ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో మరో ముసలం!

ABN , First Publish Date - 2022-10-07T09:18:45+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు పొంచి ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో మరో ముసలం!

పతనం అంచున క్రెడిట్‌ స్విస్‌, డాయిష్‌ బ్యాంక్‌!! 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు పొంచి ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌ బ్యాంకింగ్‌ దిగ్గజాలు క్రెడిట్‌ స్విస్‌, డాయిష్‌ బ్యాంక్‌ కుప్పకూలే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రెడిట్‌ స్విస్‌ గనుక కుప్పకూలితే, 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసిన అమెరికన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ ‘లేమన్‌ బ్రదర్స్‌’ దివాలా సంక్షోభం పునరావృతం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ స్విస్‌.. ప్రపంచంలోని అత్యంత ప్రభావిత, అతి పురాతన బ్యాంకింగ్‌ సంస్థల్లో ఒకటి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు క్రెడిట్‌ స్విస్‌ షేర్లు దాదాపు 60 శాతం మేర క్షీణించాయి. అలాగే, ఈ బ్యాంకింగ్‌ సంస్థ క్రెడిట్‌ డిఫాల్ట్‌ స్వాప్స్‌ (సీడీఎస్‌) ప్రీమియం 14 ఏళ్ల (2008 నాటి) గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏదైనా సంస్థ తీసుకున్న రుణాలకు బీమా లాంటిది సీడీఎస్‌. రుణం తిరిగి చెల్లింపుల్లో రిస్క్‌ పెరిగే కొద్దీ సీడీఎస్‌ ప్రీమియం కూడా పెరుగు తూ పోతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్విస్‌ కుప్పకూలవచ్చని, మరో లేమన్‌ బ్రదర్స్‌ కానుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. డాయిష్‌ బ్యాంక్‌దీ ఇంచుమించు ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 50,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్న క్రెడిట్‌ స్విస్‌ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ గత ఏడాది చివరికి 1.6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే.  


క్రెడిట్‌ స్విస్‌ పతనానికి కారణాలేంటి..? 

గడిచిన కొన్నేళ్లలో క్రెడిట్‌ స్విస్‌ పలు కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసి భారీగా నష్టపోయింది. ఉదాహరణకు, గ్రీన్‌సిల్‌ క్యాపిటల్‌ అనే కంపెనీ లెండింగ్‌ కంపెనీలో 1,000 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడిగా పెట్టింది. కానీ, ఆ కంపెనీ గత ఏడాదిలో దివాలా తీసింది. అలాగే, ఆర్కిగోస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ అనే హెడ్జ్‌ ఫండ్‌లో 550 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేయగా.. అదీ గత ఏడాది మార్చిలోనే కుప్పకూలింది. 2021లో ఈ బ్యాంకు ఏకంగా 180 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. 

Updated Date - 2022-10-07T09:18:45+05:30 IST