరింగ్‌ అధికారుల బృందం నిర్ధారించింది. కొత్తగా 3.335 టీఎంసీల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని బోర్డు సభ్యులు, ఇంజనీర్లు గుర్తించారు. మొత్తంగా తుంగభద్ర నుంచి అక్రమంగా 5.02 టీఎంసీల నీటిని వాడుకుంటున్నట్లు ఇంజనీర్ల బృందం తేల్చింది. మూడు రాష్ట్రాల ఇంజనీర్ల బృందం ఈ అక్రమాలను గుర్తించింది. అదనంగా వాడుకుంటున్న 5 టీఎంసీల నీటి విషయమై త్వరలో జరగబోయే టీబీ బోర్డు సమావేశంలో చర్చిస్తామని జిల్లా ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లు తెలిపారు. 


మొదటి నుంచి చౌర్యం

తుంగభద్ర ప్రాజెక్టులో 100 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. నది వరద నీటిని ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఎగువన, ప్రాజెక్టు కాలువల ద్వారా కర్ణాటక వినియోగించుకుంటోంది. నదిలో ప్రతి ఏటా 600 టీఎంసీల నీరు లభ్యత ఉంటే.. కర్ణాటక రాష్ట్రం ఒక్కటే 420 టీఎంసీలను వినియోగించుకుంటోందని తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు ఎగువన ఉన్న ఎత్తిపోతల పథకాలతోపాటు ప్రాజెక్టుల కాలువలకు కర్ణాటక అక్రమంగా నీటిని మళ్లిస్తోంది. దీంతో తుంగభద్ర ప్రాజెక్టు నిండడం గగనంగా మారుతోంది. ఏటా ఆలస్యం అవుతోంది. దీంతో కేసీ కెనాల్‌, ఎల్లెల్సీ ఆయకట్టుకు నీటిని విడుదలలో జాప్యం జరుగుతోందని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర నది నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఏటా 70 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ భారీ వరదలు వస్తే తప్ప శ్రీశైలానికి ఆ మేరకు నీరు రావడం లేదు. తుంగభద్ర డ్యాం నుంచి ఏపీకి హైలెవల్‌ కెనాల్‌ (హెచ్చెల్సీ), లో లెవల్‌ కెనాల్‌ (ఎల్లెల్సీ) ఉన్నాయి. ఈ రెండు కాలువల ద్వారా ఏపీకి 88 టీఎంసీల నీటి వాటా ఉంది. కానీ 50 నుంచి 60 టీఎంసీల నీరు మాత్రమే అందుతోందని రికార్డులు చెబుతున్నాయి. దీని వల్ల జిల్లాలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కేసీ కెనాల్‌తో పాటు 65 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఎల్లెల్సీ కాలువకు సక్రమంగా నీరు అందడం లేదు. ఏటా ఈ కాలువలకు కేటాయించిన నీరు రావడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో నీటి పారుదల శాఖ అధికారులు తుంగభద్ర బోర్డు అధికారులకు లేఖలు రాయడం, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికలు పంపడం తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 


శ్రీశైలానికి ఆలస్యం

తుంగభద్ర జలాశయం నుంచి శ్రీశైలం వరకు ఏటా 120 టీఎంసీల వరద ప్రవాహం ఉంటుందని అంచనా. ఈ వరద నుంచి కూడా కర్ణాటక తమ ప్రాంతాలకు 40 నుంచి 50 టీఎంసీలను అక్రమంగా మళ్లించుకుంటోంది. దీంతో కర్నూలు జిల్లాలో కాలువలకు వరద నీటి రాక తగ్గిపోతోంది. కర్ణాటకలో ఉన్న డ్యాంలు, ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా డ్యాం దిగువన 70 నుంచి 80 టీఎంసీలను కర్ణాటక వాడుకుంటోంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ తుంగభద్ర జలాలను దారి మళ్లిస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద సకాలంలో రావడం లేదు. 


భారీ వర్షాలు వచ్చినా..

భారీ వర్షాలు వచ్చిన సమయంలో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతుంది. ఆ సమయంలో కూడా కేసీ కెనాల్‌, ఎల్లెల్సీ ఆయకట్టులో ఒక పంటకు మాత్రమే నీరు అందుతోంది. రెండేళ్లుగా తుంగభద్ర నదికి భారీ వరద వస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. అయినా జిల్లాలో ఖరీఫ్‌ పంటలకు మాత్రమే కేసీ కెనాల్‌, ఎల్లెల్సీ ద్వారా నీరు అందింది. రబీలో చుక్క నీరు అందలేదు. గత సంవత్సరం కేసీ కెనాల్‌కు 31.90 టీఎంసీల నీటిని నిర్ణయించారు. కానీ 30.74 టీఎంసీల నీటిని అందించారు. ఇందులోనూ కర్ణాటక పరిధిలో 10 నుంచి 20 శాతం నీటిని దారి మళ్లించారని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎల్లెల్సీ రైతులు ఇదే కష్టాలను అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తుంగభద్ర బోర్డు అధికారులకు, కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలకు జిల్లా అధికార యంత్రాంగం  నివేదిస్తోంది. అయినా నీటి చౌర్యానికి అడ్డుకట్ట పడటం లేదు. కర్ణాటక ఎగువన ఉండడం వల్ల నీటి చౌర్యాన్ని అడ్డుకోలేకపోతున్నామని, వారు చెప్పిందే వేదంగా మారిందని జిల్లా నీటిపారుదల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. 


నివేదిక పంపుతున్నాం..

ఎల్లెల్సీ, కేసీ కెనాల్‌కు తుంగభద్ర జలాశయం నుంచి కోటా మేరకు నీరు అందడం లేదు. ఏదో ఒక కారణం చూపి, నీటిని నిలిపివేస్తున్నారు. కాలువలకు విడుదల చేస్తున్న నీటిని కూడా ఎగువ ప్రాంతంలో దారి మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తుంగభద్ర బోర్డు అధికారులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా నివేదిక రూపంలో సమాచారాన్ని అందిస్తున్నాం. 

 - శ్రీరామచంద్రమూర్తి, ఎస్‌ఈ, కర్నూలు


ఏపీ ప్రభుత్వం అడ్డుకోలేక పోతోంది..

శ్రీశైలం జలాశయం సకాలంలో నిండితే.. రాయలసీమలో ప్రధాన కాలువలకు నీటి సమస్య ఉండదు. రెండు సీజన్లలో పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. రెండేళ్లుగా శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు పుష్కలంగా నీరు చేరింది. కానీ ఎగువన కర్ణాటక ఎడాపెడ లిఫ్టు స్కీములు, కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తోంది. కర్ణాటకలో నీటి చౌర్యాన్ని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం లేదు. రెండు సంవత్సరాల నుంచి శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నా, జిల్లాలో కేవలం ఒక సీజన్‌లో మాత్రమే కాలువలకు నీరు అందించారు. తుంగభద్ర జలాశయానికి ఎగువన కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఎత్తిపోతలు, ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో జిల్లాకు మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. 

 - దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు

Updated Date - 2021-06-20T05:53:14+05:30 IST