మరో ప్రజా ఉద్యమం

ABN , First Publish Date - 2022-05-20T06:47:56+05:30 IST

‘వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అకృత్యాలు.. విధ్వంసాలు.. బాదుడే బాదుడుపై మరో ప్రజా ఉద్యమం చేపట్టాలని...

మరో ప్రజా ఉద్యమం

  1.  కార్యకర్తలే సారథులు
  2. జగనకు గుణపాఠం తప్పదు
  3.  ‘గడపగడప’లో చీదరింపులే
  4.  అభివృద్ధి అంటే మాదే
  5.  ప్రాజెక్టులను మంజూరు చేశాం
  6.  తంగెడంచలో సీడ్‌ హబ్‌ తెచ్చాం
  7.  టీడీపీ అధినేత ఉద్ఘాటన
  8.  చంద్రబాబుకు అపూర్వ స్వాగతం

 కర్నూలు/నంద్యాల, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అకృత్యాలు.. విధ్వంసాలు.. బాదుడే బాదుడుపై మరో ప్రజా ఉద్యమం చేపట్టాలని... దీనికి  టీడీపీ కార్యకర్తలే సారథ్యం వహించాల’ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కర్నూలు నగర శివారులోని కమ్మ సంఘం కల్యాణ మండలంలో ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వెల్దుర్తి మండలం భూమిరెడ్డిపల్లె, డోన పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ జగన ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై దండయాత్ర తప్పదన్నారు. కర్నూలు జిల్లాకు ఎన్నోసార్లు వచ్చానని.. ఇంతటి అపూర్వ స్పందన ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ‘టీడీపీని దెబ్బ తీయాలనుకున్న వాళ్లంతా కాలగర్భంలో కలసిపోయారు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకొని యుక్తవయసులో ఉంది. ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలులో మహానాడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకతను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరోపక్క ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాదికి ఎన్టీఆర్‌ జన్మించి నూరేళ్లు. శత జయంతి జరుపుకోబోతున్నాం’ అని బాబు తెలిపారు. 

  జగన ఓ బచ్చా.. 

‘టీడీపీ ముందు ఈ జగన ఓ బచ్చా. నా జీవితంలో ఇలాంటి విధ్వంసం సృష్టించే వ్యక్తిని.. ప్రజలను వేధించి పైశాచిక ఆనందం పొందే వ్యక్తిని చూడలేదు. కర్నూలు టీడీపీ మీటింగ్‌ పెట్టుకుంటే మున్సిపల్‌ కార్పొరేషన అధికారులు మా బ్యానర్లు తొలగించి.. వైసీపీ జెండాలు కడతారా..? నేను గుర్తు పెట్టుకుంటా.. మీకు తగినశాస్తి తప్పదు. ప్రజల పక్షాన పోరాడే వాళ్లను అడ్డగించాలంటే మీ శక్తి చాలదు.  బుల్లెట్‌లా టీడీపీ దూసుకుపోతుందే తప్ప వెనుదిరిగే ప్రసక్తే లేదు’ అని అన్నారు. వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు టీడీపీ సైనికులు భయపడరని చెప్పారు.

  ప్రజల్లో టీడీపీపై నమ్మకం పెరిగింది  

బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ప్రజల్లో నమ్మకం వచ్చిందని చంద్రబాబు అన్నారు. సమస్యను అధిగమించగలనని నమ్మకం వస్తే వీరోచితంగా పోరాడతారన్నారు. ‘ఎవరూ ఆత్మహత్మలు చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా’నని అన్నారు. ‘ప్రజలకు రక్షణగా.. పోరాటానికి నేను ముందుంటా. మా కార్యకర్తలకు ఏదైనా జరిగితే నా ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటాను’ అని అన్నారు. ‘నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, ఎరువులు అన్నిటి ధరలు పెంచేశారు. ఆర్టీసీ, కరెంట్‌ చార్జీలు భారీగా పెరిగాయి. జనంపై బాదుడే బాదుడుతో జేబులకు రంధ్రాలు పెట్టారు. ఢిల్లీ పెద్దలు మన తెలుగువారిని అవమానిస్తే... తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్‌. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఏ శక్తీ అడ్డుకోలేదు. జాబ్‌ క్యాలెండరు అని.. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ ఇచ్చిన జగన యువతను నిలువునా మోసగించార’ని బాబు విమర్శించారు.

 రేపు గాలియాత్ర చేస్తారేమో..!

