మరో అవకాశం

ABN , First Publish Date - 2020-05-29T09:46:09+05:30 IST

అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం

మరో అవకాశం

ఎల్‌ఆర్‌ఎస్‌కు సెప్టెంబర్‌ 30 వరకు గడువు పొడిగింపు

కొత్తమునిసిపాలిటీలు, విలీన గ్రామాలు, కాలనీలకు వర్తింపు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇంతకుముందు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో కొన్ని అక్రమ లేఅవుట్లు మిగిలిపోయాయి. కొనుగోలుదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మునిసిపల్‌ శాఖ ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగించింది. వికారాబాద్‌ జిల్లా పరిధిలో నాలుగు మునిసిపాలిటీలు ఉండగా, వాటిలో తాండూరు, వికారాబాద్‌ పాత మునిసిపాలిటీలు కాగా, పరిగి, కొడంగల్‌ కొత్త మునిసిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. వికారాబాద్‌, తాండూరు మునిసిపాలిటీల పరిధిలో సమీప కాలనీలు, గ్రామాలను విలీనం చేశారు.


ఇంతకు ముందు పంచాయతీలుగా కొనసాగిన పరిగి, కొడంగల్‌లను సమీప గ్రామాలను కలుపుకొని మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. అక్రమ లేఔట్లలో పరిగి రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది. పంచాయతీగా కొనసాగిన కాలంలో లేఅవుట్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు గత జనవరి 13వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లు క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. 


కొత్త మునిసిపాలిటీలు, విలీన గ్రామాలు, కాలనీలకు అవకాశం

జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో విలీన గ్రామాలు, కాలనీలు ఉన్నాయి. విలీనమైన ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లకు ఈ పథకం వర్తించనుంది. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల పరిధిలో పది గ్రామాలు, ఏడు కాలనీలు విలీనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో అనుమతి లేకుండా కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకునే అవకాశం ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్రభుత్వం కల్పించింది. విలీన గ్రామాలు, కాలనీల్లో అక్రమ లేఅవుట్లు క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు గడువు పొడిగించింది. 2018లోగా అక్రమ ప్లాట్లను కొనుగోలు చేసిన వారికే ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. ఎల్‌ఆర్‌ఎ్‌సను ఆమోదించిన తరువాత నిర్ణీత ఫీజు చెల్లించిన తదనంతరం ప్లాట్‌ను క్రమబద్దీకరించినట్లుగా పరిగణిస్తారు.


ఇదిలా ఉంటే,  మునిసిపాలిటీల్లో 2016, డిసెంబర్‌ నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నవారికి  అవసరమైన పత్రాలు, సూచించిన ఫీజు చెల్లించి పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అక్రమ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి నిర్మాణం అనుమతులు పొందడానికి అవకాశం ఉండదు. మునిసిపల్‌ శాఖ నుంచి అనుమతులు లేకపోతే బ్యాంకు రుణాలు పొందలేరు. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకుంటే ప్లాట్ల విలువ పెరగనుంది. 


అవగాహన సదస్సులెప్పుడో?

అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ పథకంపై మునిసిపాలిటీలు, విలీన గ్రామాలు, కాలనీల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు ఇంకా శ్రీకారం చుట్టలేదు. అక్రమ ప్లాట్లను గుర్తించి సంబంధిత యజమానులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తేనే ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం ఉద్దేశం సాకారమవడమే కాకుండా మునిసిపాలిటీలకు ఆదాయం సమకూరుతుంది. 

Updated Date - 2020-05-29T09:46:09+05:30 IST