‘మనం బాదుడే బాదుడే పెడితే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్లు గడప గడపకు వైసీపీ పెడితే జనం ఛీ కొట్టడంతో గడప గడపకు మన ప్రభుత్వం అన్నారు. అక్కడా ప్రజలు ఎదురు తిరుగుతుంటే ఇప్పుడు బస్సు యాత్ర అంట. రేపు గాలి యాత్ర అంటారేమో. చేసిన తప్పులు ఒప్పుకొని... సరి చేసుకోకపోతే శ్రీలంక పరిస్థితే ఏపీలో కూడా ఎదురవుతుంది. జిల్లాకు ప్రాజెక్టులు మంజూరు చేశాం. తంగెడంచలో సీడ్‌ హబ్‌ తీసుకొస్తే వైసీపీ దాన్ని నిర్వీర్యం చేసింది.  సమైక్యాంధ్రలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపాం. ఎయిర్‌పోర్టు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌ను నిర్మించాం. భవిషత్తు ఐటీ రంగానిదేనని గుర్తించి ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాను. మనం ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే.. జగన వలంటీర్‌ ఉద్యోగం  ఇచ్చారు.    రూ.5 వేల జీతం వచ్చే ఉద్యోగాలు ఇచ్చి అదే గొప్పగా చెప్పుకుంటున్నారు. పరిపాలన తెలియని దద్దమ్మ జగన. వైసీపీ నాయకులు భూకబ్జా చేయడంలో సిద్ధహస్తులు. భూగర్భం లోని ఖనిజ సంపద దోచేశారు. పేదల ఇళ్లను దోపిడీ చేసి ఇప్పుడు మధ్యతరగతికి ఇళ్లు కట్టిస్తామని మరో దోపిడీకి తెరతీశారు. జిల్లాలో నందికొట్కూరులో ఎకరం రూ.6 లక్షలు ఉంటే రూ.కోటికి రిజిసే్ట్రషన చేశారు. ఇది ఎవడబ్బ సొమ్ము?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఒకరు బెంజి మంత్రి.. మరొకరు అప్పుల మంత్రి

‘జిల్లాలో ఒకరేమో బెంజి మంత్రి.. మరొకరేమో అప్పుల మంత్రి.. హరికథలు చెప్పే మంత్రి. ఇద్దరూ అవినీతిలో పోటీ పడుతున్నార’ని చంద్రబాబు ఆరోపించారు. పేకాట వీళ్లే ఆడిస్తారు.. గనులన్నీ వీరికే కావాలి.. బినాలమీలను పెట్టుకొని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరూ ఒకేలా తయారయ్యారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే ఎవరూ చూడలేదు అనుకుంటే పొరపాటు.. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో చిత్తుచిత్తుగా ఓడించి చరిత్రహీనులుగా నిలబెడతారని అన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అవినీతిపై నాయకులు, కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు, నంద్యాల పార్టమెంట్‌ ఇనచార్జి మాండ్ర శివానందరెడ్డి,  నియోజకవర్గాల టీడీపీ ఇనచార్జిలు బీసీ జనార్దనరెడ్డి, కె.మీనాక్షినాయుడు, కోట్ల సుజాతమ్మ, బీజీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరిత, భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, ఆకెపోగు ప్రభాకర్‌, కేఈ శ్యాంబాబు, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, తిక్కారెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి, రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన చైర్మన నాగేశ్వరరావు యాదవ్‌, ఎదురూరు విష్ణువర్ధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

జోరు వానలోనూ..

 డోన, మే 19: జోరు వానలోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సరిగ్గా 5.50 గంటలకు చంద్రబాబు నాయుడు రోడ్‌షో ప్రారంభం కాగా  ...అప్పుడే వర్షం మొదలైంది. దాదాపు 40 నిమిషాల పాటు వర్షం కురిసింది. అయినా జనం వర్షాన్ని లెక్క చేయకుండా ఇళ్ల గోడల చాటున, ఫ్లైఓవర్‌ కింద బారులు తీరి నిల్చున్నారు. జడివానలోనూ యువత అలానే తడుస్తూ చంద్రబాబు కాన్వాయ్‌కు ముందు ఉత్సాహంగా కదిలారు. పట్టణంలో దాదాపు 2 గంటల పాటు రోడ్‌షో సాగింది. డోన తర్వాత చింతలపేట, గోపాలపల్లె, కొచ్చేరు, గోపాలనగరం గ్రామాల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. జనం రద్దీ ఉండడంతో చంద్రబాబు పర్యటన ఆలస్యంగా సాగింది. 

ఒక్క పరిశ్రమ రాలేదు... 

రాషా్ట్రనికి ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు పోయాయి. ఇంటిగ్రేటెడ్‌ ఉత్పాదక పవర్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు 2018లోనే అనుమతిచ్చాను. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు నిర్లక్ష్యం చేయడం వల్ల వేల ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. బీసీలకు జగన ఏం చేశారో చెప్పాలి. ఆడబిడ్డకు న్యాయం చేస్తానని చెప్పే సీఎం సొంత చెల్లికే పంగనామాలు పెట్టారు. బుగ్గనకు తగిన మొగుడు ధర్మవరం సుబ్బారెడ్డిని ఎంపిక చేశాం. 175 నియోజకవర్గాల్లో వెతికి మంచి లీడర్లను పెట్టి వైసీపీని చిత్తుచితుగా ఓడిస్తాం. ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగాయని వైసీపీ ఎంపీలే చెబుతున్నారు. రాష్ట్రం, గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది. అందుకే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. లోటు బడ్జెట్‌ ఉన్నా రుణమాఫీ చేసిన ఘనత టీడీపీకే దక్కుతుంది. 







Updated Date - 2022-05-20T06:47:56+05:30 IST